.
సీనియర్ జర్నలిస్టు బుద్ధా మురళి ఏమంటాడంటే..?
‘‘హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ వచ్చాము అన్నట్టుగానే… అమెరికా అభివృద్ధి కోసం వచ్చాము అంటే అక్కడ కుదరదు … అక్కడ ఉపాధి అవకాశాల కోసం వెళతారు తప్ప ఆ దేశాన్ని బాగు చేయడానికి కాదు …
Ads
అభిమాన హీరో సినిమా ప్రదర్శించే హాలులో వెర్రి వేషాలు వేస్తే ఇక కుదరదు …. చదువు , ఉద్యోగం దేని కోసం వెళ్లారో బుద్దిగా దానిపై దృష్టి పెట్టండి … మీరు అమెరికా వెళ్ళింది అమెరికాను బాగు చేయడానికి కాదు … మీ బతుకు ఎలా బాగు చేసుకోవాలా అని … మెజారిటీ తెలుగు వాళ్ళు తమ లక్ష్యం మీద దృష్టి పెడతారు … ఓవర్ యాక్షన్ బృందం కొద్ది మందే, ప్రమాదం వారికే … ప్రమాదం వారి నుంచే ….’’
…. నిజమే, షాపుల్లో నుంచి సరుకులు కొట్టేయడాలు, థియేటర్లలో సీట్ల చించివేతలు, విధ్వంసాలు, భారీ కార్ల కాన్వాయ్‌ల్లో తిరుగుతూ బజార్లలో పిచ్చి కేకలు, నినాాదాలు, దరిద్రపు ఫ్యానిజం, కులసంఘాలు, ఆ పైత్యంతో గొడవలు… మనవాళ్లకు ఎక్కడికి పోయినా మనదైన ‘తెలుగు సంస్కృతి’ని వెంట తీసుకుపోతారు… ఆ పెంట వాసన లేకుండా బతకలేరు కదా…
ఇదే ఓ మిత్రుడితో అంటుంటే… మరి వాడు మనల్ని తరుముతున్నాడు అని ఏడిస్తే ఎలా సార్, వాడి దేశం వాడికి ముఖ్యం అన్నాడు… కొందరితో అందరికీ ప్రమాదం అంటూ తాజాగా ఆంధ్రప్రభలో వచ్చిన క్లిప్పింగ్ షేర్ చేశాడు… అదే ఇది…
ఇక్కడ చదవడం కష్టమైతే నేరుగా ఆ పత్రిక వెబ్‌సైట్‌లో చదవొచ్చు… విషయం ఏమిటంటే..? మన తెలుగోళ్లు భారీ స్కామ్‌కు పాల్పడ్డారుట… తానాతో కలిసి… మళ్లీ చదవండి, దశాబ్దాలుగా అక్కడి తెలుగువాళ్ల కోసం పనిచేస్తున్న ట్రాక్ రికార్డ్ ఉన్న తానాతో కలిసి దుర్వినియోగం అట…
ఫ్యానీ మే సంస్థ ఈ కారణంగా 700 మందిని తొలగిస్తే మనవాళ్లు అందులో 200 మంది… ఇదే తరహా ఆరోపణలతో జనవరిలో 100 మందికి పైగా ఉద్యోగులను యాపిల్ తొలగించింది… తొలగించబడిన వాళ్లలో ఒకరు తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ అట… మరొకరు అటా మాజీ ప్రెసిడెంట్ భార్య అట…
ఇంకా తవ్వితే ఎందరు ప్రముఖుల పేర్లు బయటికొస్తాయో… ఆ స్కామ్ పూర్వాపరాలు, వివరాల్లోకి వెళ్లడం లేదిక్కడ… పదే పదే ట్రంపు తరిమేస్తున్నాడు అని మొత్తుకోకండి… ఉన్నారు, నిజాయితీగా వ్యవహరించేవాళ్లే మెజారిటీ… కానీ ఈ కొద్దిమంది స్కామర్లతో అందరికీ ముప్పు… ఇండియన్స్ అంటే నమ్మలేని స్థితికి తీసుకుపోతున్నారు వీళ్లు…
గతంలో పెద్ద పెద్ద రిటెయిల్ షాపుల్లో ఎగ్జిట్ పాయింట్ల వద్ద సరుకులు, బిల్లులతో సరిచూసేవాళ్లు కాదు… ఎవరూ మోసం చేయరు అనే నమ్మకం… కానీ కొన్నాళ్లుగా ప్రతి పెద్ద రిటెయిల్ షాపులో ఈ చెకింగ్ సిస్టం పెట్టేశారు… మనవాళ్లు బోలెడు మందిపై షాప్ లిఫ్టింగ్ కేసులు పడ్డాయి… కొందరైతే మూడేసి, నాలుగేసి జాబ్స్ చేస్తున్నారు అనధికారికంగా…
రోమ్‌లో రోమన్‌లాగా ఉండాలి… కానీ మనవాళ్లు అలా ఉండరు, అలా మారరు కదా… అమెరికా వెళ్లినా తెలుగువాడిలాగే ఉంటాడు… అనేకానేక ప్రకోపాలతోసహా… చివుక్కుమనిపించేదే అయినా వాస్తవ వ్యాఖ్య ఇది… అంగారక గ్రహానికి తీసుకెళ్లి, అక్కడ ఆధునిక కాలనీలో ఉంచినా సరే… ‘తెలుగువాడు’ మారడు… మారడు…
Share this Article