Bharadwaja Rangavajhala………. ఎస్వీఆర్ మంచి నటుడే కాదు టెక్నీషియన్ కూడా. ఆయన నిర్మాణంలో, దర్శకత్వంలో వచ్చిన చిత్రాలే అందుకు ఉదాహరణ. ఎవిఎమ్ చెట్టియార్ తో ఎస్వీఆర్ కు మంచి రిలేషన్స్ ఉండేవి. ఎవిఎమ్ వారి తమిళ చిత్రాల్లోనూ ఎస్వీఆర్ విస్తృతంగా నటించేవారు. అలాగే విజయా వాహినీ సంస్ధలో కూడా ఎస్వీఆర్ కు స్పెషల్ ఛెయిర్ ఉండేది. విచిత్రంగా ఎస్వీఆర్ నిర్మాతగా మారడానికి చెట్టియార్ ప్రేరణ అయితే… దర్శకుడుగా మారడానికి బి.ఎన్.రెడ్డి కారణం…
ఎవిఎమ్ బ్యానర్ లోనే తమిళ్ లో నానుం ఒరు పెణ్ మూవీ చేశారు ఎస్వీఆర్. ఆ సినిమా భారీ విజయం సాధించింది. అందులో తను పోషించిన తండ్రి పాత్ర ఎస్వీఆర్ కు విపరీతంగా నచ్చేసింది. ఆ సినిమా తెలుగులో తీస్తే బాగుణ్ణనిపించింది. వెంటనే రాజమండ్రి నుంచి కొందరు మిత్రులను పిల్చి… తనూ కొంత సొమ్ము యాడ్ చేసి వాణీ ఫిలింస్ పేరుతో బ్యానర్ ప్రకటించారు. హక్కుల కోసం చెట్టియార్ ను కలిస్తే… ఎందుకు పార్టనర్ షిప్ లో చేద్దామన్నారు. అలా తెరకెక్కిన సినిమా నాదీ ఆడజన్మే.
అందం అంటే బాహ్య సౌందర్యం మాత్రమే కాదు… అంతర్ సౌందర్యం కూడా అని చెప్పిన సినిమా నాన్ ఒరు పెణ్. తెలుగు వర్షన్ కు కూడా తమిళ దర్శకుడు ఎ.సి. త్రిలోక్ చందర్ నే పెట్టుకున్నారు. ఎస్వీఆర్ తర్వాత సావిత్రిది కీలక పాత్ర. ఎన్.టి.ఆర్, హరనాథ్ ఇలా అందరూ బిగ్ స్టార్స్ తో తెరకెక్కింది ఎస్వీఆర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన మొదటి సినిమా. నాదీ ఆడజన్మ తర్వాత మరో సినిమా తీయదల్చుకున్నారు ఎస్వీఆర్.
Ads
ఈసారి ముందే కథ సిద్దం చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాలనది ఆయన వ్యూహం. అలా చేయగలిగితే భాగస్వామ్యం బెడద తప్పుతుందనుకున్నారు. డి.వి.నరసరాజుకు కబురు పెట్టారు. షేక్స్ పియర్ రచన రైప్ నెస్ ఈజ్ ఆల్ నుంచి ప్రేరణ పొంది తయారు చేసిన కథతో చదరంగం సినిమా తీశారు ఎస్వీఆర్. ఆ చిత్రం విడుదలై అవార్టులూ రివార్డులూ తెచ్చిపెట్టింది .
కథల ఎంపిక నుంచి దర్శకత్వం వరకు ఎస్వీఆర్ కు బిఎన్ మార్గమే అనుసరణీయంగా అనిపించేది. ఇది తను ప్రధాన పాత్ర పోషించే చిత్రాలకూ వర్తింపచేసేవారాయన. తనకు ఒకటి నచ్చితే ఇక దానికే కమిట్ అయి ఉండేవారాయన. సినిమా బయటవారిదే అయినా…. తనకు తోచిన సలహాలు చెప్పడం ఎస్వీఆర్ అలవాటు. సుఖదు:ఖాలు సినిమా విషయంలో అలాగే వ్యవహరించారాయన.
ఎస్వీఆర్ ప్రధాన పాత్రలో వచ్చిన మరో సినిమా సుఖదు:ఖాలు. తమిళ్ లో అది బాలచందర్ సినిమా. టైటిల్ మేజర్ చంద్రకాంత్. అదే సినిమా తెలుగు రీమేక్ చేసినప్పుడు మాత్రం సుఖదు:ఖాలు అని టైటిల్ కథను అనుసరించి పెట్టేశారు. మోడల్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చిన ఈ సినిమాకు ఐ.ఎన్ మూర్తి డైరక్టరు. దేవులపల్లి వారి పాటలు విని ఈ సినిమా బి.ఎన్ తీసిందేమో అనుకోవడం ఆ రోజుల్లో వినిపించేది.
చదరంగం చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు కూడా ఎస్వీఆర్ తీసుకున్నారు. తనకున్న అపారమైన నటనానుభవం కూడా దీనికి దోహదపడేది. దర్శకుడుగా ఆయన తీసిన చిత్రాల మీద బి.ఎన్.రెడ్డి ప్రభావం మాత్రం చాలా బలంగా కనిపించేది. ముఖ్యంగా పాటల విషయంలో. ఎస్వీఆర్ స్వీయ నిర్మాణంలో డైరక్ట్ చేసిన రెండో సినిమా బాంధవ్యాలు.
ఉమ్మడి కుటుంబంలో తలెత్తే వైరుధ్యాలు… పిల్లలకీ పెద్దలకీ మధ్య పెరిగిపోయే కమ్యూనికేషన్స్ గ్యాప్స్ వీటి మీద కథ నడుస్తుంది. గ్రామీణ నేపధ్యంలో సాగే బాంధవ్యాలు చిత్రంలో సాలూరి హనుమంతరావు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఘంటసాల వసంత కాంబినేషన్ లో వచ్చే అటు గంటల మోతలు గణగణా.. పాట అద్భుతంగా ఉంటుంది. పాటల చిత్రీకరణలోనూ కొత్త తరహాలో వెళ్లేవారు ఎస్వీఆర్. ఎక్కడా అసభ్యతకు చోటులేకుండా సాహితీ విలువలతో పాటలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే నటీనటుల ఎంపిక కూడా కాస్త భిన్నంగానే జరిగేది. పాత్రల వయసుకు దగ్గరగా ఉన్న ఆర్టిస్టులనే తీసుకునేవారాయన…
Share this Article