.
ఒకసారి అధికారం రుచి చూస్తే? ఆ రుచి మనిషి రక్తం రుచిమరిగిన పులి కంటే ప్రమాదకరమైనది!
మహారాష్ట్ర రాజకీయం పులికంటే ప్రమాదకరంగా ఉంటుంది! దేశ ఆర్ధిక రాజధాని, రాష్ట్ర రాజధాని అయిన ముంబై మీద అధికారం చెలాయించిన వాళ్లకి ఆ అధికారం లేకపోతే జీవితం ఉండదు అనేంతగా విరక్తిని కలగచేస్తుంది!
Ads
ఉద్ధవ్ ఠాక్రే, ఏకనాథ్ షిండే పరిస్థితి అలానే ఉంది. ఉమ్మడి శివసేనగా ఉన్నప్పుడు స్వంతంగా మెజారిటీ ఎప్పుడూ రాలేదు. విడిపోయాక ఇక ఎక్కడ వస్తుంది? కానీ అధికారం మాత్రం కావాలి.
ఏకనాథ్ షిండే ఆశ చూడండి. ఎన్నికలకి ముందు మోడీ, అమిత్ షా ఎలా చెప్తే అలా చేస్తాను అని వినయంగా విలేఖరుల ముందు చెప్పాడు!
ఎన్నికలు అయిపోయి ఫలితాలు రాగానే స్వరం మారింది. షిండే నేరుగా అనకుండా తన అనుచరులతో ఒక మాట అనిపించాడు : లాడ్లి బెహనా యోజన షిండే మానస పుత్రిక. ఆ పధకం విజయవంతంగా అమలు కావడం వల్లనే మహాయుతి కూటమి గెలిచింది! అంటే ఏకనాథ్ షిండే మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి అనే సందేశం పరోక్షంగా బీజేపీ అగ్ర నాయకత్వానికి ఇవ్వడం అన్నమాట!
అతి వినయం ధూర్త లక్షణం! షిండే బయటికి మాట్లాడేది ఒకటి, అమిత్ షా దగ్గర వినయంగా మరొకటి మాట్లాడతాడు. రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు ఫడ్నవిస్, షిండే … కానీ ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోయారు! అమిత్ షా మాటకి విలువ ఇవ్వలేదు షిండే!
బయటికి రాలేదు కానీ షిండే రెండు డిమాండ్లని అమిత్ షా ముందు పెట్టినట్లు తెలుస్తున్నది.
1. అయితే నేనే ముఖ్యమంత్రి అవ్వాలి.
2.నేను ముఖ్యమంత్రి కాలేకపొతే నా కొడుకు శ్రీకాంత్ షిండేకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.
వాహ్! క్యా బాత్ హై!
శ్రీకాంత్ షిండే వయసు 37 ఏళ్ళు! ప్రస్తుతం కళ్యాణ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014 లో లోక్ సభకి శివసేన తరుపున పోటీ చేసే సమయానికి వైద్య విద్యార్దిగా చివరి సంవత్సరం చదువుతున్నాడు. Yes. శ్రీకాంత్ షిండే ఆర్థోపెడిక్ సర్జన్!
37 ఏళ్ళ వైద్యుడు అయిన శ్రీకాంత్ షిండేకి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ మాత్రమే కాదు ఏ పార్టీ కూడా ఒప్పుకోదు!
అందుకే ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది! Dec 3 న ప్రమాణ స్వీకారం అని మళ్ళీ dec 5 కి వాయిదా పడింది! దీని మీద ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి?
సరే! చివరికి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవడానికి ఒప్పుకున్నా హోమ్, ఆర్ధిక శాఖలు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాడు షిండే!
ఇంత జరిగాక ఫడ్నవిస్ స్వేచ్ఛగా పాలన చేయగలుగుతాడా? ఈ సందేహం ఇలానే కొనసాగవచ్చు! వంశపారంపర్య రాజకీయాలకి బీజేపీ వ్యతిరేకం! కానీ శ్రీకాంత్ షిండేకి మంత్రిపదవి ఇవ్వక తప్పదు!
వేరే మార్గం లేదా? ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకుంటుంది!
ఉద్ధవ్ థాకరే శివసేనలో అంతర్మధనం మొదలయ్యింది! బాల్ ఠాక్రే శివసేన అధ్యక్షుడుగా ఉన్న సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారు శివసేనలో ఇంకా కొనసాగుతున్న పెద్ద తరం వారు. కాంగ్రెస్, పవార్ లతో కూడిన మహావికాస్ అఘాడి నుండి బయటికి వచ్చేయమని ఉద్ధవ్ ఠాక్రే మీద ఒత్తిడి పెరుగుతున్నది!
బాల్ ఠాక్రే శివసేన వైభవం ఎలా ఉండేది? పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ భారత జట్టు ముంబైలో ఆడాలా వద్దా అనేది బాల్ ఠాక్రే నిర్ణయం మీద ఆధారపడి ఉండేది అప్పట్లో!
BCCI పెద్దలు బాల్ ఠాక్రే అనుమతి కోసం వేచిచూసే వారు అప్పట్లో! బాల్ ఠాక్రే అనుమతి ఇవ్వకపోయినా ముంబై వాన్ఖేడే స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి సిద్ధం అయినప్పుడు శివసేన కార్యకర్తలు పిచ్ తవ్వేసిన రోజులు ఉన్నాయి!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నా బాల్ ఠాక్రేని కలవాలి తప్పనిసరిగా, అది ప్రమాణ స్వీకారం చేసే ముందు అయినా కావొచ్చు లేదా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అయినా కావొచ్చు, కానీ బాల్ ఠాక్రేని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకోవడం అనవాయితీగా ఉండేది!
వాజపేయి, లాల్ కృష్ణ అద్వాని కూడా బాల్ ఠాక్రేని కలిసేవారు!
ఇక గోధ్రా రైలు దుర్ఘటన తరువాత అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీని బర్తరఫ్ చేయాలని వాజపేయి మీద తీవ్ర ఒత్తిడి వచ్చిన సమయంలో మోడీ ముంబై వచ్చి బాల్ ఠాక్రేని కలిసి పరిస్థితి వివరించాక బాల్ ఠాక్రే అన్న మాటలు ఏమిటంటే.. చర్యకి ప్రతి చర్య ఉంటుంది అని… అసలు అయోధ్యలో కరసేవ చేసి వస్తున్న ప్రయాణికులని సజీవ దహనం చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా తిరగబడిన ప్రజల గురుంచి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అని…
బాల్ ఠాక్రే ఆ రోజు అలా మాట్లాడడం వలన ప్రధాన మీడియా తన జోరు తగ్గించుకుంది! ఎందుకంటే అన్ని మీడియాలకి ముంబైలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి! అలాంటి శివసేన వైభవం ఈ రోజున ఎలా ఉంది?
కేవలం తనకి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న ఆశ వల్ల ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయం ఈ రోజున ఇలా ఉన్నది! So! తన మీద ఒస్తున్న ఒత్తిడికి తలవంచి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికిప్పుడు మహా వికాస్ అఘాడి నుండి బయటికి వచ్చినా మళ్ళీ శివసేనకి పూర్వ వైభవం రావడం కల్ల!
అందుకే ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి చెందిన 15 మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని సం కేతాలు ఇస్తున్నారు!
అజిత్ పవార్ మాటేమిటి?
నాలుగురోజుల క్రితం శరద్ పవార్ తో సన్నిహితంగా ఉండే వ్యక్తితో అజిత్ పవార్ రహస్యంగా భేటీ అయిన సంగతి ఇంటెలిజెన్స్ పసిగట్టి విషయాన్ని అమిత్ షాకి తెలిపారు. అఫ్కోర్స్! ముంబై నుండి వెలువడే కొన్ని టాబ్లాయిడ్స్ కూడా ఈ విషయం మీద ఊహగానాలు చేస్తూ కధనాలు వండి వార్చాయి!
ఉద్ధవ్ ఠాక్రేకి ఆదిత్య ఠాక్రే…ఏకనాథ్ షిండేకి శ్రీకాంత్ షిండే! సన్ స్ట్రోక్ తప్పదు! ప్రస్తుతానికి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అంటూ ఏమీ లేకపోయినా భవిష్యత్ లో ఉండబోదు అనే గ్యారంటీ లేదు. అయితే అమిత్ షా దగ్గర భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయి! కాబోయే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కి ముందస్తు శుభాకాంక్షలు! ………… ( పొట్లూరి పార్థసారథి )
Share this Article