.
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డిపై ఏపీ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తున్న తీరును ‘ముచ్చట’ ఖండిస్తుంది… ఇలాంటి పోకడలు ఏ ప్రభుత్వం నుంచి కనిపించినా అవి ఖండనీయం… అందులో వేరే మాట లేదు, ఖండనకు వెనుకంజ కూడా అవసరం లేదు…
ఐతే తమ వ్యతిరేక గొంతుల్ని మూయించడానికి ప్రయత్నించే పాలకుల్లో చంద్రబాబు మొదటి వాడు కాదు, చివరి వాడు కూడా కాదు… అంతెందుకు..? వైఎస్ ఏకంగా ఈనాడు ఆర్థిక మూలాల్నే పెకిలించే ప్రయత్నం చేయలేదా..? ఇదే సాక్షిని మూసేయించడానికి చంద్రబాబు గతంలో ప్రయత్నించలేదా..?
Ads
ఎప్పుడైతే మీడియా హౌజులు ఆయా పార్టీల బాకాలుగా, డప్పులుగా మారాయో… ఆయా పార్టీలను ఆవాహన చేసుకుని, ఆ రంగుల్ని పులుముకున్నాయో… ఈ ‘గొంతులు నొక్కేసే’ ధోరణి మొదలైంది… ఇది అంతటా ఉన్నదే…
ఏపీలో ఇప్పుడున్నది నిజానికి చంద్రబాబు ప్రభుత్వం కాదు, లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం… ఇలాంటి విధానాల్లో లోకేష్ పదాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది… అధికారంలోకి రాగానే సాక్షి సహా మరికొన్ని చానెళ్లను జగన్ అనుకూల మీడియాగా ముద్రేసి, ఎమ్మెస్వోల మెడలపై కత్తులు పెట్టి, ప్రసారాలు ఆపించి కొంత హంగామా చేయడం తెలిసిందే…
దీని మీద కూడా సాక్షి పోరాటం చేసింది… తప్పదు… అవును మరి, అంతకుముందు ఏబీఎన్, టీవీ5, ఈటీవీల మీద కూడా జగన్ కన్నెర్ర చేయలేదా..? అనేది కొందరి సమర్థన… అది తప్పే, ఇదీ తప్పే… జగన్ చేశాడు కాబట్టి మేం ఇంకా ధాటిగా అమలు చేస్తాం అనేది ఒప్పు ఎలా అవుతుంది..?
సరే, ప్రస్తుత వేధింపులు, కేసుల విషయానికి వద్దాం… (ఈడీ తాకట్టులో ఉన్న సాక్షి ఆస్తుల్ని టార్గెట్ చేసి, చట్టపరంగానే దాని నోరు ఎలా మూయాలో కూడా టీడీపీ ప్రభుత్వం ఆలోచించొచ్చు బహుశా…) సాక్షి వ్యవస్థను టార్గెట్ చేయడంతోపాటు పర్టిక్యులర్‌గా… అంతకుమించి సాక్షి ఎడిటర్ మీద సాధింపులు కనిపిస్తున్నాయి…
కారణం… ధనుంజయ్ జగన్మోహన్‌రెడ్డి సన్నిహితగణంలో ఒకరు… ఆ గణంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఓ కేసులో ఇరుక్కుంటున్నారు… జగన్ కోటరీని డిమోరల్ చేసే ప్రయత్నం ధాటిగానే సాగుతోంది… సరే, వైసీపీ కూడా అధికారం పోగానే ఇదంతా జరుగుతుందని ఊహించిందే… ఐతే ధనుంజయ్ రెడ్డిని టార్గెట్ చేయడానికి సాక్షి కథనాల్ని ఆధారం చేసుకుంటున్నారు…
నిజానికి ధనుంజయ్ రెడ్డి మీద పెడుతున్న కేసులకు ఏ ఆధారాలుగా చెబుతున్నారో ఆ కథనాలు పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకం కాదు, ప్రజావ్యతిరేకం కూడా కాదు… అది వైసీపీ వాయిస్… వైసీపీ శిబిరంలో సాక్షి ఒక భాగం… రాజకీయ మసాలా ఉంటే ఉండొచ్చుగాక ఆ కథనాలకు… కానీ మరీ ఎడిటర్ మీద కేసులు పెట్టేంత అభ్యంతరకరంగా ఏమీ అనిపించడం లేదు అవి…
రాజకీయ పోస్టులు, వార్తలు నేరాలు ఎలా అవుతాయని కోర్టులు కూడా అడుగుతున్నాయి… రాజకీయాల్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి… అదే సరైన పోరాటం… అసలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు చేసిందేమిటి..? ప్రత్యేకించి ఎన్నికల ముందు ఏది తోస్తే అది అడ్డగోలుగా రాసి, జనంలోకి తీసుకుపోలేదా..? అవి పక్కా జగన్ వ్యతిరేక శిబిరాలుగా వ్యవహరించలేదా..?
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై రోజూ పుంఖానుపుంఖాలుగా రాస్తూనే ఉన్నారుగా ఇప్పటికీ… సరే, దాన్ని వ్యతిరేకించలేం… నిజంగానే అక్రమాలు బయటపడుతుంటే జనంలోకి తీసుకువెళ్లడం తప్పు కాదు… కానీ టోన్ అండ్ టెనర్… టీడీపీ నాయకులకన్నా ఈ జర్నలిస్టులే మరీ ముదురు పసుపు రంగు చొక్కాలు ధరించడం విశేషం… ఈ వైరం, ఈ టార్గెటెడ్ కేసులు ఇప్పట్లో ఆగేట్టు లేవు…!!
Share this Article