ఓ సరదా వార్త… పలు భాషలకు చెందిన అగ్రనటుల్ని, నటీమణుల్ని, సాంకేతిక నిపుణుల్ని తీసుకొచ్చి కన్నప్ప అనే తన రాబోయే చిత్రం కోసం ఇన్వాల్వ్ చేస్తున్నాడు కదా మంచు విష్ణు… వందల కోట్ల వ్యయం… అత్యంత భారీగా, పాన్ ఇండియా స్థాయిలో (ఇంగ్లిష్ సహా) సమర్పించాలని ప్లాన్ కదా… ఆ కథలో ఇంతమందిని ఎలా, ఏ పాత్రలకు అకామిడేట్ చేస్తాడో పక్కన పెడితే…
ఇప్పటివరకు వినిపించే సమాచారాన్ని బట్టి ప్రీతి ముకుందన్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయకుమార్, మోహన్‌బాబు, శరత్‌కుమార్, శివరాజకుమార్… ఇలా అనేకమంది పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి… నయనతార కూడా ఉందని మరో టాక్… సరే, ఎవరెంత మంది ఈ ఫిలిమ్ కోసం వస్తారో కాసేపు వదిలేస్తే… ఓ ఐటమ్ సాంగ్‌లో తమన్నా నర్తించనుందని ఓ చిన్న వార్త చెబుతోంది…
ఆల్రెడీ న్యూజీలాండ్ దాకా వెళ్లి ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొచ్చారట కదా… మన అడవులు లేవా..? అక్కరకు రావా..? అనడక్కండి, మోహన్‌బాబుకు కాలుతుంది… సరే, ప్రభుదేవా డాన్సులట, మణిశర్మ సాంగులట… ఇక తమన్నా స్టెప్పులు, అవీ ఐటమ్ సాంగ్ అని చదవగానే… అదేదో మొన్న ఏదో సినిమాలో రజినీకాంత్ పక్కన పొట్టిపొట్టి బట్టలతో రా రా రావాలయ్యా అని విచిత్రమైన బాడీ లాంగ్వేజీతో స్టెప్పులు వేసింది కదా, ఆ పాట గుర్తొచ్చింది…
Ads
అప్పట్లో బాపు తీసిన భక్త కన్నప్ప గుర్తుంది కదా… కృష్ణంరాజు, వాణిశ్రీల సినిమా… సూపర్ హిట్… ఆ పాటలు నేటికీ నోళ్లలో నానుతూనే ఉంటాయి… అబ్బే, భక్తి సినిమాలో ఐటమ్ సాంగ్స్ ఏమిటండీ అని నొసలు చిట్లించకండి… నాటి భక్త కన్నప్పలో లేదా ఏం..? శివ శివ అననేలరా అంటూ జానకి పాడిన సినారె గీతం ఎంత సూపర్ హిట్టో కదా…
సాక్షాత్తూ పార్వతీపరమేశ్వరులనే నేల మీదకు దింపి సినిమా స్టెప్పులు వేయించిన ఘనత మనది… అంతెందుకు..? ఇదే మోహన్‌బాబు అన్నమయ్య సినిమాలో రోజాతో పాడుకున్న సరస శృంగార గీతం గుర్తుంది కదా… ఆ పని, మాపని, అస్మదీయ మగటిమి, తస్మదీయ తకథిమి అంటూ ఏదో అర్థం కాని పాట… ఏలే ఏలే మరదలా అంటూ నాగార్జున… శ్రీరామదాసులోనైతే స్నేహతో చాలు చాలు అనిపించేదాకా… సో, రాబోయే కన్నప్పలోనూ మరీ కుర్చీ మడతపెట్టి, ఊ అంటావా, రా రా రావాలయ్యా అంత పచ్చిపచ్చిగా గాకపోయినా శివశివ అననేలరా అనే టైపులోనైనా ఓ సాంగ్ పడాల్సిందేనన్నమాట…
ఆ పాట గుర్తుంది కదా… కౌగిలిలో కైలాసం, కొందరికి జన్మకో శివరాత్రి, ఈ సుందరికి ప్రతి రాత్రి నవరాత్రి, భక్తులకు బతుకు గడపగా గడపగా ముక్తి, మనబోటి రక్తులకు ఘడియ ఘడియకూ ముక్తి… అంటూ సాగుతుంది… సరే, ఆ కన్నప్ప కథకు పాన్ ఇండియా నగిషీలు చెక్కుతారు ఎలాగూ… కానీ భక్తి సినిమా అయినా, ముక్తి సినిమా అయినా… రక్తి లేకపోదు కదా… రక్తి లేక ముక్తీ లేదనుకునే బాపతు కదా మనం.., సో, తమన్నా ఎంపిక కరెక్టే… ఇక కుమ్మేయండి సార్…
Share this Article