సంప్రదాయ వివాహ తంతు జరిగితేనే ఆ పెళ్లి పరిగణనలోకి వస్తుందని అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్య, చెప్పిన తీర్పు ఆశ్చర్యం కలిగించింది… అఫ్‌కోర్స్, తను తీర్పు చెప్పిన కేసుకు ఈ వ్యాఖ్య వర్తిస్తుందేమో గానీ… ఒక జనరల్ కామెంట్‌గా మాత్రం భిన్నాభిప్రాయాలకు తావిస్తుంది…
అప్పట్లో ఓ సినిమా వచ్చింది… కృష్ణంరాజు హీరో కావచ్చు… పెళ్లంటే పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అని ఓ పాట అందులో… సూపర్ హిట్ పాట… ఇవన్నీ ఉంటేనే పెళ్లి జరిగినట్టా..? ఆ హైకోర్టు తీర్పు వార్త చదవగానే అనిపించింది అలా…
స్మృతి సింగ్ అనే మహిళకు ఆరేళ్ల క్రితం సత్యం సింగ్‌తో పెళ్లయ్యింది… ఎక్కడో తేడా కొట్టి ఆమె పుట్టింటికి వెళ్లిపోయి, తనను కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారని పోలీస్ కేసు పెట్టింది… ఐతే తన భార్య రెండో పెళ్లి చేసుకుందనీ, అందుకే ఇలా కేసు పెట్టిందనీ భర్త ఉల్టా వాదించాడు… ఇదీ కేసు…
Ads
తనకు విడాకులు ఇవ్వకుండా తనను వదిలేసి తన భార్య వేరే పెళ్లి చేసుకుంది అనేది సదరు భర్త వాదన… అబ్బే, ఆమె రెండో పెళ్లి చేసుకున్న దాఖలాలు ఏమీ లేవనీ, అసలు ఏడడుగులు నడిచినట్టుగా కూడా లేదనీ, అలాంటప్పుడు దాన్ని పెళ్లి అని ఎలా అంటామనీ, ఏడడుగులతోపాటు సంప్రదాయ పెళ్లి తంతు జరగనిదే పెళ్లిగా పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు చెప్పింది… ఇదీ నేపథ్యం…
నిజానికి ఏడడుగులు వేస్తేనే పెళ్లా..? మరి స్టేజ్ మ్యారేజీలు, రిజిష్టర్ మ్యారేజీలు, సింపుల్ దండల పెళ్లిళ్లు, సహజీవనాలు, గుళ్లల్లో, ఆర్యసమాజ్‌ల్లో జరిగే పెళ్లిళ్ల మాటేమిటి..? అవి పెళ్లిళ్ల జాబితాలోకి రావా..? వాళ్లు భార్యాభర్తలుగా పరిగణించబడరా..?
పెళ్లి తంతులో ఏడడుగులే కాదు… కాళ్లకు మెట్టెలు తొడగడం, పాదాలు తొక్కడం, జిలకర బెల్లం పెట్టడం, పుస్తె కట్టడం, దండలు వేసుకోవడం, అప్పగింతలు, అరుంధతీ దర్శనం దాకా చాలా తంతు ఉంటుంది… అవి కూడా కులాన్ని బట్టి, ఏరియాను బట్టి, ఆయా కుటుంబాల సంప్రదాయాల్ని బట్టి వేర్వేరుగా కూడా ఉంటాయి…
అసలు కొన్ని పెళ్లిళ్లలో ఏడడుగులు అనే పద్ధతే కనిపించదు… మరి హైకోర్టు ఆ ఏడడుగులు అనే పెళ్లిలో భాగమైన ఓ చిన్న తంతుకు అంత ప్రాధాన్యం ఎందుకు ఇచ్చినట్టు..? అదే ఆశ్చర్యంగా అనిపించింది… కావచ్చు, సంప్రదాయక పెళ్లితంతు అని చెప్పడానికి మాత్రమే ఏడడుగులు అనే పదాన్ని వాడి ఉంటుంది హైకోర్టు… కానీ హిందూ పెళ్లిళ్లు వేలరకాలు…
సపోజ్, ఓ ఆదివాసీ కుటుంబంలో పెళ్లి అనుకొండి… సగటు హిందూ పద్ధతి పెళ్లిళ్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది… వాళ్ల ఆచారాల్ని బట్టి ఉంటుంది… మరి అది ‘పెళ్లి’ అనబడదా..? హిందూ పెళ్లికి ఏకసూత్రత, అనగా ఒకే విధానం ఏమీ ఉండదు… అంతెందుకు..? ఒకే కులంలో ఏరియాను బట్టి పెళ్లి తంతు ఉంటుంది… అన్నింటికీ మించి ఈమధ్య సహజీవనం కాన్సెప్టు బాగా పెరిగింది… వాళ్లకూ ఇష్యూస్ వస్తే, అసలు పెళ్లే జరగలేదు కాబట్టి సంబంధిత సెక్షన్లు ఏమీ వర్తించవు అంటారా..? ఏమో… చాలా చిక్కు తీర్పు…!! (ఈ కథనం కోసం వాడిన ఫోటో కేవలం ప్రతీకాత్మక చిత్రం మాత్రమే…)
Share this Article