సర్జికల్ స్ట్రైక్స్ తో భాగ్యనగరంలో శస్త్ర చికిత్స సమ్మె!
————————
తెలుగదేలయన్న దేశంబు తెలుగు. మనం తెలుగువారం. మన తెలుగు తల్లి, తెలంగాణా తల్లి మనకు గొప్ప. రెండ్రోజులుగా భాగ్యనగరం వీధి ఎన్నికల ప్రచారంలో ఒకటే సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. తెలుగు తల్లి, తెలంగాణా తల్లి ఇద్దరూ బాగా హర్ట్ అవుతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నందుకు కాదు. ఆ మాటను తెలుగులో కాకుండా ఇంగ్లీషులో వాడుతున్నందుకు. తెలుగంటే చెవులతోపాటు గొంతు కూడా కోసుకునే ఎందరినో ఈమాటకు తెలుగులో ఏ పదం లేదా పదబంధం వాడుతున్నారో కనుక్కుందామని 24 గంటలుగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో విశ్వ గురువు గూగుల్ ను సంప్రదించాను.
Ads
surgical strike అనగా శస్త్రచికిత్స సమ్మె అని చిటికెలో చెప్పేసింది. ఒక పగలు, ఒక రాత్రి అనవసరంగా ఎవరెవరినో అడిగానే అని నాలో నేనే అపరాధభావంతో కుమిలిపోయాను. ప్రింట్, టీవీ మీడియాలో పనిచేసి అనువాదాల్లో అందెవేసిన చేయి అయిన మిత్రుడిని అడిగాను. పొద్దు పొద్దున్నే ఏమిటీ సర్జికల్ స్ట్రైక్స్? ఆ మాటను అలాగే వాడేయరాదా అని ప్రేమతో విసుక్కున్నాడు. ఇది నా ఒక్కడి సమస్య కాదు. విశ్వవ్యాప్తంగా ఉన్న యావత్ పదిహేను కోట్ల తెలుగువారి భాషాభిమాన ఆత్మగౌరవ సమస్య. ఇజ్జత్ కా సవాల్.
చాలా యాంత్రికంగా, అర్థం లేనట్లుగా, అనర్థంగా పైకి కనిపిస్తున్నా శస్త్ర చికిత్స సమ్మె అని గుడ్డి గూగుల్ చేస్తున్న అనువాదంలో ఏవేవో లోతయిన అర్థాలు దాగి ఉన్నట్లు అనిపిస్తోంది.
1 . శరీరంలో సహజంగా దానికదిగా యాంటీ బాడీలతో పైకి కనిపించకుండా జరిగే శస్త్ర చికిత్స సమ్మె చేయడంతోనే కరోనా ఉపద్రవం ఇంతగా వ్యాపిస్తోంది.
2 . కరోనా ఎక్కువ కావడంతో కరోనా సంబంధిత చికిత్సలు తప్ప ఇతర శస్త్ర చికిత్సలన్నీ సమ్మె చేస్తున్నాయి.
3. శాస్త్రాలను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల శాస్త్ర విచికిత్స తగినంతగా జరగక శస్త్ర చికిత్స సమ్మె చేస్తోంది.
4 . శస్త్ర చికిత్స విషయంలో డాక్టర్లకు మిలటరీ వారికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు వచ్చాయి. పది, పన్నెండేళ్లు చదివి గుండెలు తీసిన బంటులయిన మేము కదా సర్జికల్ వెపన్స్ వాడాల్సింది? మాకు కదా మనిషిని నిలువునా కోయడానికి లైసెన్స్ ఉంది? అన్న డాక్టర్ల వాదన భాషాపరంగా హేతుబద్దమయినదే. తుపాకీ తూటా ముందు సర్వ శాస్త్రాలు తలవంచాల్సిందే అన్న మిలటరీ భాషను కూడా కొట్టిపారేయడానికి వీల్లేదు. వీలు కాదు. వీలు కాకూడదు. దీనితో శస్త్ర శాస్త్ర చర్చ జటిలమై చికిత్సలన్నీ సమ్మె చేస్తున్నాయి.
5. భాగ్యనగరం చార్మినార్ దగ్గర మాత్రమే శస్త్ర చికిత్సలు సమ్మె చేస్తాయా? మేమేమి తక్కువా? అని హైటెక్ సిటీ, శామీర్ పేట్, తుక్కుగూడ, రామోజీ ఫిలిం సిటీ నగరం నాలుగు దిక్కులు శస్త్ర చికిత్సలకోసం సమ్మె చేస్తున్నాయి. లేదా శస్త్ర చికిత్సలే చికిత్సలు చేయకుండా సమ్మె చేస్తున్నాయి.
6. ఇరవై అయిదు వార్డులు గెలవడానికే సర్జికల్ స్ట్రైక్స్ జరిగితే- ఇక సాధారణ ఎన్నికల్లో హిరోషిమా నాగసాకికంటే పెద్ద అణు విస్ఫోటనలు చూడవచ్చు. మాట తూటా అవుతుందంటే ఇన్నాళ్లు నవ్వుకునేవారు. ఇప్పుడు మాట అణుబాంబుకంటే ఎక్కువ.
7 . ఈరోజు హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో సర్జికల్ స్ట్రైక్స్ వార్తలు. పురానాపూల్ పాత బ్రిడ్జ్ శిథిలాల కింద పిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. క్రికెట్ కంటే సర్జికల్ స్ట్రైక్స్ ఆట బాగుండడంతో పిల్లలు కూడా క్రికెట్ బ్యాటు బాలు వదిలి సర్జికల్ వెపన్స్ తోనే ఆదమరిచి అలసిపోయేవరకు ఆడుకున్నారు. ప్రధాన పత్రికల్లో ఒక ఫుల్ పేజీ సర్జికల్ స్ట్రైక్స్ ప్రచార వార్తలే వస్తున్నాయి. టీవీల్లో పొద్దున సాయంత్రం సర్జికల్ స్ట్రైక్స్ ప్రచార ప్రత్యేక వార్తలు ప్రసారమవుతున్నాయి.
8 . తమ తమ ప్రాంతాల్లో విస్తృతంగా సర్జికల్ స్ట్రైక్స్ ప్రచారం చేయాలని ఓటర్లు రాజకీయ పార్టీల కార్యాలయాలముందు ప్రేమతో ధర్నాలు చేసి మొహమాటపెడుతున్నారు.
9 . హైదరాబాద్ విశ్వనగరంలో సర్జికల్ వెపన్స్ కు కృత్రిమమయిన కొరత ఏర్పడింది.
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article