ఓ సినిమానో, సీరిసో చూస్తున్నప్పుడు… నెక్స్ట్ ఏం జరుగుతుందో… వందలకొద్ది చూసేవాళ్లు సులభంగానే పసిగట్టగల్గుతారు. ఇంకా ఆయా సినిమాల్లోనో, సీరిస్ ల్లోనూ కాస్త నెగటివ్ షేడ్స్ ఉండే అనుమానపు క్యారెక్టర్స్ తో కథ నడుపుతున్నప్పుడు… ఫలానావాళ్లే విలన్ అని కూడా ఇట్టే పట్టేస్తుంటారు. అయితే అలాంటి క్యారక్టర్స్ సంఖ్య ఎక్కువైనప్పుడు సగటు వీక్షకుల్లో ఫలానావాళ్లై అయిఉంటారని అనుకున్నాక… కాదుకాదు వీళ్లేమో అనిపించేలా అంచనాలు ఆ సినిమా, సీరిస్ చూస్తున్నంతసేపూ మారిపోతుంటాయి. కానీ, ఆ సస్పెక్టెడ్ క్యారెక్టర్సేవీ ఆ విలనీరూపం కాకుండా… అస్సలెవ్వరూ ఊహించని రూపం విలన్ గా మారితే…? ఆ విధమైన ట్విస్ట్ లే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఆసాంతం నడిపిస్తాయి. అలాంటి కథనమే… SUZHAL-vortex వెబ్ సీరిస్…
విక్రమ్ వేద సినిమాతో తామేంటో నిరూపించుకున్న పుష్కర్-గాయత్రీ ద్వయం క్రియేషన్ క్రైమ్ థ్రిల్లర్ ఈ సుజల్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా వచ్చిన సుజల్ లో పార్థిబన్, గతంలో కొన్ని సినిమాల్లో నటించి మరోసారి తెరంగ్రేటం చేసిన శ్రేయారెడ్డితో పాటు..ఐశ్వర్యా రాజేశ్, కదిర్, కుమార్ వేల్ వంటివారు నటించగా… ఈ సీరిస్ ఆసాంతం ట్విస్టుల మీద ట్విస్టులతో నడిపిన తీరు.. ప్రతీ సన్నివేశాన్నీ తెరకెక్కించిన పద్ధతీ.. వాటి ఆంబియెన్స్ ఇలా అన్ని ఆకట్టుకుంటాయి. అయితే ఈ సీరిస్ కు బ్రహ్మ, అనుచరణ్ మురుగైన్ ద్వయం డైరెక్టర్స్ గా వ్యవహరించినా… పుష్కర్, గాయత్రీ జంట ఇంట్రెస్ట్, ఐడియాలజీ, పర్యవేక్షణే ఎక్కువ ఉన్నట్టుగా మాత్రం ప్రస్ఫుటమవుతుంది…
మొత్తంగా చైల్డ్ అబ్యూసింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సీరిస్ లో స్థానికంగా కనిపించే మయాన కొల్లై అనే పండుగ జరిగే తీరు… అందుకోసం దర్శకుడు ప్రతీ మైన్యూట్ బిట్ ను తెరకెక్కించిన పద్ధతీ మనను ఆ తమిళ మూలాల్లోకి తీసుకెళ్తాయి. తమిళ మూలమైన ఈ SUZHAL-vortex అనే సీరిస్… 17 భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయగా… షణ్ముగంగా పార్థిబన్, సీఐ రెజీనాగా శ్రేయారెడ్డి, ఎస్సైగా కదిర్… షణ్ముగం పెద్ద కూతురు నందినీ పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించగా… చిన్నకూతురు నీలా పాత్రలో నటించిన గోపికా రమేష్ మిస్సింగ్ నుంచి కథలోని ట్విస్టులకు అంకురార్పణ జరుగుతుంది.
Ads
రెజీనాగా ఓవైపు సీఐ పాత్ర… మరోవైపు కొంచెం కొంటె చేష్టలతో రఫ్ గా పెరిగిన కొడుకుపై ఉన్న ప్రేమతో కనిపించే అమ్మ మమకారం.. కొన్నిసార్లు కొడుకుపై వస్తున్న ఆరోపణలతో ఏంచేయాలో తోచని ఆవేశం… ఇలా పలురకాల షేడ్స్ తో శ్రేయారెడ్డి పాత్ర ఆకట్టుకుంటే… పార్థిబన్ తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. అయితే సీరీస్ లో ఎంచుకున్న పాత్రలకు అటు ఐశ్వర్యా రాజేశ్, ఇటు కదిర్, గోపికా రమేష్ తో పాటు… కీలకపాత్రలు పోషించిన ఇతరుల నుంచీ అదే స్థాయిలో నటనను రాబట్టుకోవడంతో… ఓవైపు ట్విస్టులు, ఇంకోవైపు ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో SUZHAL-vortex 8 ఎపిసోడ్ల మొదటిభాగం సీరిస్ మాత్రం ఆకట్టుకుంటుంది…
చైల్డ్ అబ్యూసింగ్ అనేది ఆయా జీవితాల్లో ఎంత ప్రభావితం చేస్తుందనే కాన్సెప్ట్ ను ప్రధానంగా హైలైట్ చేసేందుకు ఈ సీరీస్ క్రియేటర్స్ తమ శక్తి మేరకు ప్రయత్నించగా… అణిచివేత, తాంత్రిక విద్యలు, మూఢనమ్మకాలు, పక్షపాత ధోరణులు ఇలాంటి ఎన్నో అంశాలు సీరిస్ ఉపశీర్షికలో పేర్కొన్నట్టు సుడిగుండాలను తలపిస్తూ.. ఈ సీరిస్ కచ్చితంగా ఓ మంచి థ్రిల్ నైతే మిగులుస్తుంది… (సమీక్ష:: రమణ కొంటికర్ల)…
Share this Article