.
. ( రమణ కొంటికర్ల ) .. …. పిట్ట కొంచెమే కానీ… కూతా, చేతా రెండూ ఘనమే. అందుకే తన్మయ్ బక్షి పేరు ఇప్పుడు టెక్ రంగంలో ఓ సంచలనం.
ఎవరీ తన్మయ్ బక్షి..?
Ads
కెనడాలో సెటిలైన భారత సంతతి బిడ్డడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ లో తోపు. ఇప్పుడు విద్యా, ఆరోగ్య రంగాల్లో ఏఐతో అద్భుతాలు సృష్టించేందుకు బాల్యం నుంచే తనవంతు ప్రయత్నాలు చేసి వండర్ కిడ్ అనిపించుకున్న యువకుడు తన్మయ్ బక్షి.
అయితే, ఆమధ్య తన్మయ్ బక్షి ప్రతిభను మరింత అతిశయోక్తి చేసి మరో ఫేక్ ప్రచారం కూడా ఊపందుకుంది. దాన్ని ఏకంగా తన్మయే తన X (ట్విట్టర్ ఖాతా) ద్వారా ఖండించాడు. జస్ట్ 13 ఏళ్లకే గూగుల్ వంటి సంస్థ.. నెలకు 66 లక్షల జీతాన్నిచ్చి అపాయింట్ చేసుకున్న పంజాబీ పోరడన్నదే ఆ ఫేక్ ప్రచారం ఇప్పుడు మళ్లీ మొదలైంది.
మోబైల్ ఫోన్స్ లో రీల్స్, షార్ట్స్ కు అలవాటు పడి గంటలకు గంటలు గడుపుతున్న యువతను చూస్తున్న రోజుల్లో.. తన్మయ్ నిజంగానే ఏ యూనివర్సిటీలు కూడా తయారుచేయలేని ఓ గాడ్ గిఫ్ట్. కానీ, అదే సమయంలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే ఖండించిన నిజాయితీ కూడా ఈ బాలుడి సొంతం.
తన్మయ్ కి సాంకేతికరంగంపై ఎందుకంత అనురక్తి..?
తండ్రి పునీత్ బక్షి ప్రభావం తన్మయ్ పై మెండు. దానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐదేళ్లకే కోడింగ్ నేర్చుకున్న తన్మయ్.. ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకునే ఓ టెక్నికల్ గడుగ్గాయి!
పునీత్ బక్షి కంప్యూటర్ ప్రోగ్రామర్. తండ్రి ప్రోగ్రామింగ్ చూసి తానూ అనుసరించడం మొదలెట్టాడు. అది గ్రహించిన తండ్రి పునీత్.. తన్మయ్ ఆసక్తికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ లో శిక్షణనిప్పించాడు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో సాఫ్ట్వేర్ డెవలప్ మెంటే కాదు.. అసలు కంప్యూటర్ వెనుకాల ఏం జరుగుతుంది.. అసలు కంప్యూటర్ నే ఎలా నియంత్రించొచ్చు అనే బియాండ్ థాట్స్ చిన్నతనంలోనే తన్మయ్ ని వెంటాడాయి.
కేవలం ఏడేళ్లకే కోడింగ్ ట్యుటోరియల్స్, వెబ్ డెవలప్మెంట్ చిట్కాలను షేర్ చేసేందుకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. కోడింగ్ నేర్చుకోవాలనుకునేవారికి శిక్షణనివ్వాలనేది తన్మయ్ తపన. ఏకంగా లక్షమంది సబ్ స్క్రైబర్స్ కు పెరిగింది యూట్యూబ్ ఛానల్.
యూట్యూబ్ ఛానల్ లో కామెంట్ బాక్సులో ఎవరే ప్రశ్నడిగినా.. దానికి సంతృప్తికర సమాధానాలిచ్చేవాడు. తొమ్మిదేళ్ల వయస్సులో ఏకంగా ఓ యాప్ తయారుచేశాడు. గుణకారాలను బోధించే ఆ యాప్ కు యాపిల్ స్టోర్ లోనూ అనుమతి లభించింది. ఇప్పుడు తన్మయ్ యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్స్ 3 లక్షల 28 వేలు. టెడ్ టాక్ షోలో తన్మయ్ ప్రసంగం టెక్ రంగ నిపుణులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
ఏఐతో ప్రయాణం!
ప్రోగ్రామింగ్ లో అప్పటికే నైపుణ్యాన్ని సాధిస్తున్న తన్మయ్ ఓసారి తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో అప్లోడ్ చేస్తున్న సమయంలో ప్రశ్నకు సమాధానం చెప్పే యంత్రానికి సంబంధించిన ఐబీఎం వాట్సన్ కు సంబంధించిన ఓ డాక్యుమెంటరీని చూశాడు. ఇక అక్కడ సరిగ్గా 11 ఏళ్ల వయస్సులో తన్మయ్ జీవితం మరో అద్భుతమైన మలుపు తిరిగింది.
ఇక అక్కడ్నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఐబీఎం వాట్సన్ పై ఫోకస్ చేశాడు. అదే పద్ధతిలో సరిగ్గా వారం తిరిగేసరికి ‘ఆస్క్ తన్మయ్’ అనే కొత్త వాట్సన్ యాప్ ని తయారుచేశాడు బక్షి. వినియోగదారుల డౌట్స్ కు వేగవంతంగా ప్రతిస్పందించి సమాధానాలిచ్చే యాప్ అది.
వెనువెంటనే ఒక ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్ ను మరో ఫార్మాట్ లోకి మార్చే ఐబీఎం కన్వర్టర్ పైన దృష్టి పెట్టిన తన్మయ్… ఆ సాఫ్ట్వేర్ లో బగ్ ఉన్న విషయాన్ని కనిపెట్టాడు. దాన్ని ఐబీఎం సంస్థకు చెందిన ప్రోగ్రామింగ్ వెబ్ సైట్ ద్వారా వారికి సమాచారమివ్వడంతో పాటు… తన X (ట్విట్టర్) ఖాతా ద్వారా షేర్ చేశాడు.
అదిగో అక్కడ ఐబీఎం డెవలపర్స్ దృష్టి తన్మయ్ పై పడింది. అలా ఐబీఎంతో తన్మయ్ బంధానికి నాంది పడింది. కానీ, అంత చిన్న వయస్సులో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ అర్థం చేసుకోవడం అంత సులువైన పనేం కాదు. కానీ, అవి చేశాడు కాబట్టే తన్మయ్ సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అలా ఐబీఎం తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఒక వేదికైంది.
మెషిన్ లెర్నింగ్ ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా అధిగమించాలన్న తపనతో తన్మయ్ సాంకేతిక జర్నీ మరింత రాటుదేలుతూ ప్రారంభమైంది. అలా ఐబీఎంతో కలిసి ఫిన్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ తన్మయ్ సెషన్లు నిర్వహించి టెక్ రంగ ప్రముఖులతో ఔరా అనిపించుకున్నాడు.
తన్మయ్ బక్షి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పసివయస్సులోనే ఓ విద్యావేత్త పాత్రను పోషిస్తున్నాడు. కోడింగ్ లో యువతను ప్రోత్సహించే విధంగా తన వీడియోస్ ఉండటంతో పాటు.. భారతీయ సమాజ విలువలు, విద్యను కూడా ప్రతిబింబించేలా రూపొందించడంతో తనకంటూ ఒక యునిక్ నెస్ ను సాధించాడు తన్మయ్.
ఏ విజన్ ఫర్ ది ఫ్యూచర్!
తన్మయ్ బక్షి సాంకేతిక రంగ ప్రయాణం కేవలం తన వ్యక్తిగత ప్రదర్శనకు మాత్రమే పరిమితం కావాలనుకోలేదు. టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తను ప్రయత్నిస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎవరో కొందరు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారి వరకు మాత్రమే పరిమితం కాకూడదన్నది బక్షి ఆలోచన.
సమాజాన్ని ఉద్ధరించే ఓ శక్తిగా ఉపయోగపడాలన్నది తన్మయ్ బలమైన సంకల్పం. అందుకే ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అవసరాన్ని గుర్తించి.. ఇప్పుడా దిశగా ప్రయత్నాలు మొదలెట్టాడు తన్మయ్. ఏఐ ద్వారా ఈ రెండు ప్రధాన రంగాల్లో అట్టడుగువారికి కూడా ఎలా సేవలందించగలమనే ఒక శోధనకు ఇప్పుడు తన్మయ్ నాంది పలికాడు.
తన సాంకేతిక విజయాలను ప్రజల ముందుంచేందుకు “హలో స్విఫ్ట్: iOS యాప్ ప్రోగ్రామింగ్ ఫర్ కిడ్స్ అండ్ అదర్ బిగినర్స్” అనే పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాడు.
గూగుల్ లో ఇంటర్వ్యూ ప్యానెల్ లో ముగ్గురు కలిసి ఇంటర్వ్యూ చేద్దామనుకుంటే.. వారికే చెమటలు పట్టించేసిన 13 ఏళ్ల బుడతడు… గూగుల్ లో 66 లక్షల ఉద్యోగంతో మరోసారి వార్తల్లో పిడుగయ్యాడంటూ జరుగుతున్న ఈ ప్రచారాన్నే తన్మయ్ గతంలోనే కొట్టిపారేశాడు.
తన్మయ్ ఎదుగుదల వెనుక తన తల్లిదండ్రుల పూర్తి మద్దతుతో పాటు.. కెనడా భారతీయ సమాజ పాత్ర కూడా కీలకమైంది. తన్మయ్ ప్రతిభకు మెచ్చిన తన చుట్టుపక్కల సొసైటీ తనను అంతే స్థాయిలో ప్రోత్సహించింది.
తన్మయ్ ఇప్పుడు తన తోటివారికే కాదు… వయస్సు గురించి లెక్కలు వేసుకుంటూ పొద్దుగడిపే వారెందరికో ఓ రోల్ మాడల్…
Share this Article