తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొంది, భరించింది… బీఆర్ఎస్ తన పట్ల నీచంగానే వ్యవహరించింది… ఒక మహిళ అనే భావన లేదు, ఒక గవర్నర్ అనే గౌరవమూ లేదు… ప్రోటోకాల్ విషయంలోనే కాదు, చిల్లర వ్యాఖ్యలు కూడా చేశారు పలువురు బీఆర్ఎస్ నాయకులు… కేసీయార్ ఈ తీరును ఎప్పుడూ సమర్థించుకోలేడు…
ఆమె దురదృష్టం ఏమిటో గానీ… చివరకు ఆమె సొంత పార్టీ నెంబర్ టూ నాయకుడు అమిత్ షా కూడా ఆమెను బహిరంగంగా మందలించి ఆమెను మరోసారి అవమానించాడు… అవును, అవమానించడమే అది… ఏపీలో కూటమి ప్రమాణస్వీకారానికి మోడీ, అమిత్ షా, వెంకయ్యనాయుడు తదితరులు తరలివచ్చారు… అక్కడికి తమిళిసై కూడా వచ్చింది…
వేదికపై వెంకయ్యకు, అమిత్ షాకు దండం పెట్టి, అంటే అభివాదం చేసి వెళ్తుంటే, అమిత్ షా వెనక్కి రమ్మని మరీ, చూపుడు వేలు చూపిస్తూ ఏదో మందలిస్తున్న సీన్ అందరూ చూశారు… ఆమె ఏదో చెప్పబోతుంటే కూడా సీరియస్‌గా చూస్తూ మందలింపు ధోరణిలో మాట్లాడినట్టు వీడియోలో కనిపిస్తోంది… సరే, ఆయన అధ్యక్షుడు కాని అధ్యక్షుడు బీజేపీకి… పైగా హోం మంత్రి, ఆమె గతంలో గవర్నర్…
Ads
ఆమెకు ఏదైనా సీరియస్ నోట్‌లో చెప్పాలంటే, ఇది కాదు కదా సందర్భం..? ఫోన్ చేసి, లేదా ఢిల్లీకి పిలిపించుకుని మరీ చెప్పాల్సింది… కానీ అన్ని వేల మంది ఎదుట అదేం మందలింపు..? అమిత్ షా ధోరణి అభ్యంతరకరమే… మర్యాదగా లేదు… ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో కూడా… ఎందుకు వైరల్ అయ్యిందో కూడా కారణం ఉంది…
ఆమె చాలా ఏళ్లు బీజేపీకి తమిళనాడు శాఖ అధ్యక్షురాలిగా ఉంది… కొన్నాళ్లుగా అన్నామలై అధ్యక్షుడు… కాస్త దూకుడు ఎక్కువ… ఈ క్రమంలో తమిళిసై వర్గానికీ అన్నామలై వర్గానికీ నడుమ దూరం ఉంది… నేనున్నప్పుడు పార్టీలోకి అసాంఘిక శక్తుల్ని రానివ్వలేదనీ, ఇప్పుడు వచ్చేస్తున్నారని తమిళిసై ఆరోపించింది… పైగా ఎఐడీఎంకేతో పొత్తు చెడిపోవడానికి కూడా అన్నామలై కారణమనే విమర్శలు బీజేపీలోనే ఓ సెక్షన్ నుంచి వస్తున్నాయి…
మరోవైపు తమిళిసై మీద అన్నామలై అభిమాన సోషల్ మీడియా సెక్షన్ విమర్శలు చేస్తోంది… తమిళనాడు ఎన్నికల్ని డీఎంకే, కాంగ్రెస్ కూటమి స్వీప్ చేసింది… చివరకు తమిళిసై, అన్నామలై కూడా ఓడిపోయారు… సో, అమిత్ షా తమిళిసై- అన్నామలై వివాదం నేపథ్యంలో మందలించి ఉంటారనేది సమాచారం… కానీ ఆ పని చేస్తే పార్టీ జాతీయ అధ్యక్షుడు చేయాలి, అదీ నాలుగు గోడల నడుమ జరగాలి… కానీ ఇదేమిటి..?
ఈ వీడియోను అన్నామలై సెక్షన్ కూడా వైరల్ చేసింది… కాస్త వెటకారం జోడించి మరీ… చివరకు డీఎంకే కూడా దీన్ని వాడుకుంది… ఇలా బహిరంగంగా ఆమెను మందలించడం సరైన ధోరణి కాదు అంటూ..! మరీ కొందరైతే ఒక నిర్మలా సీతారామన్, ఒక జైశంకర్‌ను అమిత్ షా ఇలా మందలించగలడా..? తమిళిసై తమిళ్ కాబట్టి ఇలా వివక్ష చూపించాడు అని ఎవరో డీఎంకే నేత ఏదో కూశాడు… నిర్మలా సీతారామన్ తమిళ్ కాదా..?
అబ్బే, ఇదంతా తప్పు ప్రచారం, అమిత్ షా నన్ను పోస్ట్‌పోల్ వర్క్, ఫాలోఅప్ గురించి అడిగారు, నేను చెప్పాను, నియోజకవర్గంపై కాన్సంట్రేట్ చేయాలని సూచించారు అని తమిళిసై ఏదో తాజాగా స్పందించింది గానీ… ఆ వీడియో చూస్తే అలా ఏమీ లేదు… ఏదో కవర్ చేస్తోంది ఆమె… ఐనా క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది అమిత్ షా, నువ్వు కాదు కదా తల్లీ… కానీ ఒక్కటి మాత్రం నిజం… అమిత్ షా కనబరిచిన ఇలాంటి పెత్తందారీ ధోరణిని తమిళనాడు మాత్రమే కాదు, దక్షిణ భారతదేశం అస్సలు సమర్థించదు… మహిళల్ని గౌరవించడం కేసీయారే కాదు, అమిత్ షా కూడా నేర్చుకోవాలి…!!
Share this Article