సికింద్రాబాద్… ఉజ్జయిని మహాంకాళి గుడి… కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నాడు… గుడి బయటికి రాగానే హడావుడిగా బండి సంజయ్ అమిత్ షా చెప్పుల్ని వెతికి, పట్టుకొచ్చాడు… కాస్త వంగి విధేయంగా నిలబడ్డాడు… అమిత్ షా కనీసం వారించలేదు… ఇదీ జరిగింది… లంబాచోడా వివరణలు అక్కర్లేదు… జరిగింది బాగాలేదు… హార్డ్ కోర్ బీజేపీ ఫ్యాన్స్‌కు సైతం చివ్వెరపుట్టించేలా జరిగింది…
సహజంగానే బీజేపీ అంటే అగ్గిమండుతున్న టీఆర్ఎస్ దీన్ని ఏకిపారేస్తోంది… బీజేపీ ఎదురు కౌంటర్లు వేస్తోంది… తప్పులేదు… కానీ ఆ వీడియో చూస్తుంటే… ఒక ఢిల్లీ పాదుషాకు చెప్పులు తొడుగుతున్న తెలంగాణ పాలేరు అన్నట్టుగా కనిపిస్తోంది… కనీసం సామంతుడు కూడా అలా వ్యవహరించడు…
ఆశ్చర్యం ఏమిటంటే..? అనధికారికంగా ఎవరి హోదా ఏమిటనేది వదిలేస్తే… అమిత్ షా జస్ట్, ఓ కేంద్ర మంత్రి… బండి సంజయ్ ఆ పార్టీకి తెలంగాణ శాఖ అధ్యక్షుడు… సమస్థాయి… ఇద్దరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే… ఒక కిషన్‌రెడ్డి ఈ పనిచేయగలడా..? నెవ్వర్..! మరి బండి ఎందుకు ఈ దాస్యాన్ని చూపించినట్టు…
Ads
ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లో హోదాలకు అతీతంగా అందరూ అన్ని పనులూ షేర్ చేసుకుంటారు… ఒక్కసారి గణవేష్ ధరిస్తే చాలు అందరూ ఒకటే… ఆ కనీససోయి కూడా అమిత్, బండిల ప్రవర్తనలో కనిపించలేదు… నిజానికి అక్కడ హడావుడిగా చెప్పులు వెతుక్కునే పరిస్థితి లేదు, అమిత్ షా వెళ్లి చెప్పులు తొడుక్కోగలడు…
అమిత్ షా అటూఇటూ కదల్లేని ముసలివ్యక్తేమీ కాదు… కానీ బండి సంజయ్ అతి విధేయ ప్రకటన కోసం చేసిన పని అది… సంస్కారం అనే పెద్ద పదం అక్కర్లేదు గానీ, అమిత్ షా కనీసం మర్యాద కోసమైనా బండిని వారించలేదు… దొరతనం కనిపించింది… ఒక హైకమాండ్ ప్రతినిధికీ, ఓ రాష్ట్ర అధ్యక్షుడికీ నడుమ మరీ ఇలాంటి దొర-పాలేరు తరహా శుష్కగౌరవాలు అవసరమా..?
అయితే… దాన్ని మరీ అతిగా… గుజరాతీయుడి కాళ్ల ఎదుట తెలంగాణతనాన్ని పరవడం అనేంత పెద్ద పెద్ద పదాలతో భీకరంగా తిట్టిపోయాల్సిన పనిలేదు… బండి హుందాగా వ్యవహరించలేదు… అదొక్కటే అభ్యంతరకరం… నిజానికి బండి పూర్తిగా డిఫెన్సులో పడిపోతాడని అనుకున్నారు అందరూ… ఎవరు ఈ పదాల్ని అందించారో గానీ, భారతీయ సంస్కృతి, రామాయణకాలం నాటి భరత-రాముల పాదుకల దాకా తీసుకుపోయి సమర్థించుకునే ప్రయత్నం చేశాడు… అంగీకరిస్తామో లేదో వేరే విషయం గానీ, ఇంట్రస్టింగు సమర్థన…
’’కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు… మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోం మంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా..? రామ, భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం… మేం పాదరక్షలు గౌరవంతో మాత్రమే అందిస్తాం… తప్పేముంది..?’’ అంటున్నాడు…
సరే, రాముడి పాదుకల్ని భరతుడు మోసిన సందర్భం వేరు… ఆ సందేశం వేరు… పెద్దలు తమ చెప్పుల్ని తాము వేసుకునే స్థితి లేనప్పుడు చిన్నలు అందిస్తారు, తొడుగుతారు.., ఆ కోణాల్లో… బండి సమర్థన ఓ విఫల ప్రయత్నం… కానీ సమర్థనలోనూ రక్షణాత్మక ధోరణి లేదు, దానికీ కల్చరల్ కలర్ పూయడం ఇంట్రస్టింగుగా అనిపించింది… బండి సంజయ్ మొత్తానికి తెలంగాణ వర్తమాన రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన కేరక్టర్…!
Share this Article