.
Director Devi Prasad.C…. హీరో అయిన తొలినాళ్ళలో కృష్ణ గారు కొందరు మిత్రులతో పాండీబజార్‌లోని శాంతాభవన్ హోటల్ ముందు నుంచొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారట.
అప్పుడే సైకిల్ మీద అక్కడికొచ్చిన శోభన్‌బాబు గారు “ఏమిటి అందరూ అంత హుషారుగా వున్నారు” అని అడిగితే ఒకాయన “మన కృష్ణ కొత్త సినిమాలో హీరోగా బుక్ అయ్యాడు”అన్నారట. (అప్పటికి ఇంకా సైకిళ్లే)
Ads
శోభన్‌గారు కృష్ణ గారికి కంగ్రాట్స్ చెప్పి ఎవరిపిక్చర్?అని అడిగారట.
“నిర్మాతలు సుందర్‌లాల్ నహతా, డూండీ గార్లు తియ్యబోతున్న గూఢచారి 116” అని చెప్పారట కృష్ణ గారు.
శోభన్‌బాబు గారు ఆశ్చర్యపోతూ “అదేంటి మొన్న ఆ పిక్చర్‌లో హీరోగా నాకు ఛాన్స్ ఇస్తామని చెప్పారు” అన్నారట.
దానికి కృష్ణగారు “ఏమో మరి ఈరోజే నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు” అన్నారట.
శోభన్ గారు ఆఫీస్‌కి వెళ్ళి అడిగితే “అందరం కలిసి ఆ నిర్ణయం తీసుకున్నాము. అయినా ఇందులో మీక్కూడా మంచి వేషం ఉంది” అని చెప్పారట.
ఆ సినిమా రిలీజ్ తరువాత ఓవర్‌నైట్ కృష్ణ గారు స్టార్ అయిపోయారట. శోభన్‌బాబు గారు వేసిన పాత్రకీ మంచి పేరొచ్చిందట.
ఇవన్నీ కృష్ణ గారు స్వయంగా చెబుతుంటే స్వయంగా విన్న విషయాలే.
షాట్ గ్యాప్స్‌లో మా గురువు గారు(కోడి రామకృష్ణ) సీనియర్ యాక్టర్స్ ఎవరు ఉన్నా వారి పాత సంగతుల గురించి అడుగుతుండేవారు.
సినిమా పిచ్చోడిని కనుక వాళ్ళు చెబుతుంటే కన్నార్పకుండా విని ఆ విషయాలన్నిటినీ నా జ్ఞాపకాల జోలెలో దాచుకోవటం నాకు సరదా.
మొదట “అల్లూరి సీతారామరాజు” సినిమాలో అగ్గిరాజు పాత్రకి మహానటుడు “ఎస్.వీ.రంగారావు” గారిని బుక్ చేశారట. అవుట్‌డోర్లో ఆయన కోసం రెండు రోజులు వేచి వున్నా ఏవో కారణాల వల్ల ఆయన రాలేదట.
అప్పటికప్పుడు మద్రాస్ నుండి “బాలయ్య” గారిని పిలిపించి ఆ పాత్రలో నటింపచేశారట.
ఎస్.వీ.ఆర్. గారు చేసి ఉంటే ఎంత గొప్పగా ఉండేదో ఊహించగలం కానీ బాలయ్య గారికి కూడా గొప్ప పేరొచ్చింది ఆ పాత్రతో.
శోభన్‌బాబు గారికి తొలుత స్టార్‌డమ్ తెచ్చిన “మనుషులు మారాలి” సినిమాలో కూడా కృష్ణ గారినే హీరోగా బుక్ చేశారట.
రాత్రిపగలూ పనిచేస్తున్నా దానికి డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకపోయారట కృష్ణ గారు.
ఆ సినిమా తర్వాత శోభన్‌బాబు గారు వెనుతిరిగి చూడలేదు.
దాసరి గారి “కటకటాలరుద్రయ్య” సినిమాలో మొదట కృష్ణ గారే హీరో అట.
ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చిందట.
దాసరి గారి డేట్స్ కి కృష్ణ గారి డేట్స్ మ్యాచ్ కాకపోవటం వల్ల తప్పుకున్నారట. ఆ సినిమాతో “కృష్ణంరాజు” గారు రెబెల్ స్టార్‌గా నిలిచిపోయారు.
అదే దాసరి గారి “బండోడు గుండమ్మ” సినిమా ప్రారంభోత్సవానికి ముందురోజు వరకూ హీరో కృష్ణంరాజు గారట. ఏవో కారణాల వల్ల ప్రారంభోత్సవానికి హీరోగా కృష్ణ గారు ఎంటర్ అయితే అందరూ ఆశ్చర్యపోయారట.
చిరంజీవి గారికి అద్భుతమైన స్టార్‌డమ్ తెచ్చిన “ఖైదీ” సినిమాకి కూడా మొదట హీరో కృష్ణ గారేనట. అయితే ఆ కధ వేరే అట.
కృష్ణ గారి అభిమానిగా ఆ విషయాలన్నీ స్వయంగా కృష్ణ గారి నోటి నుండే వినగలగటం నాకు గొప్ప అనుభూతి.
సినిమాల్లోనే కాదు ఏ రంగంలోనైనా ఎప్పుడు ఏ అవకాశం ఎవరిని వరిస్తుందో, ఏ విజయ తీరాలకు చేరుస్తుందో కాలానికి మాత్రమే తెలుసు.
ఆశావాద దృక్పధంతో వేచివుండటమే మన పని.

(ఫోటోలో సూపర్‌స్టార్ చెబుతున్న కబుర్లు ఆసక్తిగా వింటున్నవారిలో రైట్‌సైడ్ బ్లూషర్ట్‌లో వున్న మీసాల్లేని అబ్బాయిని నేనే.) _____ దేవీప్రసాద్.
Share this Article