Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మేవాడ్ రాజ్యం… ఆ రాముడి సూర్యవంశ వారసులు… రాజపుత్రుల రాజ్యం…

October 14, 2024 by M S R

.

ఏనాటిది మేవాడ్ రాజ్యం?

మేవాడ్ లేదా మేవార్ పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. రాజ్ పుత్ ల రాజ్యం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇప్పటి భిల్వారా, చిత్తోర్ గఢ్, రాజ్ సమంద్, ఉదయపూర్ ప్రాంతాలు కలిపి అప్పటి మేవాడ్ రాజ్యం. దాదాపు పద్నాలుగు వందల ఏళ్ల సుదీర్ఘ మేవాడ్ చరిత్ర ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ముగిసి…ఆపై స్వతంత్ర భారతంలో కలిసిపోయింది. రాజ్ పుట్ ల ఏలుబడిలో మేవాడ్ ఒక వెలుగు వెలిగింది.

Ads

మేవాడ్ రాజ్ పుట్ లు సూర్యవంశం వాళ్లమని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. త్రేతాయుగం నాటి రాముడు, లవకుశల మొదలు ఇప్పటి బతికి ఉన్న రాజవంశీకుడి వరకు లంకె కలుపుతూ ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ లో నిలువెత్తు వంశవృక్షం కూడా గీయించి పెట్టుకున్నారు. ఉదయాస్తమయాల్లో సూర్యకిరణాలు తమమీద పడేలా మేవాడ్ రాజులు తూర్పు, పడమరల్లో పై అంతస్థులో పెద్ద కిటికీలతో ప్రత్యేకంగా గదులు కట్టించుకున్నారు. అరవై వేల ఏళ్ల దశరథుడి పాలన, పదకొండు వేల ఏళ్ల రాముడి పాలన, పద్నాలుగు వేల ఏళ్ల లవకుశల పాలనతో కలిపి త్రేతా, ద్వాపర యుగాల లెక్కలు కట్టి 2024 దాకా మేవాడ్ రాజుల వంశవృక్షాన్ని అక్కడి టూరిస్ట్ గైడ్లు పరవశంగా చెబుతున్నారు.

కొన్ని శతాబ్దాల కాలం పాటు మేవాడ్ సామ్రాజ్యం లేదా ఉదయపూర్ సామ్రాజ్యంగా రాజ్ పుత్ రాజుల పాలనలో ఉంది. ఆ తరువాత బ్రిటిష్ పరిపాలనలో ఒక రాచరిక రాజ్యంగా ఉంది. దీని అసలు పేరు మేధ్ పాత్. శివుడి పేరైన మేధాపతేశ్వర్ అనే పేరు నుండి వచ్చింది. కాలక్రమంలో మేవార్ అనీ మేవాడ్ అనీ పిలవడం మొదలైంది. భూమిమీద ఏర్పడ్డ అత్యంత పురాతన పర్వతాలు ఆరావళి కొండా కోనల మధ్య మేవాడ్ ది ఒక చరిత్ర.

బొప్పా రావల్ ప్రస్తుత పాకిస్థాన్ రావల్పిండి నుండి వచ్చినవాడు. రావల్ అంటే రాజు. వారి పేరుతోనే రావల్పిండికి ఆ పేరు వచ్చింది. క్రీస్తు శకం 728లో రావల్పిండి నుండి వచ్చి…బొప్పా రావల్ చిత్తోర్ గడ్ లో అప్పటి గుజరాత్ రాజును ఓడించి…కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటినుండి మేవాడ్ రాజ్యం మొదలయ్యింది. చిత్తోర్ గడ్ ను మొఘలులు ఆక్రమించాక దాదాపు 150 ఏళ్లపాటు వారి ఏలుబడిలో ఉంది. అప్పుడు రాజ్ పుట్ లు చిత్తోర్ గడ్ వదిలి…1559లో ఉదయ్ పూర్ ను కొత్తగా నిర్మించుకున్నారు. మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ తండ్రి ఉదయ్ సింగ్ నిర్మించిన నగరం కాబట్టి ఉదయ్ పూర్ అనే పేరొచ్చింది.

మేవాడ్ రాజులు మహారాజా అనే పదానికి బదులు మాహారాణా (మంత్రి) అనే పదాన్నే ఉపయోగించేవారట. ఈ ప్రాంతానికి నిజమైన మహారాజు శివుడు అని వారి భావం. అక్కడ ఏక్ లింగ్ జీ పేరుతో కొలువై ఉన్న శివుడే ఆ రాజ్యానికి అసలైన రాజు అని…పరిపాలించే రాజు ఆయనకు మంత్రి అన్న భావనతో వారు “మహారాణా” బిరుదును వాడేవారని చెబుతారు. రణంలో గెలిచి నిలిచిన మహాయోధుడు అనే అర్థంలో “మహారాణా” స్థిరపడి ఉంటుంది.

ఇంతకంటే లోతుగా వెళితే ఇది చరిత్ర పాఠమవుతుంది. ఆసక్తి ఉన్నవారు గూగుల్ యూ ట్యూబులో మేవాడ్ చరిత్ర తారీఖులు, దస్తావేజులు తిరగేసుకోవచ్చు. గూగులమ్మ చెప్పని విషయాలు, యూట్యూబ్ కన్నులు చూడని సంగతులమీద దృష్టి సారిద్దాం.

ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున మేవాడ్ రాజ్యానికి పొలిటికల్ ఏజెంట్ గా నియమితుడైన బ్రిటిష్ ఉద్యోగి కల్నల్ జేమ్స్ టాడ్(1782-1835)మేవాడ్ ప్రేమలో మునిగితేలాడు. బెంగాల్ ఆర్మీలో టాడ్ పనిచేస్తుండగా ఆయనకు మధ్యభారతం మ్యాపులు గీచి పెట్టే సర్వే బాధ్యతను అప్పగించారు. (బ్రిటీషువాడి బుర్రే బుర్ర. శాశ్వతంగా ఇక్కడ పాలించడానికి అంగుళమంగుళం భూమి లెక్కలు పక్కాగా తేల్చి…రికార్డ్ చేసే పని అది. అప్పటికి ఆక్రమించినది ఎంత? ఇంకా ఆక్రమించాల్సింది ఎంత? అన్న క్లారిటీ కోసం మొదలు పెట్టిన పని అది.

పేరు ఈస్ట్ ఇండియా కంపెనీ. పెత్తనం బ్రిటిష్ సింహాసనానిది. కాబట్టి ప్రయివేటు వ్యాపార కంపెనీలో ఇతర రాజ్యాల అధికారిక మ్యాపులు, నదులు, కొండల కొలతలు తీసే పనేమిటి? అని మనం ఆశ్చర్యపోతే దానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలలుగన్న ఆ కంపెనీ వెనుక ఉన్న బ్రిటన్ బాధ్యత తీసుకోదు) దోచుకోవడానికి లెక్కలు తేల్చమంటే ఈ టాడ్ మనసును మేవాడ్ దోచుకోవడం బ్రిటిష్ కంపెనీకి నచ్చలేదు. దాంతో మధ్యభారత మ్యాప్ గీతకార్మిక మహాయజ్ఞం పెద్ద పనిని కత్తిరించి…నువ్ నీకిష్టమైన జానా బెత్తెడు మేవాడ్ మ్యాపే గీచుకో! అని కంపెనీ టాడ్ ను డిమోట్ చేసింది.

అవమానంతో టాడ్ ఉద్యోగానికి రాజీనామా చేసి బ్రిటన్ వెళ్లి తాపీగా “Annals and Antiquities of Rajasthan” పేరిట అద్భుతమైన పుస్తకం రాశాడు. రాజస్థాన్ చరిత్రకు ఇదొక నిఘంటువులాంటి పుస్తకం. అందులోనుండి ప్రధానమైన భాగాలను ప్రస్తావిస్తూ భారతీయ రాజుల చరిత్రమీద అనేక పరిశోధనలు చేసిన అమెరికా రచయిత క్రిస్టొఫర్ హారిసన్ పేన్(1845-1925) ఇంగ్లీషులో “Annals of Mewar” పేరిట చిన్న పుస్తకం వెలువరించాడు. కట్టుకథలు కాకుండా ప్రస్తావించిన ప్రతిమాటకు ఒక ఆధారాన్ని చూపడానికి టాడ్ ఎంతగా కష్టపడ్డాడో, పేన్ కూడా అంతే కష్టపడ్డాడు. కాబట్టి ప్రధానంగా నేను ఈ పుస్తకం ఆధారంగానే మేవాడ్ చరిత్రను చదివాను. చూశాను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!
  • ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
  • బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
  • సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions