.
సాధారణంగా కోర్టుల్లో న్యాయమూర్తులు కొన్ని కేసుల్లో చేసే వ్యాఖ్యానాల పట్ల పెద్దగా ఎవరూ స్పందించరు, ప్రత్యేకించి భిన్నాభిప్రాయాలు వెలువరించరు… మరీ సుప్రీం కోర్టు జడ్జిల వ్యాఖ్యల మీద… నిజానికి విచారణల సందర్భంగా వెలువరించే వ్యాఖ్యలు వేరు.., అంతిమంగా తీర్పులే ముఖ్యం…
అది కోర్టుల పట్ల, జడ్జిల పట్ల గౌరవం కావచ్చు, నచ్చకపోయినా ఓ అభిప్రాయాన్ని వెలువరించడం అంటే అనవసరంగా న్యాయవ్యవస్థతో గోక్కోవడం దేనికనే భావన, భయం కూడా కావచ్చు… తీర్పుల పట్ల పెద్దగా న్యాయనిపుణుల నుంచి స్పందన కనిపించదు…
Ads
తీర్పులకు సంబంధించి జడ్జిలకు మోటివ్స్ అంటగట్టనంతవరకూ… తీర్పులపై సాధికార, నిర్మాణాత్మక, గుణాత్మక విశ్లేషణ తప్పు కాదని న్యాయవ్యవస్థే అంగీకరిస్తుంది… ఇదంతా ఎలా ఉన్నా… కోర్టుల్లో జడ్జిలు వెలువరించే వ్యాఖ్యానాలే పలుసార్లు ప్రధానంగా వార్తాంశాలవుతున్నాయి… సోషల్ మీడియా కొన్నిసార్లు స్పందిస్తోంది… మెయిన్ స్ట్రీమ్ మీడియా సంయమనం పాటిస్తున్నా సరే…
తాజా ఉదాహరణ… మధ్యప్రదేశ్‌లో దెబ్బతిన్న విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు… ఇవి విమర్శలకు కారణమవుతున్నాయి…
మంగళవారం ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ… సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ విషయం భారత పురావస్తు సర్వే (ASI) పరిధిలోకి వస్తుందని, పిటిషనర్ ఈవిషయంలో జోక్యం కోసం “విష్ణువును ప్రార్థించండి” అని కోరింది…
“ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం… ఇప్పుడే వెళ్లి దేవుడినే ఏదైనా చేయమని అడగండి… మీరు విష్ణువుకు గొప్ప భక్తుడని అంటున్నారు… కాబట్టి ఇప్పుడే వెళ్లి ప్రార్థన చేసుకోండి…” అని సుప్రీంకోర్టు పిటిషనర్ రాకేష్ దలాల్‌తో చెప్పింది… అంతేకాదు, శైవులు, వైష్ణవులు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చింది…
జవారీ ఆలయంలో ధ్వంసమైన 7 అడుగుల విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు నుండి ఆదేశాలు కోరుతూ ఈ పిటిషన్ దాఖలు చేయబడింది… మొఘల్ దండయాత్రల సమయంలో విగ్రహం దెబ్బతిన్నదని, అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, దానిని పునరుద్ధరించలేదని లేదా మరమ్మత్తు చేయలేదని అది పేర్కొంది…
విగ్రహ పునరుద్ధరణ కేవలం పురావస్తు శాస్త్రానికి సంబంధించినది కాదని, విశ్వాసానికి సంబంధించినదని, అధికారుల వైఫల్యం భక్తుల పూజించే ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు…
ఈ తీర్పు బహిరంగంగా వెలువడగానే, ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ప్రధాన న్యాయమూర్తి అభిశంసనకు పిలుపునిచ్చే పోస్టులు కూడా వైరల్ అయ్యాయి, ఈ వ్యాఖ్యలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనేది విమర్శల సారాంశం…
విష్ణువు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని కోరుతూ అనేక మంది న్యాయవాదులు CJI గవాయికి లేఖ రాశారు… న్యాయవాది వినీత్ జిందాల్ తన లేఖ కాపీని రాష్ట్రపతికి కూడా పంపారు… “రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తారని, మత విశ్వాసం గౌరవాన్ని కాపాడుతారని నేను ఆశిస్తున్నాను” అని జిందాల్ CJIకి రాసిన లేఖలో పేర్కొన్నారు…
మరో న్యాయవాది సత్యం సింగ్ రాజ్‌పుత్, CJI గవాయికి బహిరంగ లేఖ రాసి, ఆయన తన వ్యాఖ్యలను పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలని కోరాడు… (నో, ఆర్ఎస్ఎస్ నుంచి ఏ స్పందన లేదు… ఇప్పుడే కాదు, శబరిమల, శనిసింగాపూర్ వంటి ఇష్యూల్లో కూడా…)
అంతెందుకు,, కొలీజియం స్థానంలో NJAC ఏర్పాటును పార్లమెంటు చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది… మోడీ ప్రభుత్వం కిమన్నాస్తిగా ఉండిపోయింది… ఈ దేశంలో అల్టిమేట్ పార్లమెంటా.,? సుప్రీంకోర్టా అనే ప్రశ్నల్ని లేవనెత్తింది ఇది… రాష్ట్రపతికీ బిల్లుల ఆమోదం కోసం గడువు పెడుతోంది… రాష్ట్రపతి స్పందించి ప్రశ్నలు సంధిస్తే ఈరోజుకూ జవాబు లేదు…
నిజంగానే ‘‘వెళ్లి మీ దేవుడిని కోరుకో’’ అనే వ్యాఖ్యను ఈ దేశ అపెక్స్ కోర్టు చీఫ్ జడ్జి ఎలా సమర్థించుకోగలరు..? అనేదే సోషల్ మీడియాలో, కొందరు న్యాాయవాద వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన అభ్యంతరం… ఇక కొందరు లేవనెత్తుతున్న అభిశంసన విషయానికి వస్తే… అదంత వీజీ కాదు… ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిని అభిశంసించడం సులభం కాదు, పైగా యాంటీ బీజేపీ పార్టీలన్నీ వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా స్పందించదలుచుకుంటే వ్యతిరేకిస్తాయి… విష్ణు విగ్రహం అనగానే వాటి స్పందన ధోరణి మారుతుంది కదా…
మార్చి 2025లో.., ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు దొరికింది… ఆరు నెలల తర్వాత కూడా ఆయనపై అభిశంసన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది… స్వయంగా సుప్రీం కోర్టు వేసిన ప్యానెల్ అతన్ని దోషిగా నిర్ధారించింది, గౌరవంగా రాజీనామా చేయమని సూచించింది… కమిటీ రిపోర్ట్ మీద మళ్ళీ అదే సుప్రీంకు అప్పీల్ కు వెళ్ళాడు…
అక్కడ కూడా అదే ఫలితం… ఆ రిపోర్ట్ కేంద్రానికి పంపారు సదరు కోర్టు వారు… ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ హఠాత్ రాజీనామా అనంతరం… అభిశంసన ప్రక్రియ ఆగింది… మళ్లీ మొదలు కావాలి… మళ్లీ లోకసభ కమిటీ వేశారు, అది విచారణ చేయాలి… ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి… దాన్ని సభలో చర్చించాలి… ఈలోగా అయన పదవీ విరమణ అయిపోతుంది… ప్రస్తుత CJI పదవీకాలం ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది… సో, ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు… కానీ సీజేఐ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి..!!
Share this Article