.
తెలంగాణ డీజీపీని, లొంగుబాట్ల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తున్న పోలీస్ అధికారులనుకూడా ఒక కోణంలో మెచ్చుకోవచ్చు… ఏమిటంటే కాస్త వివరంగా చెప్పుకోవాలి..?
మావోయిస్టుల లొంగుబాట్లలో కొందరు ఆయుధాలు వదిలేసి వస్తున్నారు… ఇంకొందరు ఆయుధాలతోసహా లొంగిపోతున్నారు… డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) చీఫ్, మోస్ట్ వాంటెడ్ నేత బర్సే సుక్కా అలియాస్ దేవాతోపాటు మరికొందరు ఆయుధాలతో లొంగిపోయారు…
Ads
- హిడ్మా ఎన్‌కౌంటర్, తరువాత ఆ స్థాయి లీడర్ బర్సే లొంగుబాటుతో ఇక పీఎల్‌జీఏ నిర్వీర్యం అయినట్టే… ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే..? ఈ సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి ఓసారి చెప్పుకోవాలి… మావోయిస్టుల దగ్గర ఎంతటి అత్యంతాధునిక, ప్రాణాంతక వెపన్స్ ఉన్నాయో తెలుస్తుంటే విస్మయం కలుగుతోంది…
రెండు ఎల్ఎంజీ, ఒక్కొక్కటి చొప్పున కోల్ట్, టవర్, ఎనిమిది ఏకే-47, పది ఇన్సాన్స్, ఎనిమిది ఎస్ఎల్ఆర్, నాలుగు బీజీఎల్, 11 సింగిల్ షాట్స్ ఆయుధాలు… మొత్తం 48 ఆయుధాలు… ఇందులో అమెరికన్ మేడ్ ‘కోల్ట్’ గన్, ఇజ్రాయెల్ మేడ్ ‘టవర్’ వెపన్ మాత్రమే కాదు, కీలకమైన హేమో (HE-MO (High Explosive Mortar) స్వాధీనమయ్యాయి… ఇది తక్కువ ఎత్తులో నక్సల్స్ వేటకు వచ్చే ఎయిర్ అటాక్ చాపర్లను కూల్చే కెపాసిటీ కలిగింది…
- మావోయిస్టులకు సొంతంగా లేత్ మిషన్లు, ఆయుధాల ఫ్యాక్టరీలే ఉన్నాయి… తపంచాల కాలం నుంచి వాళ్లు చాలాాదూరం వచ్చేశారు… గ్రెనేడ్ లాంచర్లు, మైన్ ప్రూఫ్ వెహికిల్స్ పేల్చే మైన్స్, క్లెమోర్ మైన్స్, కార్బయిన్స్, ఇన్సాన్స్, ఎస్ఎల్ఆర్ వెపన్స్ గట్రా చాలాకాలంగా వింటున్నవే… ఏకే-47 లు, ఏకే-56, లైట్ మెషిన్ గన్స్ కూడా విస్తృతంగా సమకూర్చుకున్నారు… ఇప్పుడు చాపర్లను వేటాడే సామర్థ్యం కూడా ఉందన్నమాట…
ఇదే కాదు… అత్యంత ఆధునికంగా రక్షణ బలగాలు, స్పెషల్ ఆపరేషన్ కమాండోలు కూడా భావించే కోల్ట్, టవర్ గన్స్ కూడా దొరికాయి… అదీ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది…

అమెరికన్ మేడ్ కోల్ట్ (Colt Rifles/Pistols)… అమెరికాకు చెందిన ‘కోల్ట్’ సంస్థ తయారు చేసే ఆయుధాలు ప్రపంచవ్యాప్తంగా సైనిక దళాలు ఉపయోగించే అత్యంత నమ్మకమైన ఆయుధాలు…. తేలికపాటి బరువు, వేగానికి ప్రసిద్ధి… చాలా తక్కువ సమయంలో ఎక్కువ రౌండ్ల కాల్పులు జరపగలవు… వర్షం, బురద వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇవి మొరాయించవు… గురి తప్పే అవకాశం చాలా తక్కువ…
ఇజ్రాయిల్ రక్షణ రంగం తయారు చేసే ‘టవర్’ (Tavor) గన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన బుల్‌పప్ (Bullpup) రైఫిళ్లు…తుపాకీ పరిమాణం చిన్నగా ఉన్నప్పటికీ, బారెల్ పొడవు మాత్రం తగ్గదు… ఇది అడవుల్లో లేదా ఇరుకైన ప్రదేశాల్లో యుద్ధం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది… ఇందులో అత్యాధునిక ఆప్టికల్ సైట్స్ (లేజర్ గైడెన్స్) అమర్చుకోవచ్చు, దీనివల్ల రాత్రి వేళల్లో కూడా కచ్చితమైన కాల్పులు జరపవచ్చు…
నిజానికి సీఆర్పీఎఫ్ (CRPF), ముఖ్యంగా అందులోని ఎలైట్ వింగ్ అయిన కోబ్రా (CoBRA – Commando Battalion for Resolute Action) దళాలు ‘టవర్’ (Tavor) రైఫిళ్లను అత్యధికంగా ఉపయోగిస్తున్నాయని చెబుతుంటారు… గతంలోనే సీఆర్పీఎఫ్ సుమారు 12,000 పైగా టవర్ X95 రైఫిళ్లను ఆర్డర్ చేసింది…

ఇవి మావోయిస్టుల దాకా ఎలా వచ్చాయనేది ప్రశ్న… అందరూ అనుకునేది ఏమిటంటే..? నక్సల్స్ స్పెషల్ ఆపరేషన్లలో ఉండే బలగాలు, పారా మిలిటరీ దళాలపై అడవుల్లో దాడులు చేసినప్పుడు మావోయిస్టులకు ఇలాంటి ఆయుధాలు విస్తృతంగా లభించాయని..!
ఇప్పుడు స్వాధీనం చేయబడిన ఆయుధాల నంబర్లు, వివరాలతో ఇంకాస్త లోతు దర్యాప్తు చేస్తే… అవి భద్రతా బలగాల నుంచి లాక్కున్నవేనా..? ఇంకెక్కడి నుంచైనా దొంగచాటుగా దేశంలోకి వస్తున్నాయా..? అదే నిజమైతే ఇలాంటి ఆయుధాలు ఇతర అసాంఘిక శక్తులకు కూడా చేరుతున్నాయా…? జవాబులు దొరకాల్సి ఉంది…
మయన్మార్ సరిహద్దుల ద్వారా ఈ ఆయుధాలు భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా ఉందని ఎన్ఐఏ చెబుతుంటుంది… పశ్చిమ ఆసియా లేదా ఆగ్నేయాసియాలోని యుద్ధం జరుగుతున్న దేశాల నుండి కూడా ఇలాంటి లెథల్ ఆయుధాలు అక్రమంగా బయటకు వస్తుంటాయి…
ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న కొన్ని తీవ్రవాద సమూహాలకు విదేశీ ఆయుధ స్మగ్లర్లతో పాత సంబంధాలు ఉన్నాయి… ముఖ్యంగా మణిపూర్, నాగాలాండ్ సరిహద్దుల నుంచి ఇవి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలుగు రాష్ట్రాల అడవుల్లోకి చేరి ఉండవచ్చుననే సందేహాలు స్పెషల్ పోలీసులకు చాలాకాలంగా ఉన్నవే… హేమో వంటి యాంటీ- ఎయిర్‌క్రాఫ్ట్ గన్స్ గురించి ఇక పోలీసులు తరువాత వెల్లడించాల్సిందే…
మావోయిస్టుల సాయుధ విభాగాల వెన్ను విరిగింది కాబట్టి ఇప్పుడు స్పెషల్ ఫోర్సెస్‌కు పెద్దగా థ్రెట్ లేకపోవచ్చు… కానీ ఒక తిప్పర్తి తిరుపతి బ్యాచ్ లొంగిపోతే… అప్పుడిక అమిత్ షా నక్సల్స్ విముక్త భారత్ అని ప్రకటిస్తాడేమో…!!

ఇంతకుముందు కీలకమైన యాంటీ నక్సల్ ఆపరేషన్ల కథనాలు చదివిన వివరాల్లోకి వెళ్తే… మావోయిస్టుల ఆయుధ సంపత్తి వెనుక ఉన్న అసలు మెదడు ఈ సెంట్రల్ టెక్నికల్ కమిటీ (Central Technical Committee – CTC)... వీరు యుద్ధం చేసేవారు కాదు, యుద్ధానికి కావలసిన పరికరాలను సృష్టించే ఇంజనీర్లు… ఇది మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) కింద పనిచేసే ఒక ప్రత్యేక విభాగం… వీరి ప్రధాన బాధ్యత: R&D (Research and Development)...
ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రోన్ అటాక్ టెక్నాలజీ కూడా CTC సృష్టే… గ్రెనేడ్ పైన ఉండే పిన్‌ను గాలిలో ఉన్నప్పుడు రిమోట్ ద్వారా ఎలా తొలగించాలనే మెకానిజంను వీరు అభివృద్ధి చేశారు… మయన్మార్ లేదా మణిపూర్ వంటి ప్రాంతాల్లోని ఇతర ఉగ్రవాద సంస్థల నుండి లేదా డార్క్ వెబ్ ద్వారా సేకరించిన మాన్యువల్స్ ఆధారంగా వీరు శిక్షణ పొందుతుంటారు… బర్సే సుక్కా వంటి వారు లొంగిపోవడం వల్ల ఇలాంటి టెక్నికల్ కమిటీల రహస్యాలు, వారి సప్లై చైన్ బయటపడే ఉండొచ్చు..!!
Share this Article