Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…

July 31, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ......... ఇది 6 + 1 సినిమా . అంటే ఆరుగురు భామలు ఒక హీరోని ప్రేమించే సినిమా అన్న మాట . చిట్టారెడ్డి సూర్యకుమారి నవల సూర్యచంద్ర ఆధారంగా, అదే టైటిల్‌తో విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 12 కేంద్రాలలో వంద రోజులు ఆడింది .

కృష్ణ కూడా 18 నవలా సినిమాల్లో నటించాడు . ఈ నవలా సినిమాలో కూడా అచ్చు నవలా నాయకుడులాగానే ఉంటాడు . మన చుట్టూ కనిపించే సాధారణ వ్యక్తి లాగానే కనిపిస్తాడు . చక్కగా హుందాగా నటించాడు .

Ads

ఓ ఊళ్ళో రెండు పెద్ద కుటుంబాలు ఉంటాయి . ఒక కుటుంబం హీరో కృష్ణది , మరో కుటుంబం సత్యనారాయణది . ఒకరు దుష్టుడు , మరొకరు శిష్టుడు . నోరు లేని బీదాబిక్కీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు హీరో .

ఎర్రగా బుర్రగా ఉన్న హీరోని పెళ్లి చేసుకోవటానికి చుట్టాల్లో ముగ్గురు భామలు మనో చిత్ర , ముచ్చెర్ల అరుణ , దీప,  పక్కింటి టుంటుం కల్పనారాయ్ , విలన్ కూతురు డాక్టరీ చదువుకున్న ప్రభ ఉవ్విళ్లూరుతుంటారు .

వీరిలో ముగ్గురు భామలు , వాళ్ళ తల్లిదండ్రులు హీరో ఇంట్లోనే బిచాణా పెడతారు . హీరో గారు జయప్రదను ప్రేమిస్తాడు . ఈ భామల్ని దాటుకుని హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది .

మధ్యలో విలన్ సత్యనారాయణ , ఆయన మేనల్లుడు గిరిబాబు అఘాయిత్యాలు , వాటిని హీరో ఎదుర్కోవటం , క్లైమాక్సులో కిడ్నాపులు , వారందరినీ హీరో రక్షించటం , సత్యనారాయణ కూతురు ప్రభ ప్రాణాలను కోల్పోవటం , వగైరాలు ఉంటాయి .

చక్కని స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్న దర్శకురాలు విజయనిర్మలని అభినందించాలి . పాటలను అన్నీ అద్భుతంగా చిత్రీకరించింది . రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో వేటూరి వ్రాసిన పాటల్ని సుశీలమ్మ , రాజ సీతారాం శ్రావ్యంగా పాడారు . బాలసుబ్రమణ్యం , కృష్ణల మధ్య స్టేండాఫ్ నెలకొని ఉన్న రోజుల్లో ఈ రాజ సీతారాం , జేసుదాసులు కృష్ణకు చాలా సినిమాలలో పాడారు .

కృష్ణ ఆఖరి కుమార్తె పద్మినీ ప్రియదర్శిని నాలుగయిదేళ్ళ వయసులో ఓ సీన్లో నటించింది . తర్వాత కాలంలో కృష్ణ సరసన హీరోయినుగా నటించిన మీనా కూడా బేబీగా నటించింది ఈ సినిమాలో . ఇతర పాత్రల్లో భారీ తారాగణమే ఉంది . సాధారణంగా కృష్ణ సినిమాల్లో తారాగణం భారీగానే ఉంటుంది .

జె వి సోమయాజులు , అంజలీదేవి , శుభ , హరిబాబు , రాజనాల , ఝాన్సీ , బెనర్జీ , సుత్తి వేలు , పి యల్ నారాయణ , సూర్యకాంతం , రాధాకుమారి , వై జి మహేంద్రన్ , మాస్టర్ అర్జున్ , ఓ కోతి, ఓ కుక్క, ఓ రెండు చిలకలు , ప్రభృతులు నటించారు . మహేంద్రనుకు రాళ్ళపల్లి వాయిస్ ఇచ్చారు .

పాటలన్నీ చక్కగా చిత్రీకరించారు . నృత్య దర్శకుడు శ్రీనివాస్ కృష్ణ చేత కూడా శాస్త్రీయ నృత్యాన్ని చేయించాడు . ఎంతటి అల్లరి వాడమ్మా , జీవన వేణువు పాడెను ఏమని , గోదారి చీరె కట్టె కోనసీమ డ్యూయెట్లు కృష్ణ జయప్రదల మీద చాలా బాగుంటాయి .

నలుగురు భామలు హీరో గారితో ఊహల్లో నృత్యించే పాట చాలా వైరైటీగా , చక్కగా , ఎలాంటి అభ్యంతరకర సీన్లు లేకుండా చిత్రీకరించారు విజయనిర్మల . ఆమె దర్శకత్వం వహించిన సినిమాలలో అసభ్యత ఉండదు . టుంటుం కల్పనారాయ్ చేత భరత నాట్యం చేయించింది . ఆమె కూడా బాగానే చేసింది . ఈ టుంటుం పేరు కల్పనారాయ్ అనే అనుకుంటా . Subject to correction .

జయప్రద , పిల్లల మీద పిక్నిక్ పాట నేడే మనకు హాలిడే ఆడే పాడే జాలీడే బాగుంటుంది . దీప కృష్ణల డ్యూయెట్ శ్రీరంగధాముడు పాట కూడా ఇద్దరూ హుషారుగా డాన్సించారు . బహుశా ఈ సినిమా విజయానికి ఈ పాటలన్నీ బాగా దోహదపడి ఉంటాయి .

భారీ అంచనాలు లేకుండా 1985 అక్టోబర్లో రిలీజయిన ఈ సినిమా అనూహ్యంగా ప్రేక్షక దేవుళ్ళు దేవతల ఆదరణతో వంద రోజులు ఆడింది . వంద రోజుల ఫంక్షన్ మద్రాస్ విజయ శేష్ మహల్లో జరిగింది . దాసరి , యం యస్ రెడ్డి ముఖ్య అతిధులుగా వచ్చారు . షావుకారు జానకి వ్యాఖ్యాత . ఈ కుటుంబ కధా చిత్రానికి సూటయిన సంభాషణలను సత్యానంద్ వ్రాసారు .

ఈ చక్కటి కుటుంబ కధా చిత్రం యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూడనివారు తప్పక చూడవచ్చు . కృష్ణ అభిమానులు మరలా చూడొచ్చు .

సినిమాలో ఓ విశేషం ఉంది . జయప్రద తల్లిదండ్రులుగా ఫోటోలో మాత్రమే కనిపించే సీన్లో శోభన్ బాబు , జయప్రదల ఫొటోలు పెట్టడం . బడా హీరోల మధ్య అంత సామరస్య , సుహృద్భావం ఉండేదన్న మాట . సినిమా చూసేటప్పుడు శోభన్ బాబు ఫొటోలో కనిపించటం థ్రిల్లింగ్ గానే ఉంటుంది . సరదాగా ఉంటుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రక్తి – భక్తి … కన్నప్ప సరే, ఆ మూడు సినిమాలనూ ఓసారి పరిశీలిద్దాం…
  • తండ్రి బతుకంతా ఆకలి పోరాటమే… కొడుకు ఇప్పుడు ఫేమస్ స్టార్…
  • హైదరాబాద్‌లో ఏఆర్ రెహమాన్ కచేరీ… కానీ కళ్లు తిరిగే రేట్లు అట..!!
  • బ్లాక్‌మెయిల్ టాక్టిస్‌తో రష్యా, చైనా వైపు అమెరికాయే ఇండియాను నెట్టేస్తోందా..?
  • ఇంగ్లిషు సబ్జెక్టులే అయినా… అడాప్షన్‌లో మెళకువ ఉంటేనే సక్సెస్సు…
  • వజ్రభూమి… Land Of Diamonds… చివరకు మిగిలేది దుమ్మూధూళే…
  • ADHD … స్టార్ ఫహాద్ ఫాజిల్‌కు ఓ అరుదైన ఆరోగ్య సమస్య…
  • ఇది 1 + 2 కాదు… 1 + 3 కూడా కాదు… ఏకంగా 1 + 6 ఫార్ములా…
  • నేత ప్రాణాలే ముఖ్యం… విధిలేక సొంత భర్త ప్రాణాలే తీసేసింది…
  • ‘వానెక్క’ విజయ్ మస్తు చేసిండు… సత్యదేవ్‌తో కలిసి సైన్మా నిలబెట్టిండు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions