.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను హిట్ చేసిన తీరు చూసి… తెలుగు ప్రేక్షకులింతే, ఎడ్డిమారాజులు, ఏం తీసినా ఆదరిస్తారు, వందల కోట్లు కట్టబెడతారు అనుకుంటే పొరపాటు… అదే, అదే, తమ్ముడు చెప్పాడు… అదే కన్నప్ప చెప్పాడు…
పాన్ ఇండియా అంటే బహుభాషా నటుల్ని భారీగా తీసుకొచ్చి నింపడం కాదు, కథలో వాళ్లెవరికీ ప్రాధాన్యం ఉండదురా బాబూ అంటే విన్నారా..? కథనే అటూ ఇటూ తిప్పేసి, మర్లేసి, బోర్లేసి ఏదో చేశారు… చివరకు అది కాస్తా కన్నప్ప కథ గాకుండా ఏదో కేజీఎఫ్, బాహుబలి మార్క్ కథ అయిపోయింది…
Ads
పోనీ, అందులో భక్తి ఉందా..? ప్రీతి ముకుందన్ బట్టల కరువును కరువుతీరా చూపించాడు మంచు విష్ణు… అదేమంటే రక్తి లేనిదే భక్తి లేదుగా అంటాడు… వెరసి అదొక రక్తి సినిమా, అదొక ఫార్ములా సినిమా, అదొక మంచు మార్క్ సినిమా అనుకుని చాలామంది థియేటర్లకు దూరదూరంగా భయంగా మెదిలారు…
ఏదో ప్రభాస్ పుణ్యమాని ఓపెనింగ్స్ వచ్చాయి లేకపోతే అత్యంత భారీ పెద్ద తీవ్ర డిజాస్టర్‌గా మిగిలేది… అఫ్‌కోర్స్, ఇప్పుడేమైనా ఉద్దరించబడిందా అంటే అదీ లేదు… ప్రభాస్ ఎంట్రీ, విష్ణు చివరి అరగంట నటన, క్లైమాక్స్ ఎంత బాగున్నా సినిమా చీదేసింది… ఎంత అంటే..?
ఇతర భాషల్లో నటుల్ని తెచ్చి పెట్టుకుంటే అది పాన్ ఇండియా కాబోదు విష్ణు బాబ్బాబూ, కేజీఎఫ్, బాహుబలి, కాంతార, చార్లి, పుష్ప, కార్తికేయ ఎట్సెట్రా సినిమాలు సొంత నటీనటులతో మంచి స్క్రీన్‌ప్లే, మంచి కథతో, మంచి ట్రీట్‌మెంట్‌తో రక్తికట్టించారు… అందుకే హిట్టు, వందల కోట్లు అని చెప్పుకున్నాం కదా…
అదే జరిగింది… సినిమా రిలీజైన 12 రోజుల తరువాత కూడా 40 కోట్ల నెట్ దాటలేదు… వెరసి, విష్ణు నష్టాల లెక్కలు తేల్చాలంటే కూడా మరింత ఖర్చు గ్యారంటీ… ఫాఫం… ఎహె, మరీ అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులేమిటి..? ఆ ప్రీతిముకుందన్ వెగటు డ్రెస్సులేమిటి..?
అసలు అదే కాదు.,.. నితిన్ తమ్ముడు సినిమా మరీ డిజాస్టరెస్ట్… దిల్ రాజు మొహం మాడిపోయింది… నేను తెలుగు ఇండస్ట్రీలోనే తోపును, తురుమును, సినిమాను అంచనా వేయగలను అనుకునేవాడు కదా… పగిలిపోయింది… అసలు గేమ్ చేంజర్ కాదు, ఈ సినిమా వసూళ్లను చూసి ఏడవాలి తను… ఎంతటివాడినైనా నేలకరిపించే ఇండస్ట్రీ ఇది…
అన్నట్టు తమ్ముడు వసూళ్లు ఎంతో చెప్పడానికి సాక్‌నిల్క్‌కు కూడా చేతకావడం లేదు ఫాఫం… అంత దారుణం… నేనిక సినిమాలు చాలిస్తే బెటర్ అని నితిన్ వైరాగ్యంతో కాడికింద పడేసేంతలా… ఎన్నేళ్లయింది ఈ హీరో హిట్ సినిమా చూసి… అసలు ఈ మీడియం రేంజ్ హీరోల పైత్యాలే తెలుగు ఇండస్ట్రీని పాతాళానికి తొక్కుతున్నాయి అని కదా మనం మొన్న ఓ కథనంలో చెప్పుకుంది… ఐనా ఈ నిర్మాతలూ మారరు, ఈ బయ్యర్లూ మారరు… అనుభవించండి…!!
Share this Article