Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తబరన కథె… కమల్ హాసన్‌కే అన్న కదా మరి… జీవించేశాడు…

October 29, 2023 by M S R

… 2009-2011 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో దాదాపు 1400 మంది రైతులు అప్పులభారంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతకు ముందే రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి రూ.7 వేల కోట్ల నిధులు మంజూరైనా అవేవీ ఆ ఘోరాన్ని ఆపలేకపోయాయి. ఆ నిధుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు గద్దల్లా కాచుకున్నారు‌. లంచం ఇస్తే తప్ప రైతుల చేతికి పరిహారం రాదన్నారు. National Human Rights Commission ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. పదేళ్లు గడిచిపోయాయి. పరిస్థితి ఏమైనా మారిందా?

… నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని రాత్రికిరాత్రి ప్రకటించారు. దాని వల్ల ఏదో లాభం ఒనగూరుతుంది అన్నారు. నిరుపేదలు తాము కూడబెట్టుకున్న కాసింత డబ్బును చేతబట్టి బ్యాంకుల ఎదుట నిల్చున్నారు. ఎన్ని పల్లెల్లో బ్యాంకులున్నాయి? ఎందరికి ఆ విషయ పరిజ్ఞానం ఉంది? వచ్చే పింఛన్ మీద కాలం గడిపే ముసలివాళ్లు ఎక్కడికి వెళ్తారు? ఎవర్ని అడుగుతారు? వాళ్ల బాధలు ఎవరు వింటారు? మనం దారుణమైన వ్యవస్థలో ఉన్నాం. చదువు, హోదా ఉన్నవారికే న్యాయం దొరకడం మృగ్యం. ఇక సామాన్యుల పరిస్థితి చెప్పాలా?

… 1986లో తెలుగులో కమల్‌హాసన్‌తో కె.విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అనే సినిమా తీస్తున్న తరుణంలో పక్కన కర్ణాటకలో గిరీష్ కాసరవెల్లి‌ అనే దిగ్దర్శకుడు చారుహాసన్‌తో ‘తబరన కథె'(తబరుని కథ) అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. చారుహాసన్ కమల్‌హాసన్ అన్న. నటి సుహాసిని తండ్రి. అవి మాత్రమే ఆయన ప్రత్యేకతలు కావు. 30 ఏళ్లపాటు వకీలుగా ప్రాక్టీస్ చేసి, 50 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. సహాయక పాత్రలే చేసినా గుర్తుండే పాత్రలు చేశారు. 55 ఏళ్ల వయసులో ఈ సినిమాలో ‘తబర’ అనే ప్రభుత్వ వాచ్‌మెన్ పాత్ర పోషించారు.

Ads

… ప్రభుత్వ కార్యాలయాల్లో బోలెడు లొసుగులు ఉంటాయి. అందులో పనిచేస్తూ కూడా అవేమీ తెలియక మసిలే మనుషులు ఉంటారు. తమ పనిని చాలా నిజాయితీగా చేస్తూ, తమ లోకం తమది అన్నట్టు బతుకుతారు. అటువంటి వ్యక్తి రిటైరై ప్రభుత్వ కార్యాలయం ముందు చేరితే హక్కుగా అతనికి రావాల్సిన సొమ్ము అతనికి దక్కేందుకు ఇన్ని లాలూచీలా? ఇన్ని ఆరాలా? ఇన్నిన్ని పైరవీలా? ఇంత మోసమా? ఆ డబ్బు వస్తే అనారోగ్యంతో ఉన్న తన భార్యను బతికించుకోవాలని ఆ వృద్ధుడి తాపత్రయం. కానీ ఈ వ్యవస్థ వికృత రూపం అతనికేం తెలుసు? తిరిగి తిరిగి అరిగే అతని కాళ్లకేం తెలుసు?

… ‘సినిమాను తన భుజాల మీద మోశాడు’ అని నటుల గురించి రాస్తుంటారు. నిజంగా అటువంటి కథ ఉండి, దానికి తగ్గ నటుడు ఉంటే సినిమా తనంతతానుగా అతని భుజాలమీదకు చేరుతుంది. ఈ సినిమా అలాంటిదే! చారుహాసన్ లాంటి నటుడిలో ఇంత ప్రతిభ ఉందా అని ఆశ్చర్యపోయేంత అద్భుతంగా నటించి మెప్పించారు. అమాయకత్వం, ఆక్రోశం, నిస్సహాయత కలగలిసిన ఆ పాత్రను చూస్తే జాలి కలుగుతుంది. తన భార్య కాలికి గాయమై, ఆపరేషన్ చేసి దాన్ని తొలగించేందుకు డబ్బు లేక, ఒక మటన్ కొట్టు ముందు నిలిచి ‘నా భార్య కాలు నువ్వు తీసేస్తావా?’ అని ఆ వ్యాపారిని దీనంగా అడుగుతాడు. ఆ సన్నివేశం చూస్తే అయ్యో అనిపిస్తుంది.

… 1986 జాతీయ సినీ పురస్కారాల్లో ‘స్వాతిముత్యం’‌లో కమల్‌హాసన్‌ను కూడా దాటి, అవార్డు కమిటీ చారుహాసన్‌కి ఉత్తమ నటుడి పురస్కారం అందించారు. ఒక తమిళ నటుడు 56 ఏళ్ల వయసులో తనది కాని మరో భాషలో నటించి జాతీయ పురస్కారం అందుకోవడం అదే తొలిసారి కావొచ్చు. ఇలాంటి Performanceకి నిజంగా ఆస్కార్ ఇవ్వొచ్చు. Upcoming Actors తప్పకుండా ఈ సినిమా చూడాలి. కొంత బోర్ కొట్టేలా ఉన్నా ఓపికగా చూడండి. ముఖ్యంగా చారుహాసన్ గారి నటన కోసం. One of the Finest Performances in Indian Cinema. అటువంటి నటుల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం.

… సినిమా YouTubeలో English Subtitlesతో అందుబాటులో ఉంది….. విశీ… లింక్: https://youtu.be/WvnNpvgWScM

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions