ఒక్కసారి ఊహించండి… రెండు నెలల్లో మరణించబోయే ఓ వ్యక్తిని హీరోయిన్ ప్రేమిస్తుంది… తెలిసీ… అది అమలిన ప్రేమ… దీన్ని ఈరోజుల్లో ఓ సినిమాగా తీసి మెప్పించడం, ప్రేక్షకులను ఒప్పించడం ఎంత కష్టమో కదా… అదీ ఏమాత్రం అశ్లీలత లేకుండా… కన్విన్సింగుగా…
ఇతర భాషల్లో ఇలాంటి కథలతో, ప్రయోగాలతో దర్శకులు ఆడుకుంటారు… హిట్టో ఫ్లాపో జానేదేవ్… తమ భావాల్ని, ఆలోచనల్ని వెండితెర మీద తమదైన శైలిలో ఆవిష్కరిస్తారు… ఖర్చుకు సిద్దపడే నిర్మాతలు కూడా దొరుకుతుంటారు… ఎటొచ్చీ మన తెలుగు సినిమాకే ఇలాంటివేమీ లేని దరిద్రం… మనకెప్పుడూ కుర్చీ మడతపెట్టడాలు, అమ్మడూ లెట్స్‌డు కుమ్ముడూలు…
కన్నడంలో ‘స్వాతి ముత్తిన మళె హనియె’ అని ఓ సినిమా వచ్చింది… (ప్రైమ్‌లో ఉంది… సినిమా పేరుకు తెలుగు అర్థం స్వాతిచినుకు అని సంక్షిప్తంగా…)… దర్శకుడు రాజ్.బి.శెట్టి… స్క్రీన్‌ప్లే, కథారచన కూడా తనే… అంతేకాదు, ఇలాంటి సినిమాలు చేయడానికి పెద్దగా పెద్ద హీరోలు ఇష్టపడరు కదా, తనే లీడ్ రోల్ చేశాడు… ఆ పాత్రకు తగినట్టు సటిల్డ్ నటనతో మెప్పించాడు… చార్లి777 సినిమా తీసింది తనే… మనకు పరిచయమే…
Ads
ప్రధాన ఆడపాత్ర పోషించింది సిరి రవికుమార్… ఆమె రేడియోజాకీ కమ్ మోడల్ కమ్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ కమ్ సింగర్… బహుముఖ ప్రతిభ తనది… అలవోకగా ఓ భిన్నమైన పాత్రలోకి అచ్చంగా ఒదిగిపోయింది… కన్నడ సాయిపల్లవి… కదిలిస్తుంది ఆమె నటన…
నిజానికి చెప్పాల్సింది దివ్య స్పందన గురించి… ఒకప్పటి హీరోయిన్, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి, రాజకీయ నాయకురాలు, మరో పేరు రమ్య… ఈ సినిమాలో తనే ప్రధాన పాత్ర చేయాలని అనుకుంది… ఇది తన కమ్ బ్యాక్ సినిమా అని కన్నడ మీడియా రాసుకుంది కూడా… తరువాత ఏమైందో గానీ ఆమె తప్పుకుని సిరి రవికుమార్‌ను ఎంగేజ్ చేసుకుంది… ఈ సినిమాకు ఆమే నిర్మాత కూడా… టేస్టున్న నిర్మాత,.. భావుకి…
కథకు వద్దాం… రేపోమాపో మరణించే వ్యక్తుల ప్రేమ అనేది మనం గీతాంజలిలో కూడా చూశాం కదా అంటారా..? మరణించబోయే ఇద్దరి నడుమ ప్రేమ, ఎలాగూ చనిపోతున్నాం కదా అనే భావన వారి నడుమ ప్రధానం… కానీ ఈ సినిమాలో వేరు… ఆమెకు ఆల్‌రెడీ పెళ్లయింది… మొగుడున్నాడు… కానీ హీరో త్వరలో మరణించబోయే కేరక్టర్… మనసు బండబారిపోయిన ఆమె మనసును ఆయన ఎలా రాగరంజితం చేశాడనేది ఇంట్రస్టింగ్ స్టోరీ లైన్, అదీ దురుద్దేశపూర్వకంగా కాదు…
ఇలాంటి కథను సినిమాగా చెప్పాలనుకోవడం నిజంగా సాహసమే… దర్శకుడు చేసిన మరో సాహసం తనే ఆ పాత్ర పోషించడం… మనం ఇన్నేళ్లూ తెలుగు సినిమాల చేదును తినీ తినీ దాన్నే తీపి అనుకుంటున్నాం… ఇలాంటి సినిమాలు చూస్తే కదా అభిరుచి ఉన్న ప్రేక్షకులకు అసలు తీపి ఏమిటో తెలిసేది… ప్రేమ ఎంతటి అపురూప భావనో తెలిసేది…
ఆశ్రయ అని ఓ సంస్థ… ఉదాత్తమైన ఆశయంతో నడుస్తుంటుంది… రెండుమూడు నెలలకన్నా ఎక్కువ ఆయుష్షు లేని రోగులను చేర్చుకుని, వాళ్లను కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది… అందులో ప్రేరణ అనే అమ్మాయి… రోగులకు కౌన్సిలర్… అంటే, ఏమీలేదు, ధైర్యం చెబుతూ ఉంటుంది… నిజానికి ఆ రోగులకూ తెలుసు, తాము త్వరలో కాలం చేయబోతున్నామని… ఐనా ఆమె మాటలతో ఓ స్వాంతన… ఆమెకు అది ఉద్యోగమే కాదు, జీవితంలో ఓ భాగం…
ఆమెకు భర్తతో సరైన దాంపత్య జీవితం లేదు… ఆమె చిరునవ్వునే మరిచిపోయి యాంత్రికంగా మారిపోతుంది… పిల్లల్లేరు… అప్పుడప్పుడూ వచ్చి జాలిగా చూసి వెళ్లే తల్లి ఉంటుంది… ఉదయమే లేచి ఇంటి పనిలో భాగంగా వాకిలి ఊడుస్తూ వాకిట్లో రాలిన నందివర్ధనం పూలను కూడా నిర్వికారంగా ఊడ్చేస్తుంది… అంత నిర్లిప్తత ఆవరించి ఉంటుంది…. అది ఆమె దినచర్య… అక్కడే పనిచేసే అటెండర్ కూడా సున్నిత మనస్కుడే… ఈ రోగుల డెస్టినీని తలుచుకుని, ఎవరైనా పోయినప్పుడు ఫుల్లుగా తాగేసి పడుకుంటాడు…
Share this Article