చాలా యాడ్స్ టీవీ సీరియళ్లలా విసిగిస్తయ్… క్రియేటివిటీ లేకుండా చెత్తా ఆలోచనల్ని, మార్కెటింగ్ ఎత్తుగడల్ని నింపుతారు… కానీ మంచి క్రియేటివ్ కమర్షియల్స్ (యాడ్స్) చేయడం ఓ కళ… అవి హృదయాలను కనెక్టవుతాయ్… విపరీతమైన కంటెంట్, అంకెలు, అర్థం కాని ఏవో పద గాంభీర్యాలు, స్టార్ నటీనటులు ఎట్సెట్రాలను జనం జస్ట్ చూస్తారు, అంతే… కొన్ని మాత్రమే అలా హత్తుకుంటయ్…
సరళమైన పదాలతో డైలాగులు అవసరం (అనువాదాలు తేలిక)… ఎక్కువగా హిందీ, ఇంగ్లిషుల్లో ఉండే యాడ్స్‌ను బహుళ జాతి సంస్థలు అన్ని ప్రధాన ప్రాంతీయ భాషల్లోకి అను‘వధిస్తుంటాయి’… బోలెడు ఉదాహరణలు… అవి రావల్సిన మైలేజీ ఇవ్వకపోగా కొన్ని నవ్వు పుట్టిస్తాయి, కొన్ని చిరాకెత్తిస్తాయి… తప్పుడు ఫాంట్లు, అనువాద దోషాలు బొచ్చెడు… ప్రింట్, టీవీ మీడియా కూడా (ఇప్పుడు సోషల్ మీడియా) ‘మాకెందుకు వచ్చిన ప్రయాస’ అనుకుని యథాతథంగా క్యారీ చేస్తుంటయ్…
ఈ నేపథ్యంలో హిందుస్థాన్ లీవర్ వారి బ్రూక్ బాండ్ రెడ్ లేబుల్ (మద్యం కాదు) టీ (చాయ్ పత్తా, టీ పొడి) యాడ్ ఈమధ్య టీవీల్లో బాగా కనిపిస్తోంది… బాగా కనెక్టవుతోంది కూడా… గతంలో కూడా ఈ యాడ్ రూపొందించిన మార్కెటింగ్ యాడ్ ఏజెన్సీ పలు క్రియేటివ్ కమర్షియల్స్‌తో అందరి అభినందనలూ పొందింది… (OGILVY India కావచ్చు బహుశా)…
Ads
#SwaadApnepanKa … ఓ ఇద్దరు వ్యక్తుల నడుమ సంభాషణే ఈ యాడ్… ఓ హాస్పిటల్… ఓ పెద్దావిడ (నటి సులభ ఆర్య), పక్కన బ్యాగులో ఫ్లాస్క్, కప్పులు… ఆ పక్కనే మరో వ్యక్తి… చింతాక్రాంతుడై కనిపిస్తుంటాడు… ఆమె అడుగుతుంది…
‘‘ఎవరు అడ్మిటయ్యారు..’’
‘‘నాన్న’’…
‘‘ఏమైంది..?’’
‘‘ — ’’
‘‘చాయ్ తాగుతావా..?’’
‘‘వద్దండీ..’’
ఆమె నవ్వు మొహంతో ఫ్లాస్క్ ఓపెన్ చేసి, కాస్త టీ కప్పులో పోస్తుంటుంది… ఆ పరిమళం ఆ వ్యక్తి ఇటువైపు చూసేలా చేస్తుంది… ఆగలేక ‘ఒక కప్పు’ అని అడుగుతాడు…
ఊహించిందే అనుకున్నట్టుగా ఆమె ఓ కప్పులో పోసి ఇస్తుంది… టేస్ట్ చేసి అతను ‘వావ్’ అంటాడు…
‘‘ఇంటిని గుర్తు చేసింది, అవునూ, మీ వాళ్లు ఎవరు అడ్మిటయ్యారు..?’’
‘‘ఎవరూ లేరు… ఆ ఎదురుగా ఇల్లు చూశావా..? అందులో ఉంటాను… హాస్పిటల్‌లో నీలా ఒంటరిగా బాధపడుతున్నవాళ్లు కనిపిస్తారు… వాళ్లతో కలిసి టీ తాగడానికి వస్తుంటాను…’’
‘‘కానీ… అలా చాలా చాయ్ తేవాల్సి ఉంటుంది కదా…’’
‘‘ఈ పనిలో నాకు ఆనందముంది…’’
సింపుల్… కానీ హార్ట్ వార్మింగ్… ఇదే యాడ్ ఏజెన్సీ గతంలో కరోనా వివక్షల నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్, ఎమోషనల్ డిస్టెన్సింగ్… ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ… సిక్స్ ప్యాక్ బాండ్… వంటి చాలా అంశాల్లో మంచి మంచి యాడ్స్ చేసింది… వాటితో పోలిస్తే ఈ తాజా యాడ్ కొంత లో-రేంజ్ అనిపించినా తమ ‘సోషల్ ధోరణి’ని మాత్రం వదిలి పెట్టలేదు… గుడ్…
నేషనల్ యాడ్ క్యాంపెయిన్ కంపెనీలు చాలా వర్క్ చేస్తాయి… మన తెలుగు యాడ్స్ పరమ నాసిరకం… ఎంతసేపూ ప్రభుత్వ యాడ్స్ కొట్టేసి, అడ్డగోలు కమీషన్లు పొందే కక్కుర్తి తప్ప ప్రొఫెషనలిజం తక్కువ..!! సింపుల్ అండ్ స్వీట్… జస్ట్, ఒక ఇల్లస్ట్రేషన్, ఒక వ్యాఖ్యతో అమూల్ యాడ్స్ చూస్తుంటాం కదా… బాగుంటయ్ కదా…!!
Share this Article