నుష్ మీద తమిళ నిర్మాతల మండలి ఆంక్షలు పెట్టింది… ఇకపై మండలి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గానీ మరో నిర్మాత తనతో సినిమా తీయకూడదు… ఇకపై ధనుష్‌కే కాదు, ఏ హీరోకూ, ఏ హీరోయిన్‌కూ ఎవరూ అడ్వాన్సులు ఇవ్వకూడదు… ఇప్పటికే అడ్వాన్సులు తీసుకున్నవాళ్లు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవరకు మరో కొత్త ప్రాజెక్టుకు సంతకం చేయకూడదు…
ఒక ప్రాజెక్టు పూర్తయ్యాకే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాలి… ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులకు పనిచేయడం కుదరదు… ఇవన్నీ బాగానే ఉన్నాయి… తమిళ నిర్మాతల్ని మెచ్చుకోవాలి ఒకరకంగా… మన తెలుగు పరిశ్రమ పూర్తిగా స్టార్ హీరోల కనుసన్నల్లో నడుస్తుంది… ఏ బడా నిర్మాత అయినా సరే హీరోల్ని ఒప్పందాల మేరకు నడుచుకోవాలని చెప్పగలడా..?
Ads
మనకూ నిర్మాత మండలి ఉంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఉన్నట్టుంది… ఒక్కసారి తమిళ ఇండస్ట్రీ తరహాలో రూల్స్ ఫ్రేమ్ చేయగలదా..? చెప్పినట్టు వినని నటీనటులకు ముకుతాళ్లు వేయగలదా..? నో… ఇష్టారాజ్యం అడ్వాన్సులు తీసుకుని, ఒక ప్రాజెక్టును పడుకోబెట్టి మరో ప్రాజెక్టుకు వర్క్, అదీ సగంలో ఆపి ఇంకో ప్రాజెక్టుకు సై… అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలు లబోదిబో…
హీరో డేట్స్ ఇస్తాడో లేదో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఆ దేవుడి రాకకు తగినట్టు ఇతర నటీనటుల డేట్స్ అడ్జస్టవుతాయో లేదో తెలియదు… పెట్టిన పెట్టుబడిపై వడ్డీలే కాదు, రోజువారీ ఖర్చులు కూడా తడిసిమోపెడు… ప్రాజెక్టు అనిశ్చితి… చాలాసార్లు ఇక్కడి నిర్మాతల మండలి కూడా ధాంధూం అంటుంది… రూల్స్ ఫ్రేమ్ చేస్తాం అంటుంది… బట్, ఊదు కాలదు, పీరు లేవదు…
మొన్నామధ్య పవన్ కల్యాణ్ ఎన్నికల అఫిడవిట్ చూస్తుంటే కోట్లాది రూపాయలు నిర్మాతల నుంచి తీసుకున్నట్టు కనిపించింది… కాకపోతే పర్సనల్ లోన్లుగా చూపించారు అందులో… ఆ సినిమాలకెప్పుడు కొబ్బరికాయలు కొట్టేది, ఎప్పుడు పూర్తయ్యేది… అసలు తను ఇప్పటి బిజీ షెడ్యూల్‌లో ఇంకా సినిమా షెడ్యూళ్లకు హాజరు కాగలడా..?
తనే కాదు, చాలామంది హీరోలు ఒకేసారి రెండుమూడు ప్రాజెక్టులకు అడ్వాన్సులు తీసేసుకుని, డేట్ల సర్దుబాటుకు నానారకాలుగా సతాయిస్తున్నారు నిర్మాతల్ని… ప్రభాస్ చేతిలో కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులున్నాయి ఇప్పుడు… ఒక్క మహేష్ బాబు మాత్రమే రాజమౌళి సినిమాకే డేట్సన్నీ ఇచ్చేసినట్టున్నాడు…
అసలే టాలీవుడ్ అంటేనే హీరోస్వామ్యం… చిన్నాచితకా హీరోలు సైతం యాటిట్యూడ్ చూపించే ఇండస్ట్రీ ఇది… నిర్మాతలు ఎంత పెద్దవాళ్లయినా సరే హీరోల జోలికి పోలేని దురవస్థ… పైగా హీరోలు నిర్దేశించినట్టే హీరోయిన్లు, కొరియోగ్రాఫర్లు, సంగీత దర్శకులు, గీత రచయితలు కావాలి… చివరకు కార్వాన్ల దగ్గర నుంచి టీలు అందించే బాయ్స్ ఎంపిక వరకూ వాళ్లు చెప్పిందే జరగాలి… ధనుష్ వంటి స్టార్ హీరో మీద సైతం అక్కడి ఇండస్ట్రీ ఆంక్షలు పెట్టిందంటే వాళ్లను మెచ్చుకోవాలి… ఇండస్ట్రీ మీద వాళ్ల గ్రిప్‌ను మెచ్చుకోవాలి… అదేసమయంలో తెలుగు ఇండస్ట్రీ దురవస్థను చూసి జాలిపడాలి…!
Share this Article