.
గుండెకు కళ్లుండవు… కానీ చూపు ఉంటుంది … వయసు ఏదైతే ఏమి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ప్రాణాంతకమవుతూ ఉంటాయి. అలా ఎనిమిదేళ్ల ఆ పిల్లాడికి కళ్లల్లో ఏదో సమస్య. చూపు సరిగా కనిపించడం లేదు. తాత అతణ్ని పూణెకు తీసుకొచ్చి డాక్టర్లకు చూపించాడు. అన్ని పరీక్షలూ చేశారు. రిపోర్టులు వచ్చాయి. పిడుగులాంటి వార్త. ఏమిటి?
ఆ పిల్లాడికి ‘Retinoblastoma’.. అంటే చిన్నపిల్లల కంటి రెటీనా సెల్స్‌లో పెరిగే క్యాన్సర్. చాలా అరుదుగా వచ్చే సమస్య. కానీ వచ్చింది. మరేంటి పరిష్కారం? కళ్లు తీసేయాలి. తప్పదు. ప్రాణాలు కావాలంటే, పిల్లాడు బతకాలంటే ఆ కళ్లను తొలగించాలి. లేకపోతే ఎనిమిదేళ్లకే అతనికి నూరేళ్లు నిండుతాయి.
ఇదంతా ఆ పిల్లాడికి అర్థం కాదు. అర్థం చేసుకునే వయసు లేదు. అతని తాత గుండెలో అలజడి. ఆయన గుండెకు కళ్లు లేవు. కానీ చూపు ఉంది. అది మనవడి వంక దీనంగా చూస్తోంది. అతను ప్రపంచంలోని అందాలు ఏం చూశాడని? ఏం అనుభవించాడని? ఎనిమిదేళ్లకే అంధుడైతే ఇక జీవితాంతం ఎలా బతికేది? అతణ్ని చూసుకునేది ఎవరు? అతని జీవితం సాగేది ఎలా? ఎన్నెన్నో ఆలోచనలు.. ఎంతో దు:ఖం.
Ads
అక్కడా ఇక్కడా తిరిగాడు. మరో డాక్టర్ దగ్గరికి వెళ్లాలని చూశాడు. మరేదైనా ఉపాయం ఉందా అని ఆలోచించాడు. కనీసం ఒక్క కన్ను మిగిలినా చాలని ప్రాథేయపడ్డాడు. కానీ ఏదీ సాధ్యం కాదు. రెండు కళ్లు తొలగిస్తే తప్ప లాభం లేదు. ప్రాణం దక్కదు. నిజమే! ఇదంతా బుద్ధికి తెలుస్తుంది. కానీ మనసనే దానికి అర్థం కావడం లేదు.
తోటి పిల్లలతో కలిసి స్వేచ్ఛగా, హాయిగా ఆడుకునే పిల్లాడి కళ్లు తీసేసి, అతని లోకాన్ని చీకటి చేయడం ఎందుకని అడుగుతోంది. నూరేళ్ల అతని జీవితంలో ఎనిమిదేళ్లకే వెలుగు తీసేసి, బతకమని చెప్పడం ఏం న్యాయం అని ప్రశ్నిస్తోంది. ఎలా? ఆ మనసును సమాధానపరచడం ఎలా?
ఎక్కువ సమయం లేదు. పిల్లాడికి త్వరగా ఆపరేషన్ చేసి కళ్లు తీసేయాలి. లేకపోతే ప్రమాదం. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. తాత తన గుండె దిటువు చేసుకున్నాడు. అన్నిటికీ సిద్ధపడ్డాడు. మనవడికి ఇదేమీ తెలియదు. ఆ పిల్లాడికంతా వింతగానూ, కొత్తగానూ ఉంది. రేపుదయం ఆపరేషన్.
ఆపైన అతనికి కళ్లుండవు. ఆ విషయం అతనికి తెలియదు. ఆడుతూ పాడుతూ ఉన్నాడు. ఉదయం ఆపరేషన్ థియేటర్ సిద్ధమైంది. కానీ తాత, మనవడు లేరు. ఎక్కడికి వెళ్లారు? ఏమయ్యారు? ఎటు వెళ్లిపోయారు? ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటి? చుట్టూ ఉన్నవారి మాటల ప్రకారం వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారా? చివరకు ఏమైంది?
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా దర్శకుడు సందీప్ సావంత్ 2004లో తెరకెక్కించిన చిత్రం ‘శ్వాస్’ (Shwaas). మరాఠీ సినీరంగాన్ని మలుపు తిప్పిన సినిమాగా నేటికీ ఈ సినిమాకు స్థానం ఉంది. కేవలం 33 రోజుల్లో నాలుగు లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమాకు అయిన మొత్తం ఖర్చు రూ.60 లక్షలు. సాధించిన వసూళ్లు అక్షరాలా రూ.2.75 కోట్లు.
2004లో జాతీయ ఉత్తమ చిత్రంగా ఈ సినిమాకు పురస్కారం ప్రకటించారు. ఈ సినిమాను నిర్మించిన 8 మంది నిర్మాతలు కలిసి అప్పటి రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం చేతుల మీదుగా స్వర్ణకమలం అందుకోవడం మొత్తం దేశాన్ని ఆశ్చర్యపరిచింది. మరాఠీ సినిమాకు ఇంత స్థాయి ఉందా అని ఆలోచించేలా చేసింది.
అక్కడితో ఈ సినిమా ఘనత అయిపోలేదు. భారతదేశం తరఫున ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా ఈ సినిమాను పంపించారు. అయితే ప్రచార కార్యక్రమాల కోసం నిధులు సేకరించేందుకు క్రికెటర్ సచిన్ టెండుల్కర్, నటుడు అమితాబ్ బచ్చన్ వంటివారు ముందుకొచ్చారు.
మరాఠీ సినిమాకు మంచి జరుగుతుందంటే తాము తప్పకుండా ముందుకొస్తామన్నారు. ముంబయిలోని సిద్ధివినాయక గుడి సిబ్బంది ఏకంగా ఈ సినిమా కోసం గుడి ఆవరణలో ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేశారు. గోవా ప్రభుత్వం రూ.21 లక్షలు, మహారాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు అందించింది. రాజకీయ పార్టీ శివసేన సైతం సాయం చేసింది.
ఈ సినిమాను ఆస్కార్ స్థాయిలో నిలిపేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించాయి. నాటక సమాజాలు ముందుకొచ్చాయి. చివరకు స్కూల్ పిల్లలు సైతం డబ్బాలు పట్టుకొని విరాళాలు సేకరించారు. ఇదంతా మరాఠీ సినిమా కోసం, ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిలవడం కోసం.
అమెరికాలో ఉండే 12 వేల మంది మరాఠీవారు సైతం ఈ సినిమాకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. అమెరికాలో ఈ సినిమాను 14 సార్లు స్క్రీనింగ్ వేశారు. మరాఠీ సినిమా గురించి దేశమంతా చెప్పుకున్న సంవత్సరం అది. అప్పటిదాకా ఏడాదికి 10 సినిమాలు తీస్తే గొప్ప అనుకునే మరాఠీ సినిమా రంగం ఇంత ఘనత సాధించగలదా అని ఆశ్చర్యపోయిన తరుణం అది. కానీ ఆస్కార్‌కు ‘శ్వాస్’ ఎంపిక కాలేదు. ఆస్కార్ వేదికకు ఆ అదృష్టం దొరకలేదు.
ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది. సబ్ టైటిల్స్ లేకపోయినా చూడండి. పసివయసు మనవడి చూపు కోసం ఒక తాత పడే తాపత్రాయాన్ని ఆర్తితో గమనించండి. కాసింత గుండె తడి.. కాసింత కన్నీరు కలగలిసిన కథల కోసం వెతుకుతూ ఉంటే ఈ సినిమా చూడండి. జీవితం పట్ల ఆశావాదంతో బతకడం నేర్పే సినిమాలు కావాలంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమా ముగింపు మీ గుండెల్లో నిలిచిపోతుంది. తథ్యం. – విశీ (వి.సాయివంశీ)
Share this Article