.
1997 ద్వితీయార్ధంలో నేను విజయవాడ వార్త రిపోర్టర్‌గా పనిచేస్తున్న సందర్భమది.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈటీవీ, ఈనాడు పత్రికలకు ఎవ్వరూ సినిమా అడ్వటైజ్‌మెంట్స్ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు…
అప్పట్లో దాసరి వర్సెస్ రామోజీ వేడిగా నడిచేది కదా… తరువాత చాన్నాళ్లకు గానీ సద్దుమణగలేదు… సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న రోజు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విజయవాడ ఐలాపురం హోటల్‌లో బస చేశారు.
Ads
దాసరి నిర్ణయంపై అప్పుడు ఎఫ్‌డిసి చైర్మన్‌గానో, ‘మా’ గౌరవ అధ్యక్షుడిగానో (ఈ రెండింటిలో ఏదో ఒక పదవి సరిగ్గా గుర్తు లేదు) ఉన్న కృష్ణ అభిప్రాయం తీసుకునేందుకు నేను మరొక రిపోర్టర్ వెళ్లాము.
రాత్రి పదిగంటలవుతోంది. విజయవాడ అంటేనే కృష్ణకు విపరీతమైన ఫాన్స్, కృష్ణ ప్రజాశక్తి పేరిట చేసే హడావుడి మామూలుగా ఉండేది కాదు. ఇక ఆరోజు హోటల్ చుట్టూ మొత్తం అభిమాన జనసందోహం.. ఆ హోటల్ యజమానిని పట్టుకొని ఎలాగోలా లోపలికి వెళ్లాం.
రూం నెంబర్ తెలుసుకుని కాలింగ్ బెల్ కొట్టాము. విజయనిర్మల గారు వచ్చి తలుపు తీశారు. దాసరి గారి నిర్ణయంపై కృష్ణ గారి అభిప్రాయం కావాలని వచ్చాము… వార్త హైదరాబాద్ వాళ్ళు పంపించారు అని చెప్పాము.
రాత్రి పదవుతోంది కదా… కృష్ణ గారు రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పారు. రెండు నిమిషాలు మేడం.,. మాట్లాడి వెళ్తాం అని చాలా ప్లీజింగ్ ధోరణిలో రిక్వెస్ట్ చేశాము, ఆమె లోనికి వెళ్లి కృష్ణ గారిని అడిగి వచ్చి… సరే లోనికి రండి అన్నారు.. కృష్ణ గారు మంచంపైనే కూర్చుని ఉన్నారు. వైట్ అండ్ వైట్ లాల్చీ పైజమా వేసుకుని నిండు చంద్రుడిలా మెరిసిపోతున్నారు.
మేం వెళ్లి ఎదురుగుండా కుర్చీల్లో కూర్చుని విషయం అడిగాము. ఇందుకు ఆయన విజయనిర్మల గారి వంక చూశారు. వెంటనే ఆమె… మేం ఇంకా దాసరి గారి ప్రకటన చూడలేదు. పూర్తి వివరాలు తెలుసుకుని హైదరాబాద్ వెళ్లిన తర్వాత గానీ కృష్ణ గారు ఈ విషయంపై మాట్లాడ లేరు అని చెప్పారు. ఒకటి రెండు సార్లు అడిగినా కుదరదని స్పష్టంగా చెప్పేశారు.
ఇక ఆ విషయం వదిలేసి సినిమాల గురించి మాట్లాడాము. అదే ఏడాది జనవరిలో వచ్చిన చిరంజీవి హిట్లర్ సినిమా గురించి ప్రస్తావించారు. చిరంజీవికి మరో హిట్ సినిమా అంతే గానీ ఇండస్ట్రీ హిట్ కాదన్నారు…
ఇక మహేష్ హీరోగా అరంగ్రేటం సినిమా ఎప్పుడు అని అడిగితే… మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నాం… మంచి హీరోయిన్ కూడా దొరకాలి అని అన్నారు.
వెంటనే మేము ఉత్సాహంగా అప్పటి సంచలనం ప్రేమించుకుందాం రా హీరోయిన్ అంజలా ఝవేరి గురించి ప్రస్తావించాం. ఇందుకు ఆయన బదులిచ్చిన మాట… ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పటి ఆయన ఆర్ధిక స్థితిని కూడా చెబుతుంది.
ఇంతకూ ఆయన అన్నమాట ఏమిటంటే… ’’ఆమె చాలా కాస్ట్‌లీ అట కదా.. చాలా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందంటున్నారు…’’ నిజంగా ఆయన అన్న ఆ మాట నన్ను చాలా ఆలోచనల్లో పడవేసింది.
శ్రీదేవి, జయప్రదలను బాలీవుడ్‌కి తీసుకువెళ్ళిన కృష్ణ… అందాల మందాకినిని టాలీవుడ్‌కి తీసుకువచ్చిన కృష్ణ నోటి వెంట హీరోగా తన వారసుడి తొలి సినిమా హీరోయిన్ కోసం ’’అంత కాస్ట్‌లీ అట కదా’’ అని ఆలోచించాల్సిన పరిస్థితిలో సూపర్‌స్టార్ ఉండటం చాలా ఆశ్చర్యమేసింది.
ఆ ఆలోచనలతోనే సూపర్‌స్టార్ కృష్ణ గారిని కలిశాం అనే ఆనందంతో హోటల్ నుంచి బయటకు వచ్చేశాం. కృష్ణ గారు తాను మాట్లాడాలనుకునే ఏ విషయమైనా కల్మషం లేకుండా మాట్లాడతారు అనే దానికి బహుశా మాతో మాట్లాడిన మాటలే నిదర్శనం…. (ఆయన జయంతి రోజున ఆ భేటీ హఠాత్తుగా గుర్తొచ్చింది… అజ్ఞాతి)
Share this Article