యుద్ధమే కాదు… ఏ విపత్తు వచ్చినా ముందుగా బలయ్యేది స్త్రీలు, పిల్లలు… ప్రకృతి విపత్తు కావచ్చు, మనిషి సృష్టించిన విపత్తు కావచ్చు… ఆకలి, అత్యాచారం, పీడన, మరణం, వలస, భయం, కన్నీళ్లు, కడుపుకోత… స్త్రీకే ఎక్కువ కష్టం… ఇప్పుడు అప్ఘన్ మహిళ గడగడా వణికిపోతోంది… మళ్లీ మేం చీకటియుగంలోకి ప్రయాణించాల్సిందేనా..? ఇదీ భయం… ఇదీ వణుకు… తాలిబన్ల పాలన వచ్చేసినట్టే… అంటే అఫ్ఘన్‌ను ఆ పాతరాతి యుగంలోకి నడిపించబోతున్నట్టే… ఆల్ రెడీ అఫ్ఘన్ మహిళలకు కష్టాలు ప్రారంభమైన వార్తలు వచ్చేస్తున్నయ్… ప్రపంచం ఇకపై నిశ్శబ్దంగా… అవును, నిశ్శబ్దంగా ఓ పాశవిక పాలనను చూడబోతోంది… రాజకీయాలు, రాజ్యాల మధ్య ఆధిపత్య పోరాటాలు అంతిమంగా ఇదుగో, ఇలాంటి ఫలితాల్నే ఇస్తయ్… ఇస్తున్నయ్… ఇస్తూనే ఉంటయ్… మరి దీనికి పరిష్కారం..? ఇప్పట్లో కనిపించడం లేదు… కారణాలు బోలెడు… సగటు అప్ఘన్ ఆడపిల్లల భవిష్యత్తు ఏమిటో కాలమే చెప్పాలి…
ఎస్, అప్ఘన్‌లో తాలిబన్ల రాజ్యం రావడం ఇండియాకు ఖచ్చితంగా నష్టదాయకమే… అది మనకు మిత్రరాజ్యంగా ఉండటమే మనకు వ్యూహాత్మకంగా చాలా మేలు… అందుకే అక్కడ హిందూ, సిక్కు, బౌద్ధ సమూహాలపై ఎన్ని దాడులు జరుగుతున్నా… ఎంతమంది అక్కడ ఉండలేక వలస వచ్చేస్తున్నా… మనం ఆ దేశానికి స్నేహహస్తాన్నే అందించాం, వేల కోట్లను ఖర్చుచేశాం… అదంతా అఫ్ఘన్ గుట్టల్లో పారబోసినట్టే… మనం కట్టించి ఇచ్చిన నీటి ప్రాజెక్టును కూడా ధ్వంసం చేయబోతున్నారు తాలిబన్లు… అది వారి మానసిక ధోరణికి అద్దం పట్టే చర్య… బుద్ధ విగ్రహాలను ఎలా పేల్చేశారో అప్పట్లో చూశాం కదా… ఇప్పుడూ అంతే… అంతర్జాతీయ రాజకీయాల కోణంలో ఇండియాకు తాలిబన్ల ప్రాబల్యం దుశ్శకునమే… పాకిస్థాన్ అనే ఓ రౌడీ ఎలిమెంట్ బ్రోకరిజానికి తోడు రష్యా, అమెరికా, చైనా ఆడబోయే, ఆడుతున్న డర్టీ పొలిటికల్ గేమ్ ఇండియాకు చిక్కులు తెచ్చిపెట్టబోతోంది… ఎందుకంటే, ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఫస్ట్ టార్గెట్ ఇండియాయే కాబట్టి… తాలిబన్లు ఆ టెర్రరిజంలో ఆరితేరిన ఘటాలు కాబట్టి… అయితే… ఎలాగూ ఇండియాకు తప్పదు… పాకిస్థాన్, చైనాలతో నిత్యసమరమే కదా… దానికి ఓ కొత్త బెడద అదనం… కానీ ఇప్పుడు ప్రపంచం చూస్తున్నది సగటు అప్ఘన్ బాలిక వైపు… తాలిబన్ కోరలకు చిక్కబోయే యువతుల వైపు…
Ads
ఈడు వచ్చిన పిల్లలు, మొగుళ్లు మరణించిన వితంతువులు ఇప్పుడు టెర్రరిస్టులను పెళ్లి చేసుకోవాలట… 2001లో తాలిబాన్ల ప్రభుత్వం కూలిపోయిన తరువాత గత 20 ఏళ్లలో… అప్ఘన్ మహిళ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంది… చదువులు, కొలువుల్లో చేరారు… వ్యాపారాలు చేసుకున్నారు… ఓ పురుషాధిక్య వ్యవస్థే అయినా సరే, మతమౌఢ్యం పాలించే దేశాలతో పోలిస్తే సౌకర్యంగానే బతుకుతున్నారు… మరి ఇప్పుడు..? అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది… ఇప్పటికే భయంతో వేలాది మంది దేశం విడిచిపెట్టేశారు… అసలు పోలీసులు, ఆర్మీ జవాన్లే చెప్పాపెట్టకుండా పోతుంటే ఓ సగటు మహిళ పరిస్థితి ఏమిటి..? దాదాపు రెండున్నర లక్షల మంది దేశం విడిచిపెట్టగా అందులో 80 శాతం స్త్రీలు, పిల్లలేనట… తాలిబన్లు ఇప్పుడు ఏం చెబుతున్నా సరే, వాళ్లు నమ్మే, ఆచరణకు తీసుకురాబోయే ఇస్లామిక్ చట్టాల ప్రకారం…
- ఆడపిల్లలకు చదువు నిషిద్ధం…
- మోకాలు కనిపించే దుస్తులు నిషిద్ధం…
- తండ్రి, భర్త, సోదరుడు తోడులేకుండా బయటికి వస్తే కఠినశిక్షలు…
- హైహీల్స్, టైట్ జీన్స్ గట్రా నిషిద్ధం, సౌందర్యసాధనాలు నిషిద్ధం…
- రేడియో, టీవీ, పబ్లిక్ ప్రోగ్రామ్స్ నిషిద్ధం…
- సైకిళ్ల మీద తిరగడాలు బంద్…
- ఇళ్ల ముందు గానీ, బాల్కనీల్లో గానీ నిలబడటం నిషిద్ధం…
- చావుబతుకుల్లోనైనా సరే మగ డాక్టర్ల వద్దకు వెళ్లరాదు…
- పరపురుషులతో కలిస్తే, కలిసి కనిపిస్తే రాళ్లతో కొట్టి మరణశిక్ష…
- చివరకు గట్టిగా మాట్లాడినా నేరమే…
- ఏ భవనానికీ స్త్రీల పేరు ఉండకూడదు…
- ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడది ఒక ప్రాపర్టీ… నిజానికి ఆస్తి కూడా కాదు… ఈ స్థితిలో అంతర్జాతీయ సమాజం ఏం చేయబోతోంది..? దీనికి జవాబు ఏమీ లేదు… ఏమీ చేయబోదు కూడా… టర్కీ, సిరియాల్ని చూస్తూనే ఉన్నాం కదా…!!
Share this Article