పెద్దగా ఆశ్చర్యమేమీ అనిపించలేదు… తనకన్నా పదిహేనేళ్లు చిన్నవాడైన రోహ్మన్ షాల్‌తో మూణ్నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న మాజీ ప్రపంచసుందరి సుస్మిత సేన్ తమ బ్రేకప్ను ప్రకటించింది… ఈ బంధాలు, ప్రేమలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, పెటాకులు, బ్రేకప్పులు, అవసరార్థం కలయికలు గట్రా చాలా కామన్ ఫీల్డ్‌లో… బ్రేకప్ పెద్ద వార్తావిశేషం అనిపించలేదు, కానీ ఇంత వయోభేదంతో కొన్నాళ్లు సాగిన ఈ బంధమే సినిమా సర్కిళ్లలోనే ఓ విశేషం ఇన్నాళ్లు… పెళ్లీజంఝాటం జోలికి పోలేదు, ఇరవై ఏళ్ల క్రితం ఓ పాపను, పదేళ్ల క్రితం మరో పాపను దత్తత తీసుకుని పెంచుకుంటోంది… అకస్మాత్తుగా 42, 43 ఏళ్ల వయస్సులో 27 ఏళ్ల రోహ్మన్ అనే నోయిడా కుర్రాడితో జతకట్టింది… అంతెందుకు..? ఆమె జీవితమంతా రకరకాల వైరుధ్యాలే… ప్రత్యేకించి అప్పటి విశ్వసుందరి ఐశ్వర్యారాయ్‌తో పోలిస్తే పూర్తి కంట్రాస్టు అనిపిస్తుంది…
ఇద్దరి నడుమ ఒకటీరెండేళ్ల తేడా, అంతే… ఒకే సంవత్సరంలో ఒకరు మిస్ వరల్డ్, మరొకరు మిస్ యూనివర్స్… కానీ ఆ అందాల కిరీటాన్ని ఐశ్వర్య సరిగ్గా వాడుకుంది… మంచి సినిమాలు పడ్డయ్, తరువాత ఏకంగా బచ్చన్ కుటుంబంలో చేరింది… ఆమె కథ వేరు… కానీ సుస్మిత కథ వేరు… కొన్నాళ్లు సినిమా అవకాశాలు బాగానే వచ్చినయ్… కానీ తరువాత సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు… ఫలితంగా అడపాదడపా అవకాశాలకు, అతిథి పాత్రలకు పరిమితం అయిపోయింది… కొన్నాళ్లకు అవీ ఆగిపోయాయి… ఆరేడేళ్లపాటు ఆమె పేరే వినిపించలేదు ఎక్కడా… మళ్లీ 2020 నుంచే హాట్‌స్టార్ ఓటీటీ వెబ్ సీరీస్ ఆర్యతో యాక్టివ్ అయిపోయింది…
Ads
ఆమె హైదరాబాదీ… ఒక బెంగాలీ వైద్య కుటుంబం… తండ్రి శుబీర్ సేన్ ఎయిర్‌ఫోర్స్‌లో వింగ్ కమాండర్… తల్లి శుభ్రాసేన్ జువెల్లరీ డిజైనర్… ఫెమినా మిస్ ఇండియాగా కిరీటం పొందాక సుస్మిత కన్ను మిస్ యూనివర్స్ మీద పడింది, అదీ గెలిచింది… ఆ టైటిల్ గెలిచిన తొలి ఇండియన్ ఆమె… తరువాత మోడలింగ్, సినిమాల కోసం ఆమె ముంబైకి పూర్తిగా షిఫ్టయిపోయింది… నిజానికి ఆమె వ్యక్తిగత జీవితం, ఆమె కెరీర్ మాత్రమే కాదు, ఆమె ఆరోగ్యమూ భిన్నమే… Addison’s disease అనే ఓ అరుదైన వ్యాధి ఉంది ఆమెకు… జీవితమంతా స్టెరాయిడ్స్ వాడకం తప్పనిసరి… దీనికితోడు ఆమధ్య ఓ సర్జరీ జరిగింది… ఆ సర్జరీ ఏమిటో, దేనికో చెప్పలేదు కానీ… త్వరగా కోలుకుని, మళ్లీ వర్క్‌లో మునిగిపోవడానికి జిమ్‌లో కష్టపడుతున్నాను అంటూ తన సోషల్ ఖాతాల్లో కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసుకుంది…
మరి అకస్మాత్తుగా తన సహజీవన భాగస్వామి రోహ్మన్తో ఎందుకు విడిపోయింది..? ఏమో… చాలారోజులుగా ప్రచారంలో ఉన్నదే… ఇలాంటి బంధాలు చాలాకాలం నిలవవు, అదే జరిగింది అనే వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో బోలెడు వచ్చినయ్… కానీ వాళ్లలో ఎవరూ నోళ్లు విప్పలేదు… ఇప్పుడిక ఎట్టకేలకు సుస్మిత ‘దోస్తులుగా కలిశాం, దోస్తులుగానే మిగిలిపోయాం, రిలేషన్షిప్ ఏనాడో ముగిసింది’ అని సోషల్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చింది… #NoMoreSpeculations ప్లీజ్ అని కూడా రాసింది… ఇంతకీ తన జీవితంలో తనకు ఏం కావాలో క్లారిటీ ఉందా ఆమెకు..?!
Share this Article