ఫలానా హీరో సినిమా వారం రోజుల్లో 500 కోట్లు కుమ్మేసింది… ఒక వార్త… రష్యా, జపాన్, చైనా, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వందల కోట్లు సంపాదించింది… నెట్ ఇంత..? గ్రాస్ ఇంత..? ఇలాంటి వార్తలు బోలెడు చదువుతుంటాం కదా… వాటిల్లో అధికశాతం ఫేక్ ఫిగర్సే ఉంటాయి… చాలా సినిమాలకు సంబంధించి థియేటర్లకు ఇచ్చే వాటా పోను బయ్యర్‌కు మిగిలేది తక్కువే… మరీ హిట్టయితే తప్ప…
థియేటర్ డబ్బు, శాటిలైట్ హక్కులు, ఓటీటీ రైట్స్, పైగా పలు భాషల రిలీజుల నుంచి వచ్చే అదనపు సొమ్ము… గతంతో పోలిస్తే ఒక సినిమాకు నాలుగైదు మార్గాల్లో డబ్బు వస్తోంది… నిర్మాతలను గట్టెక్కించాలి… కానీ జరగడం లేదు… నిర్మాణవ్యయం అదుపు తప్పింది… స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర 24 క్రాఫ్ట్స్ రెమ్యునరేషన్లు విపరీతంగా పెరిగిపోయాయి… అవన్నీ వసూలు చేసుకోవడానికి టికెట్ల ధరల పెంపు… సగటు మనిషికి సినిమా కూడా ఓ భారంగా మారుతోంది…
సరే, ఈ స్థితిలో అత్యంత చెత్త రికార్డులు కూడా నమోదవుతుంటాయి కదా… ఈ సంవత్సరానికి అత్యంత చెత్త, ఫ్లాప్ కేటగిరీలో అవార్డు పొందిన సినిమా ఏది..? నో, కంగనా రనౌత్ నటించిన చంద్రముఖి-2 కాదు… నో, నో, ప్రభాసుడి ఆదిపురుష్ అసలే కాదు… సూపర్ డూపర్ డిజాస్టర్ సినిమా ఏదయ్యా అంటే… ది లేడీ కిల్లర్… (మోహన్‌బాబు నటించిన అదేదో ఓ విచిత్ర సినిమా పేరు టైమ్‌కు గుర్తురావడం లేదు…)
Ads
ఎవరెవరో అల్లాటప్పా థర్డ్ రేట్ యాక్టర్లు నటించిన చిత్రమేమీ కాదు… దాదాపు 45 కోట్లు ఖర్చుపెట్టారు… బాక్సాఫీసు వసూళ్లు ఎంతో తెలుసా..? మీరు ఊహించలేరు… అంత దారుణం… జస్ట్, లక్ష రూపాయలు మాత్రమే… నిజం… హీరో అర్జున్ కపూర్… హీరోయిన్ భూమి పెడ్నేకర్… పైగా అది టీ-సీరీస్ వాళ్ల సినిమా… అసలు ఈ పేరుతో ఓ సినిమా వచ్చింది, పోయింది అనేది కూడా గుర్తులేదు ఇండస్ట్రీలో చాలామందికి…
సినిమాలకు ప్రేక్షకులే రేటింగ్స్ ఇచ్చే ప్రముఖ వెబ్‌సైట్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ప్రకారం… 2023లో అతి తక్కువ రేటింగ్ వచ్చిన సినిమా కూడా ఇదే… ది లేడీ కిల్లర్ మూవీ నవంబర్ 3న రిలీజైంది… అజయ్ బెహల్ డైరెక్ట్ చేశాడు… అంచనాలకు మించి ప్రొడక్షన్ ఖర్చు… అసలు షూటింగులో ఉండగానే ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు… ఏదయితే అదయింది అనుకుని, అసలు సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయకుండా ఓ రఫ్ కాపీని రిలీజ్ చేసిపారేశారు…
వాళ్ల దయ, ప్రేక్షకుడి ప్రాప్తం… నవంబర్ 3న దేశవ్యాప్తంగా కేవలం 12 షోలతో రిలీజైంది… తొలి రోజు కేవలం రూ.38 వేలు మాత్రమే వసూలు చేసింది… చివరికి లక్ష రూపాయల లైఫ్ టైమ్ వసూళ్లతో అడ్రస్ లేకుండా పోయింది… ఫాఫం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ తీసుకుంది… దాని వ్యూయింగ్ మినట్స్ సంఖ్య ఎంతో తెలియదు… అసలు సినిమా ప్రమోషన్లకు కూడా నటుల్లో ఒక్కరూ ముందుకు రాలేదు… ఐఎండీబీలోనూ ఈ ఏడాది అత్యంత తక్కువ రేటింగ్ పొందిన సినిమా కూడా ఇదే… కేవలం 1.5 రేటింగ్… ఫాఫం…
Share this Article