.
ఎలాగూ మీడియా వార్తలు, సంస్థలు, వివాదాల గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఈమధ్య… అన్ని పత్రికల మీదా ఓ లుక్ వేస్తుంటాం కదా… నిన్న ఆంధ్రప్రభ, నేటి ఆంధ్రప్రభ చదవబడ్డాను అలాగే…
గతంలో ఢిల్లీ నుంచి ఎవరో ప్రత్యేక ప్రతినిధి అంటూ సంపాదకీయ వార్తలు కనిపించేవి ఫస్ట్ పేజీలో… నిజానికి అవి ఎడిట్ పేజీలో రావాల్సినవి… సరే, వాళ్ల పేపర్ వాళ్లిష్టం… ఇప్పుడు నెట్‌వర్క్ పేరిట వస్తున్నాయి…
Ads
బండి సంజయ్ రావాలి, బీజేపీ శ్రేణుల డిమాండ్ అని ఓ స్టోరీ… బాధితుల గోస వింటేనే మంచిది సుమా, గ్రూప్ వన్ మీద ఓ కమిటీ వేసి పీసీసీ చొరవ తీసుకుని చర్చించాలి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి హితవు ఒక స్టోరీ… ఏదీ ఎక్కడ, ఎర్రెర్రని జెండా, మీ ఆందోళనలే కావాలి అంటూ మరో స్టోరీ… అభిప్రాయ కథనాలు ఇవి…
అలాగే నిన్న ఓ స్టోరీ… గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో వేసి మరీ ప్రజాస్వామిక విలువల గురించి రాయబడిన స్టోరీ… మిగతా స్టోరీల గురించి నేనిక్కడ వ్యాఖ్యానించదలుచుకోలేదు… అదంతా ముత్తా గౌతమ్ ఇష్టం… (ఈనాడులో గతంలో సెంట్రల్ డెస్క్ ఇన్‌చార్జిగా పనిచేసిన వైఎస్ఆర్ శర్మ ఆంధ్రప్రభ ఎడిటర్‌గా ఉన్నట్టు విన్నాను… కానీ ఇంప్రింట్‌లో మాత్రం ఎడిటర్‌గా కూడా గౌతమ్ పేరే ఉంది…)
ముత్తా గౌతమ్ పత్రిక అది… లాభం, నష్టం, రిస్క్ ఎట్సెట్రా ఆయన ఇష్టం… కానీ ఈ కథనం చదివాక అనిపించింది ఓసారి ఆయనకు చెప్పాలి… ఒకటి గుర్తు చేయాలి… గతంలో పెద్దల సభలో గలభా అనే శీర్షికతో ఈనాడులో ఓ వార్త వచ్చింది… గలభా అనే పదం వాడినందుకు మండలి ఏకంగా రామోజీరావును సభ హక్కులకు భంగం వాటిల్లిందనే పేరిట సభకు పిలిపించడానికి నిర్ణయించింది… అప్పటి పోలీస్ కమిషనర్ విజయరామారావు కావచ్చు, అరెస్టు చేయడానికి బయల్దేరాడు… పెద్ద రభస…
అప్పట్లో రామోజీరావు తరఫున ప్రఖ్యాత న్యాయవాది నారిమన్ వాదించి, అరెస్టు గాకుండా స్టే ఆర్డర్ ఇప్పించాడు… పెద్దల సభ మీద ఏమైనా రాయాలంటే ఏ పత్రికైనా సరే జాగ్రత్తగా పదాల్ని ఆచితూచి వాడుతుంది… ఇప్పుడు చెబుతున్న ఈ ఆంధ్రప్రభ వార్తలో ఏకంగా నైతికత, భ్రష్ట రాజకీయాలు, అవకాశవాద- స్వార్థ రాజకీయాలు, విలువలకు తిలోదకాలు, రాజ్యాంగస్పూర్తికి విఘాతం, ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదం, ఊసరవెల్లిని మించిన నైజం వంటి పదాల్ని యథేచ్ఛగా వాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది…
గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ స్టోరీ చదివి ఉండకపోవచ్చు… పోనీ, చదివినా లైట్ తీసుకుని ఉండొచ్చు, రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు సహజమే అనీ అనుకోవచ్చు… కానీ సీరియస్‌గా తీసుకుని ఉంటే మాత్రం ముత్తా గౌతమ్ ఇరకాటంలో పడి ఉండేవాడు… అంత అజాగ్రత్తగా రాయబడిన స్టోరీ అది… సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో ఈ జాగ్రత్తలు, వృత్తి నైపుణ్యాలు ఎక్స్‌పెక్ట్ చేయలేమేమో కానీ మెయిన్ స్ట్రీమ్ కూడా ఇలా మారిపోతే కష్టమే..! లోకసభ, రాజ్యసభ, శాసనమండలి, శాసనసభ వార్తలు రిపోర్ట్ చేసే జర్నలిస్టులు, అప్రూవ్ చేసే సబ్ ఎడిటర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసమే ఈ కథనం… అంతే..!
Share this Article