గెలుపు హ్యాంగోవర్‌లో ఉన్నాడేమో… ఇక నేనేది చెప్పినా చల్తా అనే భ్రమలకు గురయ్యాడేమో… ఇంకా జగన్‌ను జనబాహుళ్యానికి దేవుడి పేరుతో దూరం చేయాలనే వ్యూహంతోనేమో… నిజంగా పార్టీ మీటింగులో ఆ క్షణాన హఠాత్తుగా బుర్ర మ్యూట్‌లోకి వెళ్లిపోయిందేమో…
కారణాలు ఏమైనా గానీ… చంద్రబాబుకు మొట్టికాయలు సుప్రీంకోర్టులో..! కనీసం దేవుడిని మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీయకండి, ఒక సీఎం హోదాలో ఉండి ఏమీ ఆధారరహిత వ్యాఖ్యలు..? అసలు కొవ్వుల నెయ్యి వాడనే లేదని మీ ఈవో చెబుతున్నాడు… వాడినట్టు ఆధారాలు కూడా లేవు అని ఘాటుగానే స్పందించింది…
టీటీడీ ఈవో శ్యామలరావు కూడా చంద్రబాబును బాగానే ఫిక్స్ చేసినట్టున్నాడు… మొత్తం ఎనిమిది ట్యాంకర్లు వస్తే నాలుగే వాపస్ పంపించినట్టు చెబుతున్నారు ఇప్పుడు… మరి ఆ నాలుగు ట్యాంకర్లు ఏమయ్యాయి..? ఆ నాలుగు ట్యాంకర్ల శాంపిళ్లే పరీక్షల కోసం ఎందుకు పంపించినట్టు..? అంతకుముందు నెయ్యి సప్లయ్ చేసిన ఇతర కంపెనీల శాంపిళ్లను ఎందుకు కల్తీ పరీక్షల కోసం పంపించలేదు..? ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు రావల్సి ఉంది…
Ads
బహుశా సుప్రీంలో ఇలా అక్షింతలు వేయించుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు చంద్రబాబుకు… ఏ వ్యవస్థయినా సరే మేనేజ్ చేయగలను అనే ధీమాలో ఉండే చంద్రబాబుకు ఇది షాకే… ఐతే… సుప్రీం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినంతమాత్రాన అక్కడేదీ అపసవ్యంగా జరగలేదనే నిర్ధారణ కాదు… నిజనిరూపణ జరగాలి… అంతేగాకుండా భూమన, వైవీ, ధర్మారెడ్డిల అరాచక చర్యలు మాసిపోవు… అసలు నెయ్యి మాత్రమే కాదు, టీటీడీలో ఎన్నో స్కాములు… ఓ సమగ్ర ప్రక్షాళన జరగాలి… అది చంద్రబాబుతో చేతనవుతుందా..? నెవ్వర్… గతంలో కాలేదు, ఇప్పుడూ కాదు, ఆ సంకల్పమే తనకు ఉండదు… టీవీ5 నాయుడు వస్తాడుగా… ఇక చూసుకొండి…
నిజంగానే చంద్రబాబు జస్ట్, జగన్‌ను దెబ్బతీయడానికి గనుక శ్రీవారిని వాడుకుంటున్నాడనేదే నిజమైతే… సుప్రీం దాకా అక్కర్లేదు… మూల్యం తనే స్వయంగా చెల్లిస్తాడు… వెంకటేశ్వరుడు దేన్నీ ఉపేక్షించడు… జగన్ అపచారాలకు ప్రాయశ్చిత దీక్షలు, పూజలు చేయించాడు కదా… తన పొలిటికల్ కుట్రలే నిజమైతే తన కోసం ప్రాయశ్చిత దీక్షలు, పూజలు చేయించుకున్నా సరే… దేవుడు క్షమించడేమో…
సుప్రీం వ్యాఖ్యల్లో ప్రధానమైంది… జూలైలో నీకు పరీక్ష రిపోర్టులు అందితే, ఇప్పుడెందుకు బయటికి వచ్చాయి ఆ రిపోర్టులు…? ఇక్కడ చంద్రబాబు మాటల్ని సందేహాల్లో పడేస్తున్నాయి… సిట్ విచారణ అవసరమా..? కేంద్రం విచారణ అవసరమా..? అని సుప్రీం కేంద్రాన్ని అడిగింది… పొత్లుల సంసారం కాబట్టి, అసలే చంద్రబాబు దయాదాక్షిణ్యాలపై ఆధారపడిన సర్కారు కాబట్టి చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా కేంద్రం నిర్ణయాలు ఉండకపోవచ్చు…
జగన్ హయాంలో గుళ్లల్లో చాలా అపచారాలు జరిగాయి… జగన్ అన్నీ ఉపేక్షించాడు… చంద్రబాబు వాటిని తవ్వడం మొదలెడితే ఈ లడ్డూ, కొవ్వుల నెయ్యి వివాదం అటువైపు మళ్లొచ్చు… దేశముదురు, అది గాకపోతే మరొకటి… తనను జైళ్లో పారేసి, తన వ్యక్తిత్వానికి పది టన్నుల బురద పూసిన జగన్‌ను తను ఉపేక్షిస్తాడని అనుకోలేం… వెరసి ఈ ‘కొవ్వు’ రాజకీయం ఇంకొన్నాళ్లు ఏపీలో చూడక తప్పదు…!!
(హఠాత్తుగా ఈ వివాదం చంద్రబాబుకే రివర్స్ దెబ్బ కొడుతుండేసరికి చంద్రబాబు మైకులు ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వార్తను మరీ హంగామా చేయకుండా… సింపుల్‌గా కేంద్రాన్ని సుప్రీం ఏదో అడిగినట్టు రాసేసి, మొట్టికాయల్ని హైలైట్ చేయలేదు, మంచి అవకాశం దొరికినా సరే సాక్షి హెడింగ్ సహా ప్రజెంటేషన్ లో పంచ్ లేదు…)
Share this Article