సౌత్ ఇండియన్ సినిమా మరో ప్రిస్టేజియస్ ప్రాజెక్టు చేపట్టింది… దాదాపు అవతార్ స్థాయిలో… భారీ భారీ వార్తలు, విశేషాలు వినిపిస్తున్నాయి… పెన్ స్టూడియోస్ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్, హిందీ రైట్స్‌ను 100 కోట్లకు కొనుగోలు చేసింది… మొత్తం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ ఈ రేటు విని ఒక్కసారిగా ఉలిక్కిపడింది… ఈ లెక్కన ఈ సినిమా రిలీజ్ చేయబోయే పది భాషల్లో కలిపి థియేటర్ వసూళ్లు కూడా కలిపితే ఏ రేంజ్ బిజినెస్ జరగబోతున్నదో అంచనా వేసుకోవాలి మనమే…
ఈ సినిమాలో హీరో సూర్య… చాన్నాళ్లయింది కదా యాక్షన్ సినిమా చేసి… పైగా ఇప్పుడు ట్రెండ్ జానపదం, చరిత్ర, యుద్ధాలు, వ్యూహాలు… సో, సూర్య కూడా అదే బాటలో ఈ సినిమాను ఎంచుకున్నాడు… మరి హిందీ మార్కెట్ కావాలంటే ఓ బాలీవుడ్ మొహం కావాలి కదా… అందుకని ఏకంగా హీరోయిన్‌గా దిశా పటానీని తీసుకున్నారు… సంగీతం దేవిశ్రీప్రసాద్… దర్శకుడు శివ… ఒక్క దిశా పటానీ మినహా మిగతా తారాగణం అంతా తమిళమే…
ఇందులో ఆసక్తికరంగా అనిపించిన విశేషం ఏమిటంటే..? పది భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారనేది… హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో అంటున్నారు తప్ప ఆ తదితరాలు ఏమిటో ఎవరూ వెల్లడించడం లేదు… బహుశా ఇంగ్లిషు, మరాఠీ, సింహళి, ఉర్దూ, మాండరిన్ భాషలు కూడా ఉండవచ్చు… అవసరమైతే ఎలాగూ జపనీస్, రష్యన్ భాషల్లోకి ఎలాగూ డబ్ చేస్తారు కదా… అక్కడా మనవాళ్లకు మార్కెటింగ్ నెట్‌వర్క్ ఏర్పడింది కదా… అంటే పాన్ వరల్డ్ సినిమా అన్నమాట…
Ads
1000 ఏళ్ల క్రితం నాటి కథ అట… త్రీడీలో తీస్తున్నారు… సహజంగానే భారీ గ్రాఫిక్స్ ప్లాన్ చేస్తున్నారు… ఇప్పుడు ఇండియన్ సినిమా అంటేనే గ్రాఫిక్స్ మాయ… ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్, మరక్కర్, బ్రహ్మాస్త్ర, రామసేతు దగ్గర నుంచి కార్తికేయ, బింబిసార దాకా… నిజానికి మొత్తం వార్తల్లో ఇవి కాదు, సూర్య పోషించబోయే పాత్రల సంఖ్యపై తమిళ మీడియాలో మస్తు ఊహాగానాలు వినిపిస్తున్నాయి… సినిమా వర్గాలేమో సూర్య ఐదు పాత్రల్ని పోషిస్తున్నట్టు చెబుతున్నాయి…
ఆ సంఖ్య అయిదు కాదు, 13 అని వార్తలు చెబుతున్నాయి… ఒకవేళ అదే నిజమైతే గొప్ప విశేషమే… చేయలేడని కాదు, సూర్య అవన్నీ చేయగలడు… అయితే అన్ని పాత్రల్ని ఒకే సినిమాలో అడ్జస్ట్ చేయడం సాధ్యమేనా..? వాటి పరిచయానికే టైమ్ సరిపోదు కదా… అంటే దీన్ని కూడా పొన్నియిన్ సెల్వన్ తరహాలో రెండు, మూడు భాగాలు తీస్తారా..? యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి దశ షూటింగు గోవాలో పూర్తయిపోయింది…
తదుపరి షెడ్యూల్ శ్రీలంక… సరే పాత్రల విషయానికొద్దాం… 1966లో శివాజీ గణేషన్ నవరాత్రి సినిమాలో 9 పాత్రలు పోషించాడు… దాన్ని తెలుగులో అక్కినేని హీరోగా తీశారు, సేమ్, తనవీ 9 పాత్రలు… తరువాత 2008 వరకూ ఆ ఫీట్ ఎవరూ చేయలేదు… కమల్‌హాసన్ దశావతారం సినిమాలో పది పాత్రల్ని పోషించాడు… గ్రాఫిక్స్‌కన్నా మేకప్ మీద ఎక్కువగా ఆధారపడ్డాడు…
సినిమాలో ఏ సీన్ చూసినా సరే ఏదో ఒక కమల్ పాత్ర కనిపిస్తూ ఉంటుంది… ఒక్కో ఫ్రేమ్‌లో వాళ్లను ఇరికించడానికి దర్శకుడి తిప్పలు అన్నీఇన్నీ కావు… ఇక 13 పాత్రలు అంటే… మామూలు విషయం కాదు… కాకపోతే దశావతారం నాటికీ ఇప్పటికీ ఒక సౌలభ్యం ఉంది… లుక్కు, కదలికలు, ఫ్రేముల్లోకి ఎక్కువ పాత్రలు తీసుకురావడం గట్రా గ్రాఫిక్స్ విభాగం చూసుకుంటుంది… బిన్న మతాలు, భిన్న దేశాలు, భిన్న రాష్ట్రాలు, భిన్న వయస్సుల వైవిధ్యం దశావతారంలో విశేషం… చివరకు ఓ ముసలావిడ వేషం కూడా వేయించారు… మరి సూర్య 13 పాత్రల్లో అంత వైవిధ్యం తీసుకురావడం మరో పెద్ద టాస్క్ అవుతుంది…!!
Share this Article