.
#తమిళం #పెరియార్ …. తమిళం అనేది అడవి మనుషుల (Barbaric) భాష.
నేను ఈ మాట అనగానే చాలామందికి నా మీద కోపం వచ్చింది. కానీ నేనెందుకు అలా అంటున్నానో ఎవరూ ఆలోచించడం లేదు. అలా ఆలోచించే తెలివి ఎవరికీ ఉన్నట్టు లేదు. తమిళం మూడు నుంచి నాలుగు వేల ఏళ్ల క్రితం ఏర్పడ్డ భాష అని తమిళులంతా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా! తమిళం అన్ని వేల ఏళ్ల నాటి భాష కాబట్టే, అదే కారణంతో అది అనాగరిక భాష అని నేను అంటున్నాను.
Ads
అనాగరికం అన్న పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఆ కాలంలో వాళ్లు ఎలా ఉన్నారో నీకు తెలుసా? ఎలా జీవించారో నీకేమైనా అవగాహన ఉందా? అవేమీ తెలియకుండా ఊరికే తమిళం గొప్పది గొప్పది అని అంటూ ఉంటావా? ఎవరూ తమిళ భాష కోసం, తమిళ జాతి అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదు…. – పెరియార్ రామస్వామి (‘తమిళుం.. తమిళరుం’ పుస్తకంలో…)
**
మూడు రోజుల క్రితం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చెప్పిన మాటలు…
‘నా మాతృభాష తమిళం. పెరియార్ అన్న ఈ మాటలు నేను మీకు చదివి వినిపించాను. ఆ మాటలు చెప్పడం నాకే చాలా బాధగా ఉంది. కానీ చెప్పాలి. తమిళ భాషను అడవి మనుషుల భాష, అనాగరిక భాష అని పెరియార్ అన్నారు. అలా అన్న ఆ మనిషి ఫొటోకు డీఎంకే పార్టీ నేతలు రోజూ దండలు వేస్తున్నారు. ఆయన గురించి గొప్పలు చెప్తున్నారు…
కానీ త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని అన్న కేంద్రాన్ని మాత్రం శత్రువుగా చూస్తున్నారు. ‘మీ నిరసన కార్యక్రమాలు అనాగరికంగా ఉన్నాయని’ అన్నందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి మాటల్ని వెనక్కి తీసుకునేదాకా పోట్లాడారు. కానీ తమిళాన్నే అనాగరిక భాష అన్న పెరియార్‌ని మాత్రం వీళ్లు నెత్తిన పెట్టుకున్నారు. ఇదా డీఎంకే తమిళనాడుకూ, తమిళ భాషకూ ఇచ్చే గౌరవం? ఇది వీళ్ల రెండు నాల్కల ధోరణికి చిహ్నం’…
***
PS : రాజుల ఆస్థానంలో, పండితుల నోళ్లలో ఉన్న తమిళాన్ని మాత్రమే పెరియార్ వ్యతిరేకించారని, దాన్ని మాత్రమే అనాగరికం అని అన్నారని పెరియార్ అనుచరుల మాట. ఇంకా ఆ పాత తమిళాన్ని పట్టుకొని జనం వేలాడుతున్నారన్న ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడారని వారి వాదన.
తమిళాన్ని జనానికి అందుబాటులోకి తేవాలని పెరియార్ చాలా కృషి చేశారు. ముఖ్యంగా తమిళ అక్షరాలు సులభంగా అందరికీ రావాలని ఆయన పత్రిక ద్వారా ప్రయత్నించారు. ప్రతి సభలో తమిళ పాటలు పాడాలని నిబంధన పెట్టారు. ఇదంతా తెలియక, ఓ నాలుగైదు లైన్లు పట్టుకొని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మాట్లాడారని డీఎంకే నేతలు అంటున్నారు….. అనువాదం: విశీ (వి.సాయివంశీ)
Share this Article