.
ముందుగా సోషల్ మీడియా, మీడియాలో కనిపించిన ఓ వార్త… ప్రజలను నట్టేట ముంచిన “సువర్ణభూమి”
సువర్ణ భూమి పేరుతో కొంతకాలం కిందటి వరకూ టీవీల్లో వచ్చే ప్రకటనలు చూసి చాలా మంది ఆకర్షితులయ్యారు. దాన్ని నమ్మిన వాళ్లు ఇట్టే మునిగారు. పెద్దగా విలువలేని భూముల్ని బైబ్యాక్ పేరుతో అమ్మేసి పెద్ద స్కామ్‌కు పాల్పడ్డారు.
Ads
ఇప్పుడీ కేసు సీసీఎస్‌కు బదిలీ అయింది. లాభాలు ఆశ చూపిన సువర్ణ భూమి రియల్ ఎస్టేట్ సంస్థ ప్రజల దగ్గర నుండి కోట్లు వసూలు చేసింది. స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ.. భారీ ఎత్తున ప్రచారం చేసి ఘరానా మోసానికి పాల్పడినట్లుగా పలు కేసులు నమోదయ్యాయి.
బైబ్యాక్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద నుంచి 30 లక్షల నుంచి రెండు కోట్ల వరకు స్వాహా చేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తరువాత 24 శాతం లాభాలు ఇస్తామని, ఆశ కల్పించి, చివరికి టైం దాటిన తరువాత చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి తెర తీసింది.
గత డిసెంబర్‌లో సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల నుంచి సువర్ణభూమి డైరెక్టర్లు మోసం చేస్తున్నారని, చెల్లని చెక్కులు ఇచ్చి, వారి కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు కేసు పెట్టారు.
ప్రముఖ సినీ హీరో కొణిదెల రాంచరణ్ , స్వర్గీయ కే విశ్వనాథ్ సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని, 200 మందిమి బాధితులం ఉన్నామని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని తెలిపారు. సువర్ణ భూమి మోసాల చిట్టా పెద్దగా ఉండటంతో ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.
పోలీసులు విచారణ జరుపుతున్నారు…
సరే, రియల్ ఎస్టేట్‌లో మోసాలు, అధిక లాభాల ఆశలను ఎరవేసి చేసే మోసాలు తరచూ బయటపడుతూనే ఉంటాయి… దీన్ని భిన్నంగా ఏమీ చూడలేం… కానీ ఆ వెంచర్లకు, ఆ మోసాలకు ప్రచారకర్తలు, బ్రాండ్ అంబాసిడర్ల బాధ్యత ఎంత..? ఇదీ ప్రశ్న…
ఎందుకంటే..? విశ్వనాథ్ అంటే ప్రేక్షకులకు అమితమైన గౌరవం, నమ్మకం… పెద్దాయన తప్పు చెప్పడు, తప్పు చేయడు అని… కానీ ఏం జరిగింది…? మోసం… ఇప్పుడు ఆయనే లేడు, ఉంటే ఏమనేవాడో… ఏం ప్రాయశ్చిత్తం చేసుకునేవాడో… సేమ్ ఎస్పీ బాలు…
తను కూడా ప్రచారం చేశాడు… ఇప్పుడు తనూ లేడు… రాంచరణ్ ఉన్నాడు, ఏమంటాడు..? ఏమీ అనడు… సైలెంట్… తనకు తెలుసో తెలియదో మనకు తెలియదు గానీ… ఇలాంటి మోసపూరిత ప్రచారాల్లో కనిపించే సెలబ్రిటీలు కూడా ఆ మోసాలకు బాధ్యులు అవుతారు, శిక్షార్హులు అవుతారు… మన తెలుగు హీరోలకు ఆ సోయి ఉన్నట్టు లేదు…
అంతెందుకు..? మహేశ్ బాబు ఏకంగా గుట్కా సరోగేట్ యాడ్స్‌లో నటించాడు… హిందీలో నటించిన అమితాబ్ తప్పు తెలుసుకుని డబ్బు వాపస్ ఇచ్చేశాడు ఆ కంపెనీలకు… అక్షయ్‌కుమార్ కూడా ఆ యాడ్స్ నుంచి వైదొలిగాడు… కానీ మహేశ్ బాబు అలాగే కొనసాగించాడు.,.
చిరంజీవి మరీ కంట్రీ డిలైట్ అనే పాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్… (కంట్రీ డిలైట్ మోసపూరిత కంపెనీ కాదో అవునో తెలియదు గానీ, దాని మీద చాలా విమర్శలు, ఆరోపణలున్నాయి… పైగా చిరంజీవి రేంజ్ సెలబ్రిటీ ప్రచారం చేయదగిన కంపెనీ మాత్రం అస్సలు కాదు…)
మనవాళ్లకు ఒకటే తెలుసు, డబ్బు, యాడ్స్… అంతే… కానీ నైతిక బాధ్యత తెలియదు… అంతకుమించి చట్టపరమైన బాధ్యత గురించి కూడా తెలియదు… అదే ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం..!! రాంచరణ్ కూడా సువర్ణభూమి మోసాలకు బాధ్యత వహించాలి.., ఏమో, రేవంత్ రెడ్డికి ఇంకా ఆలోచన రానట్టుంది..!! గత ఏడాది ఏదో కేసులో సుప్రీంకోర్టు కూడా మిస్ లీడింగ్ యాడ్స్ విషయంలో సంబంధిత సెలెబ్రిటీలకూ బాధ్యత ఉందని తేల్చిచెప్పింది… https://www.indiatoday.in/law/story/patanjali-misleading-ads-case-supreme-court-says-celebrities-must-be-responsible-while-endorsing-products-2536341-2024-05-07
Share this Article