మనం బ్రహ్మాస్త్రం అనుకున్నది కాస్తా రివర్సులో మనపైకే దూసుకొస్తుంటే..? కేసీయార్ బీజేపీపై ప్రయోగించిన అస్త్రం పరిస్థితి అదే… మా ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ ప్రయత్నిస్తోందహో అని టాం టాం చేశాడు, ఎవరో దళారులు ఏదేదో సంప్రదింపులు చేశారంటూ వాళ్ల మీద కేసులు పెట్టాడు, వాళ్లు మాట్లాడుకున్నవే అని రికార్డు చేశాడు… సుప్రీంకోర్టు సహా దేశంలోని అన్ని హైకోర్టుల జడ్జిలకు సీడీల్లో ఆ వివరాలు పంపించాడు… పార్టీల అధ్యక్షులకు పంపించాడు… ప్రెస్ మీట్ పెట్టాడు…
ఒక్క సీఎం, ఒక్క పార్టీ అధ్యక్షుడు గానీ స్పందించలేదు… పైగా సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న వ్యక్తి బహిర్గతం చేయడం ఏమిటి..? ఓ పద్ధతి లేకుండా కోర్టులకు పంపించడం ఏమిటి అని ఆమధ్య హైకోర్టు మండిపడింది… నిన్న సుప్రీంకోర్టు మండిపడింది… మా మనసులను ప్రభావితం చేయాలనుకున్నారా అనడిగింది… ఇక తప్పేదేముంది..? ఇక్కడా అక్కడా కోర్టులకు తెలంగాణ ప్రజాధనం వెచ్చిస్తున్న లాయర్ కోర్టులకు సారీ చెప్పాడు… చెప్పాల్సి వచ్చింది… ఇప్పుడు కేసును ఎవరు విచారించాలో ఖరారు కావల్సి ఉంది… మళ్లీ ఆ ధర్మాసనం కూడా ఇలాగే మండిపడితే అడ్వొకేట్ దుష్యంత్ దవే మళ్లీ సారీ చెప్పాల్సి వస్తుందేమో…
అంతేకాదు… కేసు కూడా వీకైపోయింది… సీబీఐ బీజేపీ చేతిలో బందీ కాబట్టి దర్యాప్తు సరిగ్గా జరగదు, మేం సిట్ వేశాం, అదే విచారిస్తుంది అంటాడు కేసీయార్ ప్రభుత్వ తరఫు లాయర్… మరి సిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉండేది కాదా అనడిగింది సుప్రీంకోర్టు..? ఇక ఏమనాలో దుష్యంత్ దవేకు అర్థం కాలేదు… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ… ఆ బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలనుకుందని ఆరోపణ… బీఆర్ఎస్ చేతిలో సిట్… కేంద్రం చేతిలో సీబీఐ… మరి ఇద్దరూ కేసులో భాగమే అయినప్పుడు దర్యాప్తు ఎవరు చేయాలి..? నాన్ బీజేపీ, నాన్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర సీఐడీ విభాగానికి ఇస్తే సరిపోతుందా..? ఇదొక ఇంట్రస్టింగ్ ప్రశ్న…
Ads
టెక్నికల్‌గా ఏమిటి అనేది పక్కన పెడితే… ఇది బీజేపీని బ్రహ్మాండంగా ఇరుకునపెడుతుందని, ఈ దెబ్బకు ఇక మా జోలికి రాదనీ అనుకున్నాడు కేసీయార్… జస్ట్, కొద్దిరోజుల్లోనే కేసు గురించి జనం ఎవరూ మాట్లాడటం లేదు… ఉల్టా కోర్టులను ప్రభావితం చేయబోయాడని, మర్యాద తప్పి సాక్ష్యాల్ని కోర్టులకు పంపించాడనే బదనాం తనే మోయాల్సి వస్తోంది… ఏదో ప్లాన్ వేశాడు గానీ ఎదురుతన్నింది… నేను చాణక్యుడిని, నేను ఓ బాణం వేస్తే అది భీకరంగా నిప్పులు చిమ్ముతూ ఎదుటివాడిని కాల్చేస్తుందనే భ్రమలు బద్ధలయ్యాయి… కాగా తన కూతురే ఢిల్లీ మద్యం స్కాంలో అరెస్టు ముంగిట్లో నిలిచింది… అన్ని రోజులూ మనవి కావు సార్…!!
(ఈనాడుకు సుప్రీంకు సారీ అనేది హెడింగ్ గా అనిపించలేదు… బీజేపీ పంజరంలో చిలుక అని ఒక పిచ్చి heading పెట్టి తన భయం రేంజ్ బయట పెట్టుకుంది మళ్లీ…)
Share this Article