స్వర్గం- నరకం సినిమాను ఆదుర్తి సుబ్బారావు తర్వాత మళ్ళా అంతా కొత్తవాళ్ళతో సినిమా తీసింది దాసరి నారాయణరావే . హోటల్లో కాఫీ అందించే కుర్రాడితో సహా అందరూ కొత్తవారే అని ఒక ఇంటర్వ్యూలో దాసరే చెప్పారు . అంత చొరవ , సాహసం , ధైర్యం ఏ కొద్ది మందికో ఉంటుంది . వారిలో దాసరి ఒకరు . తేనెమనసులు సినిమాలో అందరూ కొత్త వారయినా ఫీల్డులో నిలబడి ఒక వెలుగు వెలిగింది కృష్ణ మాత్రమే . మిగిలిన వారయిన రామ్మోహన్ , సుకన్య , సంధ్యారాణి కొన్నాళ్ళు తిప్పలు పడి నిష్క్రమించారు .
అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు అంత కాకపోయినా అన్నపూర్ణ కూడా ఒక వెలుగు వెలిగింది . 27 ఏళ్ల వయసులో ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన అన్నపూర్ణ ఇంకా అడపాదడపా తళుక్కుమంటూనే ఉంది . ప్రత్యేకంగా చెప్పుకోవలసింది ఫటాఫట్ జయలక్ష్మి గురించి . ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేసిన ఆమె సుమారు యాభై సినిమాల్లో ఫటఫటలాడించి ఈ లోకాన్నుంచే నిష్క్రమించింది . 1958 లో పుట్టిన ఆమె 1980 లో చనిపోయింది . నాకు చాలా ఇష్టమైన నటి .
దాసరి దర్శకత్వం వహించిన పదో సినిమా ఇది . అయితే నటుడిగా ఇదే తొలి సినిమా . గొప్ప పాత్ర . ట్రబుల్ షూటర్ కం పరాన్నభుక్తుడి పాత్ర . ఒకప్పుడు ఇలాంటి పాత్రలు CSR వేసేవారు . దాసరి తర్వాత గొల్లపూడి మారుతీరావు వేసారు ఇలాంటి పాత్రలను . ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు . దాసరి , మోహన్ బాబు , ఈశ్వరరావు .
Ads
ఇద్దరు హీరోయిన్లు . ఒకరు గలగలా పారే సెలయేరు . లొడలొడా మాట్లాడుతూ , మగవాళ్ళంతా దుర్మార్గులు , స్త్రీలోలులు వంటి అభిప్రాయాలు ఉండే అనుమాన పక్షి . ఈ పాత్రలో ఫటాఫట్ జయలక్ష్మి అనుభవం ఉన్న నటి లాగానే నటించింది . సహనం , సంయమనం , నిదానం మూర్తీభవించిన పాత్ర మరొకటి . అన్నపూర్ణ చక్కగా నటించింది అప్పటికే ఎంతో అనుభవం ఉన్న నటిలాగా .
దాసరి సినిమాల్లో నాటకీయత (drama) , డైలాగులు , ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి . ఈ సినిమాలో కూడా అవన్నీ పుష్కలంగా ఉంటాయి . ఇలాంటి కధావస్తువులతో చాలా సినిమాలు వచ్చాయి . దేనికి దానిదే స్పెషల్ . మనసుకు , బుర్రకు హత్తుకునేలా , పది కాలాల పాటు గుర్తుండేలా తీయటమే గొప్ప . ఈ సినిమా ఆ కోవకు సంబంధించిందే .
అనుమానాలతో , హెల్యూసినేషన్సుతో , మొగుడి మీద పెత్తనం చేయాలనే మనస్తత్వంతో స్వర్గం లాంటి సంసారాన్ని నరకం చేసుకునే భార్య ఒకరు . ఓర్పుతో , సంయమనంతో , భర్త తింగరి వేషాలు తెలిసి , ఇంటినే గానాబజానాగా మార్చే సతీ సుమతి వంటి భార్య మరొకరు . మొదటి పాత్ర ఫటాఫట్ జయలక్ష్మిది , రెండవ పాత్ర అన్నపూర్ణది . ఇద్దరూ చాలా బాగా నటించారు . విశేషం ఏమిటంటే అందరూ అనుభవం ఉన్న నటుల్లాగే నటించారు . దాసరి శిక్షణను మెచ్చుకోవాల్సిందే .
తేనెమనసులు రంగుల సినిమా . ఈ సినిమా మాత్రం బ్లాక్ & వైట్ . అయినా ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది . విజయవాడ , గుంటూరు , నెల్లూరు , హైదరాబాద్ , విశాఖపట్నం , కాకినాడ . మా గుంటూరులో కృష్ణా పిక్చర్ పేలసులో ఆడింది . నేను ఈ థియేటర్లోనే చూసా . ఇప్పుడు ఆ థియేటర్ లేదు . కాకినాడ దేవి శ్రీదేవి థియేటర్లలో వంద రోజుల పండుగ జరిగింది . విజయవాడలో కొంత ఔట్ డోర్ షూటింగ్ జరిగింది . ప్రకాశం బేరేజ్ మీద కూడా షూటింగ్ జరిగింది .
సత్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు థియేటర్లో బాగున్నా బయట గొప్పగా హిట్ కాలేదు ఎందుకనో . ఈ సినిమాలో మోహన్ బాబు గర్ల్ ఫ్రెండుగా నటించిన రాజేశ్వరి చాలా సినిమాల్లో నటించింది . మా గుంటూరు కోబాల్డ్ పేట వాసి జీవా కూడా ఉన్నాడని గుర్తు . Subject to correction . కాలేజీ కుర్రాళ్ళలో ఒకడిగా కనిపిస్తాడు .
తేనెమనసులు సినిమా కన్నా ముందే కృష్ణ ముందడుగు వంటి ఒకటీ రెండు సినిమాల్లో కనిపించారు . అలాగే మోహన్ బాబు కూడా భక్తవత్సలం పేరుతో కన్నవారి కలలు సినిమాలో కనిపించారు . అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న భక్తవత్సలాన్ని మోహన్ బాబుని చేసి అద్భుతమైన కెరీర్ని , జీవన ప్రస్థానాన్ని ప్రసాదించింది దాసరే . హీరోగా , కమేడియన్ గా , కేరెక్టర్ ఆర్టిస్టుగా , నిర్మాతగా , విద్యా సంస్థల వ్యవస్థాపకుడిగా , రాజ్యసభ సభ్యుడిగా , సంచలనాలకు కేంద్ర బిందువుగా వెలిగిపోతుంది మోహన్ బాబే .
అందరూ కొత్త వారితో సినిమా తీసిన ఆదుర్తికే ఈ స్వర్గం- నరకం సినిమాను దాసరి అంకితం ఇచ్చారు . స్వర్గం -నరకం సినిమా లాగానే తర్వాత కూడా రెండు మూడు సినిమాలను దాసరి తీసారు . సాహసంతో కూడిన కొత్తదనం కోరుకునే వ్యక్తుల్లో ఒకరు దాసరి . ఉదయం పత్రిక అందుకు నిదర్శనం . రాజకీయాల్లో కేంద్ర మంత్రి కూడా అయ్యారు . ఇరవై సంవత్సరాల కింద మా మహాత్మాగాంధీ కళాశాలకు ఓ రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చారు .
సినిమా అభిమానులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఈ స్వర్గం నరకం . యూట్యూబులో ఉంది . చూడనివారు తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. [ Review : దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]
Share this Article