మిత్రుడు Myakala Mallesh వాల్ మీద ఓ పోస్ట్ కనిపించింది… సూర్య దినపత్రికలో అప్పట్లో వచ్చిన ఓ వార్త క్లిప్పింగ్… పెద్ద పత్రికల్లో, టీవీల్లో ఈ చర్చ పెద్దగా వెలుగులోకి రాలేదు… కానీ ఢిల్లీ, హైదరాబాద్ పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం పొందిన సంగతే… మొన్న ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి కేసీయార్ తమ మద్దతు కోరాడనీ, కేటీయార్‌ను సీఎం చేయాలనుకుంటున్నాననీ, ఆశీస్సులు ఇవ్వండని విజ్ఞప్తి చేశాడనీ.., కానీ ఇదేమైనా రాజరికమా, మేం అలా మద్దతు ఇవ్వబోం అని కరాఖండీగా చెప్పాననీ అన్నాడు…
తరువాత దాన్ని కేటీయార్ తీవ్రాతితీవ్రంగా ఖండించాడు… నేను సీఎం కావాలంటే నీ పర్మిషన్ ఎందుకు మోడీ, ఏమిటీ పిచ్చికూతలు అనే అర్థమొచ్చేలా తిప్పికొట్టాడు… ఇక తప్పదు కాబట్టి కొందరు మంత్రులూ మోడీని తిట్టిపోశారు… కానీ ఒక డిబేట్‌కు మాత్రం తెరపడలేదు… నిజమే కదా, కేటీయార్‌ను సీఎం చేయాలంటే మోడీ అనుమతి దేనికి..? ఐతే అప్పట్లో కేటీయార్‌ను సింహాసనం మీద కూర్చోబెట్టాలని కేసీయార్ సీరియస్‌గానే ప్రయత్నించాడనీ, ఎందుకో ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేస్తూ పోయాడనీ అంటారు…
ఇంట్లో వారసత్వం మీద అంతఃకలహాలు ఏమైనా ఉన్నాయా..? జనం యాక్సెప్టెన్సీ మీద కేసీయార్‌కే డౌటుందా..? లేక మరే ఇతర తెర వెనుక మిస్టరీ దాగి ఉందా..? మోడీ వోకే అంటేనే కేటీయార్‌ను సీఎంను చేస్తాను అని కేసీయార్ అనుకోవడానికి కారణమేంటి..? మొత్తానికి మోడీ జనంలో ఓ చర్చకు తెరతీశాడు… బీజేపీకి బీఆర్ఎస్ బీటీం అనే భావనల్ని కాంగ్రెస్ ప్రముఖంగా ప్రచారం చేస్తూ, కవితను అరెస్టు చేయకపోవడమే పక్కా నిదర్శనం అని కూడా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో… బీజేపీ గ్రాఫ్ తెలంగాణలో వేగంగా పడిపోతున్న స్థితిలో… మేం ఇద్దరమూ ఒకటి కాదు అని చెప్పడానికి మోడీ అలా ప్రసంగించాడా..?
Ads
సూర్య ఏం రాసింది..? గత ఎన్నికలకు ముందు కావచ్చు… ఉపరాష్ట్రపతిగా కేసీయార్‌ను చేసే వీలుందనీ, తదుపరి తెలంగాణ సీఎంగా కేటీయార్ పీఠం ఎక్కుతాడనీ, కేంద్ర కేబినెట్‌లోకి హరీశ్ రావును తీసుకోవచ్చుననీ… రెండు వారాల వ్యవధిలో 10 రోజులు ఢిల్లీలో తిష్ట వేసిన కేసీయార్ ఇవే ప్రయత్నాల్లో ఉన్నాడనీ వార్త సారాంశం… ఇప్పుడేదో మోడీ అంటున్నాడు కాబట్టి అది నిజమే అనుకోవాల్సిన పనిలేదు, అలాగని కొట్టిపారేయాల్సిన వార్త కూడా కాదు…
అసలు చాన్నాళ్లు కేసీయార్ హరీశ్‌రావును దూరం పెట్టాడు..? మళ్లీ ఎందుకు దగ్గరకు తీశాడు..? ఇవీ మిస్టీరియస్ ప్రశ్నలే… కవితకు కూడా వారసత్వం మీద చాలా ఆశలున్నాయంటారు… సరే, అవన్నీ వేరే కథ… ఒకవేళ బీజేపీ భయపెట్టి, బీఆర్ఎస్‌ను బీటీంగా మార్చుకుంది అనుకుంటే… మరి కేసీయార్ బీజేపీ పెద్దలను ‘ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్’ కేసుతో ఎందుకు బజారుకు లాగడానికి ప్రయత్నించినట్టు..? జాతీయ రాజకీయాల పేరిట నాలుగు రోజులు శుష్క హడావుడి ఎందుకు ప్రదర్శించినట్టు..? కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు ఎన్నికల ధనం ఎందుకు సమకూర్చినట్టు..?
ఇంతకీ కేసీయార్ ఎవరు..? ఎవరి పక్షం..? హఠాత్తుగా కొన్నిరోజులు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతుంటాడు కదా… ఎక్కడ ఏ ప్రయత్నాల్లో మునిగి ఉంటాడు..? ఇవన్నీ శేషప్రశ్నలే… అవునూ, మోడీజీ… అధికారికంగా కేసీయార్ సీఎం… కానీ యాక్టింగ్ సీఎం కేటీయారే కదా… అధికారిక నిర్ణయాలు, సమీక్షలు, సీఎంకు దీటైన కాన్వాయ్, జిల్లా పర్యటనలు, కేడర్ మోకరిల్లడాలు, మొక్కులు గట్రా అన్నీ సీఎం లెవలే కదా…!!
Share this Article