.
మహాత్మాగాంధీ చరిత్ర వేరు… అందరికీ నచ్చాలనేమీ లేదు… కానీ తనదొక విశిష్ట తత్వం… తను నమ్మిన సిద్ధాంతాలతో తనెప్పుడూ రాజీపడలేదు… కానీ తన వారసులెవరూ తన నిజవారసత్వాన్ని అచ్చంగా పట్టుకోలేకపోయారు…
గోపాలకృష్ణ గాంధీ… ఈయన గాంధీకి మనమడు… ఇప్పుడు 80 ఏళ్లు… ఐఏఎస్… బీహార్, బెంగాల్ గవర్నర్‌గా.., రాష్ట్రపతికి కార్యదర్శిగా.., శ్రీలంక, దక్షిణాఫ్రికాలకు హైకమిషనర్‌గా చేశాడు.., ఐనాసరే, దేశాల నడుమ దౌత్య సంబంధాలపై తనకున్న అవగాహన విచిత్రం అనిపించింది ఆయన తాజా వ్యాసం చదివితే…
Ads
యెమెన్‌లో భారతీయ నర్స్ నిమిషా ప్రియ కేసు తెలుసు కదా… తన వ్యాపార భాగస్వామి, యెమెన్ దేశస్థుడిని హత్య చేసింది… అక్కడ మరణ శిక్ష పడితే… ప్రవాస భారతీయులు, భారత ప్రభుత్వం సహా చాలామంది ఆమెను ఆ శిక్ష నుంచి బయటపడేయటానికి ప్రయత్నిస్తున్నారు… బాధిత కుటుంబం అడుగుతున్న క్షమాధనం వద్దే పీటముడి పడింది…
మానవతా దృక్పథంతో ఆమె విడుదల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లలో ముస్లిం సమాజం అమితంగా గౌరవించే 94 ఏళ్ల మతగురువు, గ్రాండ్ ముఫ్తీ ఏ.పీ అబూబకర్ ముస్లియార్ ముఖ్యుడు… సేవ్ నిమిష ప్రియ ఇంటర్ యాక్షన్ కౌన్సిల్ క్యాంపెయిన్ తనను కలిసిన తరువాత ఆయన ప్రయత్నాలతో మరణశిక్ష వాయిదా పడింది… ఇరాన్, సౌదీ అరేబియా కూడా యెమెన్ పాలకులకు నచ్చజెప్పినట్టు వార్తలొచ్చాయి…
నమ్మలేకపోయినా కేఏ పాల్ కూడా నేనూ ప్రయత్నిస్తున్నాను, రక్షిస్తాను అంటున్నాడు… (ఆమె క్రిస్టియన్)… భారత విదేశాంగ శాఖ తన ప్రయత్నాలు తాను చేస్తోంది… సరే, ఆమె డెస్టినీ ఏం కానుందో చెప్పలేం… ఇప్పుడు ఈ గోపాలకృష్ణ గాంధీ తన వ్యాసంలో ఏమంటాడంటే..?
‘‘ఒకవేళ ఆమెను కాపాడలేకపోతే యెమెన్‌కు ఇండియా తన అసంతృప్తిని వ్యక్తపరచాలి… యెమెన్‌తో వాణిజ్యాన్ని చాలా పరిమితం చేయాలి… యెమెన్‌లో భారతీయులకు భద్రత లేదనే విషయాన్ని ప్రభుత్వం చెప్పితీరాలి… అవసరమైతే అక్కడున్న వేల మంది ఇండియన్లను ప్రభుత్వమే వాపస్ తీసుకువచ్చేయాలి… మనవాళ్లు అనేక వృత్తుల్లో అనేక దేశాల్లో ఉన్నారు, నిమిషను కాపాడలేకపోతే అన్ని దేశాల్లో చులకన అయిపోతాం… ఆమె ఆ నేరం ఇండియాలో చేసి ఉంటే శిక్షను తగ్గించేవి కోర్టులు…’’
మానవతాకోణంలో ఆయన స్పందన వరకూ వోకే… కానీ ఈ దేశం, ఈ ప్రభుత్వం పరిమితులు అన్ని ముఖ్య పోస్టుల్లో పనిచేసిన ఆయనకు తెలియవా..? ఆశ్చర్యం..! ఇతర ప్రవాస భారతీయలకూ నిమిషకు తేడా లేదా..? నేరం నేపథ్యం ఏమైనా సరే ఆమె హంతకురాలు… మృతదేహాన్ని ముక్కలు చేసిందని ఈ గాంధీయే రాసుకొచ్చాడు కదా… అందుకే ఆ కుటుంబం క్షమాధనం ఇచ్చినా సరే క్షమించబోమని మొండికేస్తున్నదట…
వేరే దేశంలో ఒక హత్యకు పాల్పడిన దోషిని ఇతర భారతీయులను ఒకగాటన కట్టగలమా..? యెమెన్ ఇదే అడిగితే మన దగ్గర జవాబు ఏముంటుంది..? నిజానికి భారత ప్రభుత్వం అధికారికంగా క్షమాధనం ఇచ్చి విడిపిస్తే, భారతదేశం నేరస్థులకు అండగా ఉంటున్నదనే దుష్ప్రచారానికి తావిచ్చినట్టు కాదా..? పైగా అక్కడున్నది ప్రపంచం గుర్తించిన పాలకవర్గం, ప్రభుత్వం కాదు…
దౌత్య సంబంధాలేమున్నాయి వాళ్లతో మనకు..? సో, ఏది చేసినా ఆఫ్ ది రికార్డుగా చేయాల్సిందే… ఒకవేళ నిజంగానే అక్కడి నుంచి ప్రవాసుల్ని స్వదేశం తరలిస్తే… ఒక నేరస్థురాలిగా అండగా ఉండి, మిగతా వాళ్లందరినీ స్వదేశం తీసుకుపోయిందనే అపనింద తప్పదు… వాళ్ల శిక్షాస్మృతి ప్రకారం వాళ్లు శిక్షిస్తారు, దాన్ని మనం ఎలా తప్పుపట్టగలం..? అక్కడ మరణశిక్షలు సాధారణం… ఎవరు ప్రశ్నించినా… మా సమాజం, మా చట్టం, మా ఇష్టం అంటారు…
మన ఇండియన్, ఏదో ఓ దుర్బల క్షణంలో చేసిన చర్య వికటించి, ఆ దేశస్థుడు మరణించాడు, మనం ఆమెను కాపాడుకుందాం అనే భావనతోనే విదేశాంగ శాఖ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది… తప్పుపట్టలేం, పట్టకూడదు… ఎవరు ఏరకంగా ప్రయత్నించినా స్వాగతిద్దాం… సో, ఈ నయా గాంధీల వాదనలు, రాతలకేం గానీ… నిమిష తప్పకుండా రిలీజ్ కావాలనే కోరుకుందాం… ఆమె బాధితురాలో, నిందితురాలో కాసేపు చర్చల్ని కూడా వదిలేద్దాం..!!
Share this Article