.
నిన్నటి నుంచీ ఎక్కడో కొట్టేస్తోంది… ఏదో ఉంది మర్మం… అదేదో అర్థం కావడం లేదు… నో, నో, అన్నీ పిచ్చి కూతలుగా తీసుకోవద్దు…
వోకే… కొందరు పంతుళ్లు పంచాంగ శ్రవణాన్ని భ్రష్టుపట్టించారు నిజం… నాయకుల కాళ్ల దగ్గర పెట్టి, క్షుద్ర భజన తాపత్రయంలో ఇష్టారీతిన నాలుగు మెప్పు వ్యాఖ్యలు చెప్పి సొమ్ము చేసుకుంటున్న మాట నిజం…
Ads
అసలు పంచాంగ శ్రవణాల సాంటిటీని వీళ్లు దెబ్బతీస్తున్నదీ నిజం… నాయకుల కొంపల్లో, ఆఫీసుల్లో వీళ్ల పంచాంగ శ్రవణాలు ఎంత శ్రవణ భయంకరమో చూస్తూ, వింటూ, జనం జాలిగా నవ్వుకుంటున్నదీ నిజం…
ఇన్ని నిజాల నడుమ… ఎవడేం కూశాడో కాసేపు వదిలేద్దాం… గత ఏడాదే కావచ్చు, గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రోగ్రాంలో… చిలుకూరి శ్రీనివాసమూర్తి అయితే ఏకంగా రాహుల్ గాంధీకి రాజయోగం, ప్రధానిమంత్రి పదవిలో మార్పులు అని జోస్యం చెప్పాడు… పలువురు మంత్రులు మరణిస్తారనీ, ఓ పత్రికాధిపతి మరణిస్తాడనీ అన్నాడు… పైగా తను పంచాంగ కర్త అట…
జనం నవ్వుకున్నారు… ఆ పాత వార్త చదివి ఇప్పుడు మరీ మరీ నవ్వుకుంటున్నారు… అసలు పంచాంగం అంటే గ్రహగతుల గణితం… వాటి ఆధారంగా, వ్యక్తుల జన్మసమయాన్ని బట్టి, వయస్సును బట్టి, వ్యక్తిగత జాతకాల్ని అనలైజ్ చేసుకోవాలి, గణించాలి, గ్రహకూటములను బట్టి బాష్యం చెప్పుకోవాలి… అంతే తప్ప, పంచాంగాలు వైదీశ్వరన్ కోయిల్ దగ్గరి నాడీ జ్యోతిష్య తాళపత్రాలు కావు…
ఆ సిద్ధాంత చర్చలోకి ఇక్కడ వెళ్లలేం గానీ… బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ ఏమన్నాడంటే… ఈ క్లిప్ చదవండి…. పోనీ, దిగువన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి, ఆ వీడియో వినండి…
తనేమంటాడంటే..? ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి జనం ఇక ఆదివారం సుక్క, ముక్క జోలికి పోకూడదు, లేకపోతే అరిష్టం, మానేస్తే జాతికి సౌభాగ్యం అని తన భాషలో తను చెప్పుకుంటూ పోయాడు… పైగా శాస్త్రం చెబుతోందట అలా… (ఏ శాస్త్రం, ఎక్కడ చెప్పింది, ఏమని అనడక్కండి, ఆయనకూ తెలియదు ఫాఫం…)
ఓహో, ఉగాది మంగళవారం వస్తే మంగళవారం సుక్క ముక్క మానేయాలా శాస్త్ర ప్రకారం…? రేవంత్ రెడ్డి పెద్దగా ఇవి నమ్మడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రతి ఆదివారం వైన్స్, బార్లు బంద్ పెట్టి, మాంసం అమ్మకాల్ని నిషేధిస్తే కథ వేరే ఉంటుంది… ప్రపంచం నవ్వుకునేలా… తను కూడా ఈ భవిష్యవాణి విని నవ్వేశాడు అక్కడే…
అసలు ఉగాది ఏ వారం వచ్చిందనడానికీ, సుక్క ముక్క మానేయడానికి ఏమైనా లింక్ ఉందా..? పంచాంగం చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే ఇదే మరి… కానీ అవి కేవలం పిచ్చి కూతలు అని చెప్పడానికి ఓ పాత ఉదాహరణ అడ్డుపడుతోంది…
ఈయనే గతంలో ఓసారి కేసీయార్ అన్నీ చూస్తున్నాడు, మూడో నేత్రం అన్నీ గమనిస్తోంది, జాగ్రత్త అని హెచ్చరించాడు… ఇప్పటిలాగే అప్పుడు అందరూ నవ్వారు… కానీ ఏం జరిగింది..? ఫోన్ ట్యాపింగ్ అనే ఓ పరమ దరిద్రమైన దందాను రుద్దాడు కేసీయార్ తెలంగాణ సమాజం మీద… అందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎలాపడితే అలా వాడేసుకున్నారు… పరమ నీచమైన పనుల కోసం కూడా…
ఎహె, ఒకరిద్దరు లంగా గాళ్ల మీద నిఘా పెడితే అది స్కామా అని తెగించి పలుకుతాడు కేటీఆర్, అది వేరే సంగతి… అప్పట్లో ఐటీ శాఖ చూసిన జయేష్ రంజన్ చెప్పాడు ఏదో సందర్భంలో… ప్రతి ఒక్కడి జాతకం మాదగ్గర ఉంది అని… సో, దేన్నీ తేలికగా కొట్టిపారేయొద్దు… ఇప్పుడు ఆదివారం సుక్క ముక్క మానేయండి, నాయకులకు నయం, జనానికి నయం అంటున్నాడు ఈ శర్మ…
అంటే… సుక్క ముక్క తో ఏదైనా ప్రమాదాన్ని, విపత్తును శంకిస్తున్నాడా ఈ పంతులు..? అదేదో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడా..? నిజంగానే ఏదో భవిష్యవాణి ఏదైనా చెప్పదలుచుకుందా తన నోటి నుంచి…
ఎహె, సండే రోజు కూడా ఓ పెగ్గు గ్లాస్, ఓ లెగ్గు పీస్ లేకుండా బతికితే అదే బతుకు అనుకుని, ఇదంతా కొట్టిపారేసేవాళ్లూ ఉన్నారు… పైగా స్టేట్ ఖజానా కూడా ఆ సండే బ్యాన్‌కు పర్మిట్ చేయదు… కిటకిటలాడే పర్మిట్ రూమ్స్ సాక్షిగా… అవసరమైతే ఇంకాస్త తాగండిరా అని తాపిస్తుంది… అవునూ, అసలు ఏం ప్రమాదం రానుందబ్బా… అదే నిన్నటి నుంచీ కొట్టేస్తోంది..!!
Share this Article