‘‘ఆకాశం నీ హద్దురా సినిమాలో పెళ్లాంతో చెంపదెబ్బ తింటాను… డబ్బు అడుగుతాను… జై భీమ్ సినిమాలో తొలి అరగంట అసలు నా పాత్రే కనిపించదు… హీరోయిజం గురించి ఆలోచిస్తే ఆ తరహా సినిమాలు చేయలేం, చేశాను కాబట్టే నాకు గౌరవం దక్కింది……’’ హీరో సూర్య చెప్పిన మాటలు… తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద హీరోలకు చెళ్లుచెళ్లున తగులుతున్నట్టు..! సొంత హీరోయిక్ పోకడలతో చరిత్రకు వక్రబాష్యాలు చెప్పడం, వంకర కథనాలతో చారిత్రిక పోరాటవీరుల కథల్ని భ్రష్టుపట్టించడం, ఒరిజినల్ సినిమాల్లోని ఉదాత్తమైన పాత్రలకు కూడా తమ రీమేకుల్లో మితిమీరిన హీరోయిజాన్ని దట్టించడం…. ఆహా… సూర్య… నువ్వు గ్రేట్… మెత్తటి బట్టలో కొరడా దాచిపట్టుకుని భలే కొట్టావ్…
సూర్య పారలల్ సినిమాల హీరో ఏమీ కాదు… తనూ ఆ మితిమీరిన హీరోయిజాన్ని ప్రదర్శించేవాడే… సింగం వంటి అలాంటి సినిమాలు బోలెడున్నయ్… కానీ భిన్నమైన పాత్ర లభిస్తే చాలు వదిలిపెట్టడు… తనే ఆ పాత్ర దగ్గరకు వెళ్తాడు… తను వెళ్లలేకపోతే తనే ఆ సినిమా నిర్మిస్తాడు… జై భీమ్, ఆకాశం నీ హద్దురా సినిమాల్ని ఓసారి గుర్తుచేసుకొండి… మన తెలుగు స్టారాధిస్టారుల్లో ఒక్కరైనా ఆ సినిమాలు చేయడానికి సిద్దపడతారా..? జై భీమ్ సినిమాలోని సూర్య పాత్ర అసలు హీరోయిజం అంటే ఏమిటో ప్రేక్షకులకు చెప్పింది కదా…
హీరో అంటే ఫైట్లుండాలి, సాంగులుండాలి, ఇద్దరో ముగ్గురో హీరోయిన్లు ఉండాలి, హీరో పక్కన ఎగరాలి, వీలైతే ఓ ఐటం సాంగ్ పడాలి… అతి అనే పదానికే వెగటు పుట్టే రేంజులో భజన ఉండాలి….. ఇంకా ఎన్నాళ్లు..? ఈటీ సినిమా ప్రమోషన్ కోసం సూర్య ఇచ్చిన ఇంటర్వ్యూల్ని నిజానికి చాలామంది సరిగ్గా రాయలేకపోయినట్టు అనిపించింది… తమ రొటీన్ భాషలో రాసుకుంటూ పోయారు… సూర్య మాటల్లో లోతు ఉంది, ఫిలసాఫికల్ టచ్ ఉంది… దాన్ని పట్టుకోలేకపోయారు… నమస్తే తెలంగాణలో కాస్త బెటర్ అటెంప్ట్ కనిపించింది…
Ads
‘‘జీవితం ఒక చట్రంలోనే ఇరుక్కుపోవద్దు, అదే జరిగితే బతుకు కళాకాంతుల్ని కోల్పోతుంది… మనిషి నిత్యాగ్నిహోత్రంలా జ్వలిస్తూ ఉండాలి… ఎప్పుడూ తనను తాను కొత్తగా ఎక్స్‌ప్రెస్ చేసుకోవాలి… అప్పుడే కదా పాత మనిషిలో నుంచి కొత్త మనిషి కనిపించేది…’’ ఇవీ సూర్య మాటలు… అభినందనలు సూర్యా… హీరో అనగానే తమను తాము దేవుళ్లమనే భ్రమల్లో బతుకుతూ, వాటినే తింటూ, వాటినే తాగుతూ, ఫ్యానిజం పెంచుతూ, నానాటికీ మనుషులుగా కుదించుకుపోతూ, కుంచించుకుపోయే సోకాల్డ్ హీరోలకు భిన్నంగా ఆలోచిస్తున్నవ్… అడుగులు వేస్తున్నవ్… నీ ఫిలాసఫీ మీద నీకు క్లారిటీ ఉంది…
‘‘మూఢనమ్మకం కావచ్చు, సౌకర్యవంతమైన జీవితం కావచ్చు, మనలోని అహం కావచ్చు, కొత్తదనం కావాలంటే పాతకు వీడ్కోలు పలకాల్సిందే…’’ ఇదీ సూర్య చెప్పిన ఫిలాసఫీ… ‘‘సినిమా ప్రజల్ని గొప్ప సమాజం దిశగా నడిపించగలదు… సినిమా అనేది ఓ గొప్ప దృశ్య సాహిత్యం, పుస్తకాల మాదిరిగానే ఉద్వేగాల్ని ప్రభావితం చేస్తుంది…’’ వావ్, సూర్య…
ఓటీటీలంటే చిన్నచూపు చాలామంది సంకుచిత హీరోలకు… దాన్ని సూర్య పాజిటివ్‌గా చూస్తున్నాడు… అందుకే నేరుగా ఓటీటీల్లో విడుదలకు తనే సాహసించాడు మొదట్లో… ఎగ్జిబిటర్లనూ ఎదిరించాడు… ‘‘భాషాపరమైన, సాంస్కృతిక హద్దుల్ని ఓటీటీలు చెరిపేస్తున్నయ్… కొత్త కథలకు వేదికలవుతున్నయ్… డిజిటల్ ఫార్మాట్ ఇంకా ఇండస్ట్రీని మార్చబోతోంది..’’ అంటున్నాడు తను… చివరకు కరోనా మీద కూడా సూర్య పాజిటివ్ రిమార్క్స్ చేశాడు…
‘‘మన బతుకు పరిమితులేమిటో చెప్పింది… ఎలా బతకాలో చెప్పింది… ఆరోగ్యానికి, కుటుంబానికి, వృత్తికీ ఎంతెంత టైమ్ కేటాయించాలో నేర్పించింది… కొందరు నగరవాసాన్ని విడిచి దూరంగా ఉన్న పల్లెల్లోకి మారిపోయారు..’’ ఎస్, సూర్య ఇంటర్వ్యూను ఇండస్ట్రీలో పెద్ద హీరోలు, పెద్ద దర్శకులు, పెద్ద నిర్మాతలు, పెద్ద హీరోయిన్లు ఒక్కసారి కాదు, కొన్నిసార్లు చదవాలి… చదవాలి… వాళ్లు మారకపోయినా సరే, తమకు కనిపించని ఎర్రటి వాతలు పెడుతున్న సూర్య వ్యాఖ్యల్లో నిజాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి… తమ బుర్రల చుట్టూ బురదను వదిలించుకోవాలి… అరవైలు, డెబ్భయిల్లో పడుతున్నా సరే, ధనం తప్ప ప్రయో‘జనం’ పట్టని, వెకిలి అభిరుచులు వదలని సోకాల్డ్ పెద్ద హీరోలు ఆత్మసమీక్ష చేసుకోవాలి…!
Share this Article