పోలీసులు ఏదో తప్పుడు కేసు పెట్టారు… మీరు ఏళ్ల తరబడీ సతాయింపబడ్డారు… మీ జీవితం బర్బాద్ అయిపోయింది… ఇజ్జత్ పోయింది… చివరకు ఏ కోర్టో కొట్టేసింది… కానీ ఆ తప్పుడు కేసు వల్ల మీకు జరిగిన నష్టానికి పరిహారం ఏమిటి..? కోల్పోయిన కొలువు, పరువు, ఆనంద క్షణాలు, సాధించాల్సిన విజయాలు అన్నీ మట్టిగొట్టుకుపోయాయ్… మరి నిష్కృతి ఏమిటి..? ఆ తప్పుడు కేసు పెట్టిన వాడిని ఎందుకు శిక్షించలేం..? నేను కేసు పెట్టేశాను, నీ చావు నువ్వు చావు అంటే సరా..? ఎప్పుడైనా ఇలా అనిపించిందా..? అసలు తప్పుడు కేసులు పెట్టిన వాడి దురుద్దేశాల్ని తేల్చి, శిక్షించడం మన సిస్టంలో సాధ్యమేనా..? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా..?
సరే, ఓ కేసు చెప్పుకుందాం… చాలా సీరియస్ కేసు… ఎందుకంటే… 28 ఏళ్ల తరువాత ఓ ఇంపార్టెంట్ కేసుపై సుప్రీం తాజాగా కన్నెర్ర చేసింది… అసలు ఆ తప్పుడు కేసు పెట్టిన వాళ్లెవరు..? ఎందుకు పెట్టారో వెంటనే దర్యాప్తు చేసి, నివేదిక ఇవ్వమని గురువారం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది అడిగింది… సీరియస్ కేసు అయినందున సీబీఐ డైరెక్టర్ ఈ కేసును స్వయంగా సూపర్వైజ్ చేయాలని సూచించింది… మరోసారి చదవండి… తప్పుడు కేసు నమోదైన 28 ఏళ్ల తరువాత…!!! అదీ ఓ ముసలాయన ఎక్కడా వెనక్కి పోకుండా, తెగించి ఇన్నేళ్లు పోరాడాడు కాబట్టి… అసలు కేసేమిటంటే..?
Ads
ఈయన పేరు నంబి నారాయణ్… కేరళ… ఇస్రో సైంటిస్టు… మన అంతరిక్ష ప్రయోగాలకు అత్యంత కీలకమైన క్రయోజనిక్ పరిజ్ఞానం మీద వర్క్ చేస్తున్నాడు… 1994లో ఓరోజు… అప్పటికి ఆయన వయస్సు 53 ఏళ్లు… త్రివేండ్రంలోని చిన్న ఇంట్లో ఉండేవాడు ఆయన… పోలీసులు వచ్చారు… మా పెద్ద సారు రమ్మన్నాడు అని తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు… సదరు పెద్ద సారు ఆరోజు అసలు స్టేషన్‌కే రాలేదు… ఆ రాత్రి మన ఇస్రో కీలక బాధ్యతల్లో పనిచేస్తున్న ఆ సీనియర్ సైంటిస్టు స్టేషన్‌లోని బెంచీపైనే పడుకున్నాడు… అవును, మన పోలీసులు అంతే… మన ఠాణాలు అంతే… అప్పుడే అయిపోలేదు… కథ ఇప్పుడే మొదలైంది…
మర్నాడు నిన్ను అరెస్టు చేశాం అని ప్రకటించారు పోలీసులు… నో విచారణ, నో దర్యాప్తు, నో క్లారిఫికేషన్స్… మేం బుక్ చేసేశాం… జస్ట్, అలా ప్రకటించేశారు… నేనేం నేరం చేశానయ్యా అనడిగాడు… నువ్వు దేశద్రోహివి, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు విసిరిన హానీ ట్రాపులో పడి, మన రాకెట్ టెక్నాలజీని పాకిస్థాన్‌కు అమ్మావు అని చెప్పారు… ఇంకేముంది..? మన మీడియాకు పోలీసులు ఏది చెబితే అదే వేదం కదా… రకరకాల కథనాల్ని కుమ్మేశాయి… అక్కడా టీవీ9లూ, ఆంధ్రజ్యోతిలూ ఉంటయ్ కదా…
అసలు ఎవరీయన..? ఓ మధ్యతరగతి కుటుంబంలో ఐదుగురు అమ్మాయిల తరువాత పుట్టిన అబ్బాయి… తండ్రి కొబ్బరి టెంకలు, పీచు వ్యాపారం చేసేవాడు… నంబి మెరిట్ స్టూడెంట్… ఇంజనీరింగ్ చదివి ఇస్రోలో చేరాడు… ప్రిన్స్టన్ యూనివర్శిటీకి వెళ్లి, రాకెట్ ప్రొపల్షన్ చదువుకుని, మళ్లీ ఇస్రోకు వచ్చాడు… విక్రమ్ సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం వంటి మన ఖగోళ విజేతల సరసన పేర్కొనదగిన పేరు ఈ నంబిది కూడా… వాళ్ల టీముల్లో పనిచేశాడు… అసలు ఆయనపై కేసు ఎలా పెట్టారు..? నేరాన్ని నిర్ధారించుకున్నారా..? అది మరో కథ…
ఈ కేసు పెట్టడానికి నెల ముందు… మాల్దీవులకు చెందిన మరియం, రషీదా అనే మహిళల్ని వీసా ఎక్స్పైర్డ్ అనే ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు… కొన్ని వారాల తరువాత మాల్దీవుల కేపిటల్ మాలే నుంచి ఫౌజియాను కూడా అరెస్టు చేశారు… వాళ్లు ఈ నంబిని ట్రాపులో పడేసి, మన రాకెట్ టెక్నాలజీని తీసుకుని, పాకిస్థాన్‌కు అమ్మేసుకున్నారు అనేది ఆరోపణ… సహజంగానే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టగానే జడ్జి రిమాండ్‌కు పంపించేశాడు… రాకెట్ టెక్నాలజీని శత్రుదేశానికి అమ్మడం అనేది మామూలు కేసు కాదు కదా… జస్ట్, ఆ లోకల్ పోలీసులే కేసు పెట్టేశారు… అసలు ఎంత లోతుగా దర్యాప్తు చేయాలి..?
తరువాత జైలు నుంచి కస్టడీకి తీసుకుని, మంచానికి కట్టేసి కొట్టేవాళ్లు… రోజుల తరబడీ చిత్రహింసలు పెట్టేవాళ్లు, లై డిటెక్టర్ టెస్టులు… నంబి చెప్పింది అసలు వాళ్ల బుర్రలకు ఎక్కితే కదా… అదేమిటీ అంటే..? ‘‘ఏ టెక్నాలజీని నేను పాకిస్థాన్‌కు అమ్మాను అంటున్నారో అది అసలు మనం డెవలప్ చేయనేలేదు… ఇంకా ట్రయల్స్ జరుగుతూనే ఉన్నయ్… నిజానికి ఆ టెక్నాలజీని కాగితాలపై ఎక్స్ప్లెయిన్ చేయలేం, మరి నేను అమ్మింది ఏమిటి..?’’ చాలా స్ట్రెయిట్ ప్రశ్న… మరి ఇస్రో ముఖ్యులు ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదో తెలియదు… 50 రోజులు గడిచాక సీబీఐ కేసు టేకప్ చేసింది… వాళ్లకు విషయం అర్థమైంది… తరువాత కొన్నాళ్లకు ఆయనకు బెయిల్ వచ్చింది…
ఈలోపు ఆయన భార్య మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది… ఈయనకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు… 1996 లోనే సీబీఐ ఈయనతోపాటు మిగతా వారిని కూడా నిర్దోషులుగా పేర్కొంది… అంతేకాదు, ఇస్రో కూడా అంతర్గత దర్యాప్తు జరిపింది… క్రయోజనిక్ టెక్నాలజీకి సంబంధించిన ఇంజన్ డ్రాయింగులు నంబి దగ్గర లేవని తేల్చారు… కథ ఇక్కడ ముగియలేదు… సీబీఐ నివేదికను వ్యతిరేకించిన కేరళ సర్కారు సుప్రీం దాకా వెళ్లింది… 1998లో కేరళ ప్రభుత్వం చేసిన అప్పీళ్లను కొట్టేసింది సుప్రీం… ఇక్కడ మరో కథ మొదలైంది…
తనను అక్రమంగా కేసులో ఇరికించారు, అనేకరకాలుగా నష్టపరిచారు అని నంబి కేసు వేశాడు… 50 లక్షలు కక్కండి అని కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది… వేధింపులు, మానసిక ఒత్తిడి, పరువు నష్టం తదితర అంశాలకు సంబంధించి 1.30 కోట్లు అదనంగా ఇవ్వాలని చెప్పింది… ఏళ్లు గడుస్తూనే ఉన్నయ్… అసలు నన్ను ఈ తప్పుడు కేసులో ఇరికించిన వారెవరు..? వాళ్ల ఉద్దేశం ఏమిటి..? అసలు కుట్రదారులు ఎవరు..? అది కదా తేలాల్సింది అంటాడు ముసలాయన… నిజమే కదా…
2018లో సుప్రీంకోర్టు అసలు కేరళ పోలీసుల పాత్రపై దర్యాప్తు జరపాలని ఆదేశించింది… తన అనుభవాల్ని పేర్కొంటూ Ready to Fire, How India and I survived ISRO spy case రెండు పుస్తకాలు రాశాడు… కేంద్రం తనకు 2019లో పద్మభూషణ్ కూడా ఇచ్చింది… ఈయన బయోపిక్ రాకెట్రీ వచ్చింది, హిట్టయింది, ఈకేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది… సుప్రీం ఆదేశించినా సరే, తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై దర్యాప్తు లేదు, ఆ కేసుల వెనుక కుట్రల్ని తవ్విందీ లేదు… అదుగో ఇప్పుడు ఏకంగా సీబీఐ డైరెక్టర్‌నే ఆదేశించింది సుప్రీం… ఈ కథ ఇలా అనంతంగా సాగుతూనే ఉంది… ఇప్పుడు చెప్పండి… వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అనేది కదా మన మౌలిక న్యాయసూత్రం… మరి నంబిలాగే తప్పుడు కేసులకు ‘‘శిక్షలు అనుభవిస్తున్న’’ వాళ్ల మాటేమిటి..? ఇలా దేశంలో ఎందరు..? వేలు…!! అవునూ… చైనా ప్లస్ సీపీఎం ప్లస్ కేరళ సర్కార్ కోణంలో ఈ కేసును NIA దర్యాప్తు చేస్తే ఎలా ఉంటుంది యువరానర్…?!
Share this Article