.
కల్తీ కల్లు ఖచ్చితంగా కేసీయార్ తెచ్చిపెట్టిన ఉప -ద్రవమే… అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కల్లు కంపౌండ్లపై నిషేధం విధించింది ప్రభుత్వం… అప్పటికే తాటిచెట్లు కనుమరుగవుతూ, రాజధానిలో కల్తీ కల్లు పెరిగిపోయేసరికి, ప్రజారోగ్యం దృష్ట్యా మూసేయించింది ప్రభుత్వం…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక… జనం ఆరోగ్యం దిశలో మరింత కఠినంగా దీన్ని అమలు చేయాల్సింది పోయి, బార్లా తెరిపించాడు కేసీయార్… అదొక విపత్తుగా ఎలా మారిందీ అంటే… హఠాత్తుగా వాటిని మూసేస్తే ఆ కల్తీ కల్లు అలియాస్ విషం దొరక్క జనం పిచ్చి లేచి ఎర్రగడ్డ హాస్పిటల్‌కు పోటెత్తుతున్నారు… ఇదుగో వార్త…
Ads
అంటే, ఏం జరుగుతోంది… ఈ కల్లు తాగినా జనం చస్తున్నారు… తాగకపోయినా చస్తున్నారు… ఇదొక పారడాక్స్ ఉప-ద్రవం… హఠాత్తుగా ఈ కల్లు దొరక్కపోతే అప్పటిదాకా దానికి అడిక్టయినవాళ్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున… జాగ్రత్తగా ఓ వ్యూహం ప్రకారం, బాధితుల ప్రాణాలు, ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు, డీఅడిక్షన్ ప్రణాళికలతో మూసేస్తూ రావాలి…
కానీ మన అధికారులు ఏం చేస్తున్నారు..? 12 మంది దాకా మరణించి, చాలామంది హాస్పిటళ్ల పాలు కావడంతో… హఠాత్తుగా ఈ కల్లుపై కళ్లు తెరుచుకున్నట్టు, అసలు ఇప్పటిదాకా వాళ్లకు ఏం తెలియనట్టు నటిస్తూ… ఎడాపెడా దాడులు చేస్తున్నారు… మూసేస్తున్నారు…
కొన్నింటికి అసలు లైసెన్సులే లేవట… నిజంగా మన ఎక్సయిజు శాఖకు తెలియదా..? వాళ్లూ ఈ పాపంలో భాగస్తులే కదా… నాయకులూ తక్కువేమీ కాదు… తిలా పాపం తలా పిడికెడు… ఇప్పుడు రసాయనాలు కలిపి కల్లు తయారు చేస్తున్నట్టు గుర్తిస్తున్నారట… ఇదీ ఓరకం ప్రజావంచన…
ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు అన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ ఒకటే వార్తల రొద… ఒకసారి కల్తీ కల్లుకు అడిక్టయితే… ఇక మీరు చీప్ లిక్కర్ తాపించినా వాళ్లకు ఎక్కదు… కల్తీ కల్లు విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అరాచకంగా ఉంటుంది… పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తారు…
ఇది తాగినా చస్తారు, తాగకపోయినా చస్తారు అని ఎందుకు చెప్పుకోవడం అంటే..? ఈమధ్య నిర్మల్ జిల్లాకు చెందిన ఓ యువకుడు దుబాయ్ వెళ్లాడు ఉపాధి కోసం… కల్తీ కల్లు దొరకదు, దొరికిన మామూలు మద్యం తనకు పనికిరాదు… పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ ఎటో వెళ్లిపోయి, చివరకు శవమై కనిపించాడు…
పేరు ఏదైనా సరే, గుల్ఫాం, అల్ఫ్రాజోలం, డైజోఫాం, కరక్కాయపొడి, క్లోరోహైడ్రేట్… ఏం కలిపినా అది మోతాదు మించితే ఆ కల్లు విషమే… గుల్ఫాం కల్లు, సింథటిక్ కల్లు అని పిలుస్తుంటారు… రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్లు కంపౌండ్లను మూసేయాలని గనుక నిర్ణయం తీసుకుంటే అది ప్రభుత్వ ప్రతిష్ట పెంచేదే అవుతుంది… కానీ కల్లు కంపౌండ్ల విత్‌డ్రాయల్ సిండ్రోమ్ కూడా గుర్తుపెట్టుకుని, జాగ్రత్తగా అమలు చేయాలి..! కేవలం అరెస్టులతో, కేసులతో సమస్య పరిష్కారం కాదు…
కిలో పౌడర్ 10 లక్షలు… 10 గ్రాములతో 1200 సీసాల కల్లు అట… మహారాష్ట్రలో తయారైన అల్ఫ్రాజోలం తెలంగాణకు వస్తోంది… కింది నుంచి పైదాకా మామూళ్లు… అంటే, ఇది ఈమేరకు ఓ మాఫియా నెట్‌వర్క్… కల్తీ కల్లు దొరికితే కంపౌండ్ మూసేస్తామని ఇప్పుడు ఉన్నతాధికారుల ప్రకటనలు… ప్రజారోగ్యంపై క్రుయల్ జోకులు… ప్రభుత్వమే ఓ విధాన నిర్ణయం ప్రకటించాలి..!!
Share this Article