ఇందులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడానికి ఏమీ లేదు… ప్రజల ముక్కుపిండి అదనపు కరెంటు చార్జీలను వసూలు చేయడానికే నిర్ణయం తీసుకుంది… దాదాపు 3670 కోట్ల మేరకు వసూలు చేసేయాలని లెక్కలు వేసింది, రెగ్యులేటరీ కమిషన్ ముందు పెట్టింది… కమిషన్ కూడా రైట్ రైట్ తలూపింది… ఇంకేముంది..? యూనిట్‌కు 40 పైసల నుంచి 1.23 రూపాయల వరకు అదనంగా వేస్తున్నారు… మొన్నటి ఆగస్టు నుంచే కరెంటు బిల్లులు కొత్త చుక్కలు చూపించడం మొదలైంది… ఇదేమిటి మహాప్రభో అంటే, పాత చంద్రబాబు చేసిన ద్రోహం అని సహజమైన శైలిలో రాళ్లు అటువైపు విసిరేశారు ప్రభుత్వ ముఖ్యులు… అదీ ఇంధనశాఖ బాధ్యులు ఎవరూ మాట్లాడరు, అన్నీ మాట్లాడే సజ్జల మాత్రమే ఇదీ మాట్లాడతాడు… మరి మీ ప్రభుత్వం వచ్చాక ‘‘పెరిగిన విద్యుత్తు కొనుగోలు ఖర్చులను’’ కూడా ‘‘ట్రూ అప్’’ పేరిట జనం నుంచి వసూలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కదా అనడిగితే జవాబు ఉండదు… ఇప్పుడేం జరిగిందీ అంటే…
నిజానికి రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ పంపిణీ సంస్థలు ఏది చెబితే అది నమ్మేయడమేనా..? అవి చెప్పిన లెక్కలను బట్టి అదనపు చార్జీల బాదుడుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వొచ్చా..? అసలు కమిషన్, ట్రూఅప్ నిబంధనలను బట్టి పత్రికా ప్రకటనలు ఇచ్చి, బహిరంగ విచారణలు నిర్వహించి, అభ్యంతరాలు విని, సూచనలు తెలుసుకుని, అప్పుడు కదా నిర్ణయం తీసుకోవాల్సింది… అదేమీ లేకుండా ఇలా బాదుడు షురూ చేయడం అన్యాయం అంటూ కొందరు వినియోగదారులు హైకోర్టుకు వెళ్లారు… అడ్వొకేట్ జనరల్ కూడా దీనిపై పునఃసమీక్ష అవసరమని అభిప్రాయం వ్యక్తం చేయడంతో… ఇక రెగ్యులేటరీ కమిషన్ తన అదనపు బాదుడు ఉత్తర్వులపై పునఃసమీక్షకు నిర్ణయం తీసుకుంది… త్వరలో పత్రికల్లో ప్రకటించి, ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు కూడా స్వీకరించనుంది… ఎస్, మంచి నిర్ణయం… కానీ ఇదేదో మొదట్లోనే నిర్వహించాల్సింది… కోట్ల మంది ప్రజల మీద భారం వేస్తున్నప్పుడు… సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు వంటి ఎన్నో కంపోనెంట్ల మీద… స్లాబుల వారీగా చార్జీల తేడాల మీద… అదనపు కొనుగోళ్ల ఖర్చుల మీద విచారణ జరిపాకే కదా నిర్ణయం తీసుకోవాల్సింది… పనిలోపనిగా ఎవరైనా వినియోగదారులు సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తే బెటరేమో… ఇకపై ఏకపక్షంగా ట్రూఅప్ బాదుడు నిర్ణయాలు తీసుకోకుండా, ఏమైనా మార్గదర్శకాలు జారీచేయడానికి వీలుంటుంది…!
Ads
Share this Article