Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వాడు మనపై హిందీ రుద్దును… వీడు అదేపనిగా అరవం రుద్దును… మనకే దద్దులు…

October 12, 2024 by M S R

ఏయ్! ఎవర్రా అక్కడ!
వేట్టయన్ తెలుగు కాదన్నది?
దుడ్డు కర్ర అందుకోండి!

భీమయ్య:-
ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

రామయ్య:-
ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా.

Ads

భీమయ్య:-
ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి!

రామయ్య:-
…అంటే అవి అరవ పైకప్పులు కదా! తెలుగు ఇనుప రేకులు, సిమెంట్ రేకులు, పెంకులు, రెల్లు గడ్డి, బోద, మట్టి, ఆర్ సి సి స్లాబులు…ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా! ఇవన్నీ కాదని ఆ అరవ వేట్టయన్ పైకప్పులే వేయాలంటావా?

భీమయ్య:-
ఎంత మాటన్నావు రామయ్యా! తెలుగు ఎంత అరచి గీ పెట్టినా అరవంతో సమానమవుతుందా చెప్పు! అరవం అరవం అని వాళ్లు లొడ లొడ అరుస్తున్నా…ఎంత వీనులవిందుగా ఉంటుందో తెలుసా?

రామయ్య:-
ఏమో! నావరకు తెలుగు పెన్నా సిమెంట్, విశాఖా పైకప్పులు, మంజీరా మట్టి పైపులు అంటే ఎంత అందంగా ఉంటుంది చెప్పు!

భీమయ్య:-
పిచ్చి రామయ్యా! తెలుగు పుట్టిందే తమిళం నుండి అట. మనల్ను మద్రాసీలు అనే అనేవారుగా ఇదివరకు. తెలుగులో తెగులు ఉంది. తమిళంలో మిళమిళ తళతళ ఉందిట…

రామయ్య:-
తమిళం పేరు వేట్టయన్ తెలుగులోకి వస్తే తమిళంలోనే ఉండడం తప్పు కానప్పుడు…తెలుగు వేటగాడు; అందగాడు; మొరటోడు నా మొగుడు; ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటివి తమిళులు అలాగే ఎందుకు పెట్టుకోకూడదు?

భీమయ్య:-
అంటే తమిళులకు భాషాభిమానం ఎక్కువ. చాలా పట్టింపు. ఒప్పుకోరు.

రామయ్య:-
అప్పుడు నేనూ ఒప్పుకోను.

భీమయ్య:-
బోడి నీ ఒప్పుకోలుతో మాకేమి పని. మా తెలుగు నిర్మాతలు చూడు. తమిళ వేట్టయన్ ను తెలుగు ప్రేక్షకులు తమిళ వేట్టయన్ గానే ఎందుకు చూడాలో వివరణాత్మక జ్ఞానబోధ చేస్తున్నారు. అత్యంత మేధస్సు కదా… చెప్పువాడికి వినువాడు లోకువ… తీయువాడికి చూసెడివాడు లోకువ…

రామయ్య:-
తెలుగువారికి స్వభాషాభిమానం లేదన్న ధైర్యమది.

భీమయ్య:-
ఉంటే మాత్రం ఏమి చేస్తారు? ఉంటే అనడానికి ఉల్టే అన్నప్పుడే ఏమీ చేయలేదు. ఇప్పుడు వేట్టయన్ తమిళ కత్తి తెలుగు ప్రేక్షకులను వేటాడుతుంటే నోరుమూసుకోక… నోరు చేసుకోగలరా? అంత ధైర్యముందా?

రామయ్య:-
ఏమి చేస్తారేమిటి?

భీమయ్య:-
వేట్టయన్ తెలుగు కాదు… తమిళం అన్నవారందరినీ చెట్టుకు కట్టేసి కొడతాం. తెలుగు పేరు పెట్టాలన్నవారందరిని ప్రాంతీయ భాషా విద్వేషాలు, వైషమ్యాలు, వైరుధ్యాలు, వైమనస్యాలు రెచ్చగొడుతున్నారని కేసులు పెట్టి బొక్కలోకి తోసి మక్కెలిరగదంతాం. అవసరమైతే దేశద్రోహం, భాషాద్రోహం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అంతు చూస్తాం!

రామయ్య:-
భీమయ్యా! నిజం చెప్పు. నేను తప్ప భూప్రపంచంలో ఉన్న పదిహేను కోట్లమంది తెలుగువాళ్లల్లో ఒక్కరన్నా తెలుగు సినిమాకు వేట్టయన్ అన్న తమిళ పేరు పెట్టడం తెలుగుభాషను, తెలుగువారిని ఘోరంగా అవమానించినట్లు అని నిరసన తెలిపారా? తెలుగు నిర్మాతలే తెలుగుకు తీరని ద్రోహం చేస్తున్నారని నిలదీశారా? చెప్పు.

భీమయ్య:-
నిజమే రామయ్యా! అందుకే నీ నోరు మూయించడానికి తమిళ వకాల్తా తీసుకున్న తెలుగు నిర్మాతల తరపున వకాల్తా తీసుకుని నేనొచ్చాను. నువ్ ఇక ఈ విషయం మీద నోరు తెరిచావో! నా చేతిలో చచ్చావే!

రామయ్య:-
తెలుగువారికి తెలుగుమీద ప్రేమ ఎప్పుడో చచ్చింది. ఏ మూలో మాతృభాష మీద ప్రేమ మిగిలి ఉన్నవారిని చావగొట్టి చెవులు మూయడానికి నీలాంటివారు ఉండనే ఉన్నారు.

భీమయ్య:-
వరుసగా తెలుగులో రానున్న గొప్ప గొప్ప సినిమాల్లో కొన్ని ఇవి. ముందే టికెట్ బుక్ చేసుకో!
# మూన్డ్రామ్ పిరై
# వాళక్కు ఎన్న
# విసరానై
# తవమే తవమిరుందు
# కాదలుక్కు మరియాదై
# సూదు కవ్వం
# అలై పాయుత్తే

రామయ్య కరెంటు షాక్ తగిలిన కాకిలా నోట్లో తెలుగు నురగలు కక్కుకుంటూ తెలుగు కళ్లు తేలేశాడు!
భీమయ్య తమిళకళ్లు చల్లబడ్డాయి!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!
  • ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
  • బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
  • సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…
  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions