‘‘తెలుగుదేశం సూపర్‌హిట్’’ అనేది ఎన్టీయార్ తొలిసారి అధికారం పొందిన ఎన్నికల ఫలితాలకు ఈనాడు పెట్టిన హెడింగ్… సినిమా నేపథ్యమున్నవాడు కదా, ఈ సినిమా కూడా హిట్టయ్యిందనే అర్థం… కాంగ్రెస్‌వాళ్లు అప్పట్లో ఆడిపోసుకునేవాళ్లు సినిమావాడికి సీఎం కుర్చీ కావాలట అని… ఏయ్, సినిమావాడే ఏం చేశాడో చూశారా అనే అర్థం… నిజానికి ఎన్టీయార్‌కు అప్పటికి ప్రజలు, సమస్యలు, రాజకీయాలు తెలియవు, తెలుగుదేశాన్ని కూడా ఓ సినిమాలాగే చూశాడు… ఆ మార్మిక అర్థం కూడా ఆ హెడింగులో ఉంది… అది బయటికి చెప్పబడదు…
ఎన్నాళ్లకెన్నాళ్లకు… ఆంధ్రజ్యోతిలో ఓ హెడింగ్… అదిరిపోయింది… కొందరికి నచ్చకపోయినా సరే, వాస్తవ స్థితిని ప్రతిబింబించేలా చమత్కారాన్ని దట్టించి పెట్టిన హెడింగ్… భలే పేలింది… ‘‘గెలవడమే పదివేలు’’… ఇందులో ఓ స్పాట్ వార్త చెప్పడమే కాదు, ఓ స్టోరీని కూడా ఇరికించేశారు… నిజమే కదా… ఈ గెలుపు కోసం కేసీయార్ తన శక్తియుక్తులు, సాధనసంపత్తి, వందల కోట్లు ఖర్చుపెట్టాడు… ఈ గెలుపు తనకు ఎంత అవసరమో తనకే ఎక్కువ తెలుసు…
ఈ స్థితిలో… గెలవడమే పదివేలు అనే హెడింగ్ చాలా ఆప్ట్… హమ్మయ్య, ఎలాగైతేనేం గెలిచాంరా బాబూ, వాచిపోయింది, ఇదేం గెలుపురా బాబూ, థాంక్ గాడ్, గెలిచి బయటపడ్డాం బాబూ అనే అర్థమే కాదు… హేయ్, ఏకంగా పదివేల మెజారిటీతో గెలిచాం చూశారా అని బీజేపీకి చెబుతున్నట్టు కూడా…! అంతేకాదు… ఈ ఎన్నిక జస్ట్, వోట్లను కొనుగోళ్లు, ధరల ముచ్చటే కదా… టీఆర్ఎస్ 5 వేలు, బీజేపీ 4 వేలు ఇచ్చిందట… ఉజ్జాయింపుగా పదివేలు… ఆ 10 వేల ధరనూ హెడింగ్ ప్రతిబింబించింది…
Ads
పోటాపోటీ, టఫ్ పోటీ వంటి అనేకానేక విశ్లేషణలు దాటొచ్చిన సంబురం… అందుకే ఏకంగా 10 వేల మెజారిటీతో గెలిచాం చూశారా అని జెండా ఎగరేసి ప్రకటిస్తున్నట్టుగా కూడా ఓ అర్థం… అన్నింటికీ మించి టీఆర్ఎస్ పార్టీ నాయకులు పొందిన రిలీఫ్ ఆ హెడింగ్‌లో ధ్వనించింది… వాడవాడకూ జాతర, కులసమావేశాలు, మందు, మటన్… డబ్బులు, బీసీ నాయకుల కొనుగోళ్లు, అంతకుముందే లెఫ్ట్ బేరం… సూదీ, దబ్బనాల పార్టీలు అని ఈసడించిన కేసీయార్ చంకలోనే ఎక్కిన లెఫ్ట్ నాయకులు… ఇంతా చేస్తే డబ్బులు మాత్రమే గెలిపించాయి… ఎవరూ ప్రేమతో ఓటు వేయలేదు… జనంలో ఏదో తేడా కనిపిస్తోంది… అవును, ఈ స్థితిలో గెలవడమే పదివేలు…
హెడింగ్ మొత్తం కథ చెప్పాలి… లోపల స్టోరీలోని వాక్యాలు చెప్పలేని, చెప్పని కథను మార్మికంగా చెప్పాలి… అన్నీ బిట్వీన్ ది లైన్స్ కుదరవు… అవి చెప్పాలంటే రాజకీయాల మీద ఓ అవగాహన ఉండాలి… ఆ దిశలో ఆంధ్రజ్యోతి హెడింగ్ బాగుందనిపించింది… కాదు, బాగుంది… ఇదే కాదు, మొత్తం ఫలితాల కవరేజీ కూడా బాగా డీల్ చేసింది… ‘గట్టెక్కినా గడ్డుకాలమే’ అంటూ టీఆర్ఎస్‌కు అప్పుడే అయిపోలేదు, ముందుంది అసలు కథ అనే విశ్లేషణ… చివరకు సీఎం స్వయంగా ఓ ఊరికి ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఉపఎన్నిక బహుశా దేశంలోనే మొదటిదేమో…
ఇవేకాదు, బీజేపీ బట్టలూడదీసేందుకు ఏవో ఆడియోలు, వీడియోల కథలు నిర్మించి… నానా యాగీ చేసి… జనం ఎవరూ పట్టించుకోక… ఇంత ప్రయాస వేస్టయిపోయిందా అని డీలాపడే దశలో ఈ గెలుపు నిజంగానే టీఆర్ఎస్‌కు పదివేలు… అసలు ఈ ఉపఎన్నికను నెత్తి మీద తెచ్చుకోవడమే బీజేపీ ఫూలిష్ ప్లాన్… అది రాస్తే చాలా పెద్ద కథ అవుతుంది…
ఎవరో రాసుకొచ్చారు… కాంగ్రెస్ ముక్తభారత్ దిశలో మోడీ, అమిత్ షా ప్లాన్ మళ్లీ సక్సెస్ అని… తప్పు… ఈరోజుకూ తెలంగాణలో లండుకో మొండికో ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా మోసేవాడున్నాడు… బీజేపీకి లేరు… అసలు 20 సీట్లలోనైనా దానికి బలమైన అభ్యర్థులున్నారా అనేది పెద్ద ప్రశ్న… రాష్ట్రంలో వెంటనే అధికారం అనేది ఓ కల… ముందు పార్టీని చక్కదిద్దుకుంటే మేలు… అసలు మునుగోడులో రాజగోపాలరెడ్డికి పార్టీ వర్గాల నుంచి నిజాయితీగా సహకారం అందిందా అనే సందేహాలూ ఉన్నయ్…
డబ్బులున్న పెద్ద నాయకులు వస్తేనే పార్టీ బలపడుతుంది, నిలబడుతుంది అనే ఆలోచన ధోరణే పెద్ద తప్పు… ఈ ఓటమి బీజేపికి ఆ నిజాన్ని బోధపరిచింది… వెళ్లాల్సింది జనంలోకి… కానీ పార్టీలోనే అంతర్గతంగా బోలెడు సమస్యలు… ఈ కోణంలో ‘రాజగోపాల్, కోరి తెచ్చుకున్న ఉపద్రవం’ అనే వార్త… హస్తం ఎందుకు తడబడింది అని కాంగ్రెస్ కోణంలో ఓ విశ్లేషణ… అసలు పైసలు పంచకపోయినా 23 వేల ఓట్లు వచ్చాయి, అదీ కోమటిరెడ్డి డబుల్ గేమ్ ఆడిన స్థితిలోనూ… అంటే టీఆర్ఎస్‌కు ప్రత్యర్థి కాంగ్రెసే కదా…
రేవంత్‌కు మళ్లీ సీనియర్ల తలపోటు మీద మరో వార్త… మొత్తానికి ఫలితాల కవరేజీ బాగుంది… (బీఆర్ఎస్‌కు తొలిగెలుపు అనే వార్త మాత్రం టెక్నికల్‌గా తప్పు…) సరే, బరిలో చంద్రబాబు ఉంటేనే ఆంధ్రజ్యోతికి బుర్ర తిరుగుతుంది… పాత్రికేయం మాయమవుతుంది… భజన, పక్షపాతం నెత్తికెక్కుతాయి… చంద్రబాబు లేడుగా… అందుకే మునుగోడు మీద హెడింగే కాదు, కవరేజీ ‘సరైన పాత్రికేయం’ దిశలోనే ఉంది… అన్నట్టు, నిన్నటి కొత్త పలుకు వ్యాసంలో రాధాకృష్ణ ఆ కేసీయార్ వీడియోలను దేశంలో, రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోలేదని, సినిమా తుస్సుమందని రాశాడు..! తెలంగాణలో ‘‘ఒక్కడే కనిపిస్తున్నాడు…’’
Share this Article