- ఇప్పుడు ఎలాగూ చాన్స్ ఉంది కదా, పది రూపాయలో, వంద రూపాయలో… ఎంతొస్తే అంత… దీన్ని థియేటర్లలో కూడా విడుదల చేయాల్సింది… ఓ డిస్ట్రిబ్యూషన్ సిండికేట్ మెంబర్ తన సొంత కొడుకు, తన సొంత సినిమాను కేవలం ఓటీటీలో విడుదల చేయడం ఏమిటి..?
- నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ అయితే ఇంకా బెటర్ రీచ్ అయి ఉండేది… ఆ హాట్ స్టార్ రీచ్ చాలా తక్కువ కదా… ఈ కామన్ సెన్స్ ఎందుకు లోపించింది..? కేవలం తమకు దక్కిన డబ్బే ప్రధానం కాదు కదా… అదీ నితిన్ క్రమేపీ హీరోగా పడిపోతున్న దశలో…? కానీ నితిన్ థాంక్స్ చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? ఈ తెలుగు ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ మాఫియా ప్రభావంతో కేవలం ఆహా అనే ఓ దిక్కుమాలిన ఓటీటీలో విడుదల చేయకపోవడం… బతికిపోయాడు నితిన్…!!
- నిర్మాత, పేరెన్నికగన్న డిస్ట్రిబ్యూటరే, తన సొంత సినిమా, తన కొడుకు సినిమాను ఓటీటీకి పరిమితం చేయడం వేగంగా రాబోయే మార్పులకు సంకేతమా..? థియేటర్ల పని అయిపోయినట్లు భావించాల్సిందేనా..? ఫంక్షన్ హాళ్లు కావల్సిందేనా థియేటర్లు..? ఇదీ మాస్ట్రో అనే సినిమా గురించి ఆలోచిస్తున్నప్పుడు కలిగిన సందేహం…
అసలు ఇక్కడ చెప్పుకోవాల్సింది సినిమా నేపథ్యం…. నితిన్ ఎంత ప్రయత్నించినా ఓ మాస్, టాప్ స్టార్ కాలేకపోతున్నాడు… నిజమే, తనకు ఇతర అగ్రహీరోల్లాగా వంశకీర్తనలు, క్యాంపు భజనలు, స్వకుచ స్తుతులు సాధ్యం కావు… తనకేమో పెద్దగా ఎమోషన్స్ వర్కవుట్ కావు… ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా తన మొహంలో ఫీలింగ్స్ అచ్చం మన వారస హీరోల టైపే… అయితే నితిన్‌కు సంబంధించి మెచ్చుకోవాల్సింది ఒక అంశం ఉంది… తను ఇమేజీ, ఫార్ములా, సూపర్ హీరోయిజం అనే బందిఖానాల్లోకి పోలేదు… తనకు ఫిట్టయ్యే పాత్రల జోలికే పోతున్నాడు… దరిద్రపు సూపర్ మ్యాన్ హీరోయిజం ఛాయలకే వెళ్లడం లేదు… నిజంగా అభినందించాలి… తన లిమిటేషన్స్ తెలిసి దూరం ఉన్నాడో, బేసిగ్గా తన టేస్ట్, తన తత్వం అదో తెలియదు గానీ… డిఫరెంట్ పాత్రలకే ట్రై చేస్తున్నాడు… మాస్ట్రో సినిమా కూడా అంతే… ఓ గుడ్డి పాత్ర, పోనీ, గుడ్డివాడిగా నటించే పాత్ర, ఓ సస్పెన్స్… థ్రిల్లర్… మంచి క్రైమ్ స్టోరీ… దాని ఒరిజినల్ ఏమిటో, దేని ఆధారంగా అంధాదున్ హిందీ సినిమా తీశారో వదిలేద్దాం… అందులో పాత్రను నచ్చి, మెచ్చి చేయడానికి నితిన్ సాహసించడం బాగుంది… (ట్రెండ్ అర్థమైనట్టుంది…)
Ads
ఐనా… తెలుగు ఇండస్ట్రీలో క్రియేటివిటీ ఎక్కడుంది..? దరిద్రపు అనుకరణలు, కాపీలు లేకపోతే దిక్కుమాలిన పాత ఇమేజీ బిల్డింగ్, ఫార్ములా కథలు తప్పితే…. ఒక్కడికీ డొక్కశుద్ధి ఎక్కడుంది..? ఏవీ నూత్న ప్రయోగాలు..? ఏవీ సృజనాత్మక ప్రయత్నాలు..? సీరియస్ కామెంట్సే…. మీరు ఒకసారి పరిశీలించండి… పవన్ కల్యాణ్, వెంకటేష్, చిరంజీవి ఎట్సెట్రా ఎవరైనా సరే నమ్ముకున్నది రీమేకులే… ఏదో భాషలో హిట్ అయితే, ఆ కథను పట్టుకురావడం, వీళ్ల ఇమేజీకి తగినట్టుగా సూపర్ ఇంపోజ్ చేసి, ప్రేక్షకుల మీదకు వదిలేయడం… మరి నితిన్ కూడా అదే బాపతు అంటారా..? కాదు… కాస్త నయం… తిక్క తిక్క సుప్రీం హీరోయిజం, మానవాతీత హీరోయిజం జోలికి పోలేదు… అదీ సంతోషం… అయితే తనతో వచ్చిన చిక్కేమిటంటే..? కొన్ని తప్ప పెద్ద పెద్ద ఎమోషనల్ ఫీలింగ్స్ తనకు చేతకావు… మాస్ట్రోలోనూ అంతే… సరే, ఇక్కడ కట్ చేస్తే తమన్నా గురించి చెప్పుకోవాలి…
ఈ తెల్లతోలు పంజాబీ పిల్ల… మొదట్లో హాట్ హీరోయిన్… వాడేశారు, పక్కన పడేశారు… ఆఫ్టరాల్ ఇండస్ట్రీలో కరివేపాకుల కథలే ఎక్కువ కదా… జెమిని వాడి మాస్టర్ చెఫ్ అనే ఓ దిక్కుమాలిన షో ఒప్పుకుంది.,. మరేం చేయగలదు పాపం… కాకపోతే ఓ దరిద్రం ఉంది… సాయిపల్లవిలాగే తను కూడా సొంత డబ్బింగ్ చెప్పుకోవాలని… మాస్టర్ చెఫ్‌లో ఆ సొంత డబ్బింగ్ వెగటుగా ఉంది… ఆమెకు తెలుగు రాదు, పలకలేదు, వినేవాడికి వికారంగా ఉంటుంది… ఈ సినిమాలోనూ తనే చెప్పుకుంది… కానీ..? నటనపరంగా మరోసారి ఫీనిక్స్‌లాగా ఎగిసింది… తను అనుభవం మొత్తాన్ని రంగరించింది… అసలు సినిమాను డామినేట్ చేసిందే తను… సరిగ్గా వాడుకోవాలే గానీ తమన్నా తను తీసుకున్న ప్రతి పైసాకు న్యాయం చేయగలదు… కాకపోతే సొంత డబ్బింగ్ అనే వికారం లేకపోతే..!! ఇక ఈ సినిమాలో నభానటేష్ ఉంది… జస్ట్, ఉంది… ఉందంటే ఉంది… అంతే… మిగతావాళ్లందరూ సోసో… పాటలు బాగాలేవు, కాకపోతే దర్శకుడు ఎవరోగానీ సొంత ప్రయోగాల జోలికి పోలేదు, కోట్ల పెట్టుబడి కదా, ప్రయోగం ఎందుకు అనుకున్నాడేమో, లేదా నిర్మాతే హెచ్చరించాడో… మక్కీకిమక్కీ… మరి అలాంటప్పుడు డబ్బింగ్ చేస్తే సరిపోయేది కదా, నేటివైజ్ చేయనప్పుడు రీమేక్ దేనికి అనే అమాయకపు ప్రశ్న వేయకండి… తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఓ అజ్జానం… ఇంతకీ సినిమా చూడొచ్చంటారా భాయ్..? అంధాదున్ చూడకపోతే చూడండి, బాగుంటుంది… ఆల్‌రెడీ ఆ ఒరిజినల్ చూసేశారా..? ఈ సినిమా జోలికి వెళ్లాల్సిన అవసరమేమీ లేదు…!!
Share this Article