.
నిజానికి వర్తమాన ట్రెండీ థంబ్ నెయిల్ జర్నలిజంలో ఈ వార్తకు పెట్టాల్సిన హెడింగ్స్… ‘‘దేవుడిని నమ్మని రాజమౌళి వారణాసిలో క్షుద్ర దేవతల ఆరాధన’’… ‘‘నాస్తిక రాజమౌళి క్షుద్రోపాసన’’…
నిజమేనా..? అలా ఉందా..? టీజర్ మొత్తం శ్రద్ధగా ఆరాధనగా చూశాను కానీ ఆ క్షుద్ర పూజల జాడలు ఏమీ లేవే అని ఆశ్చర్యపోకండి… ఓ చోట కనిపిస్తుంది ఓ అమ్మవారు… ఉగ్రదేవత… దశమహావిద్యల్లో ఒకరైన చిన్న మస్తా దేవి… వారిలో ఆరో అవతారం… తాంత్రిక దేవత…
Ads
ఆమె కనిపిస్తుంది టీజర్‌లో, ఓ సముద్ర అంతర్భాగంలో… తన తలను నరుక్కుని ఆ రక్తంతో ముగ్గురి ఆకలి తీరుస్తున్నట్టు… చిన్న మస్తాదేవి రూపం నిజంగా అలాగే ఉంటుంది… ఆ సీన్ కూడా అలాగే ఉంది… ఆమె కాళ్ల కింద రాక్షస, పిశాచ శక్తులు ఉంటాయి…

నిజానికి తాంత్రిక మార్గంలో అంటే వామాచార పద్ధతుల్లో పూజిస్తారు తప్ప వీళ్లు క్షుద్ర దేవతలు కారు, అవి క్షుద్ర పూజలు కూడా కావు… క్షుద్ర పూజలు అంటే చేతబడి, చిల్లంగి, బాణామతి, శాతవాలం వంటివి… అవి హాని చేయడానికి ఉద్దేశించి క్షుద్ర శక్తులను సాయం కోరే పూజలు…
దశ మహావిద్యలు అంటే… కాళీ, చిన మస్తా, తార మాతంగి, త్రిపుర సుందరి, భువనేశ్వరి, ధూమావతి, భైరవి, భగాళాముఖి, రాజశ్యామల… ఉగ్ర దేవతలు, గ్రామ దేవతలు, ఆదిపరాశక్తి స్వరూపాలు… చినమస్తాదేవిని రాజమౌళి కథలో ఎలా ఇరికిస్తాడో తెలియదు గానీ… ఆ టీజర్ చూడగానే వేణుస్వామి అందుకున్నాడు… ఏ సందర్భమైనా తను ఇట్టే పట్టేసుకుంటాడు కదా…

ఓ పెద్ద వీడియో పెట్టేసి… ఈ దశమహావిద్యల గురించి, ఈ తాంత్రిక ఆరాధన పద్దతులపై జనంలో పెద్ద అవగాహన లేదనీ, ‘పంచ మకార పూజాపద్ధతులు’ తెలియని నకిలీ వామాచార పూజారులు కూడా బయల్దేరారనీ, వాళ్లతో జాగ్రత్త అని చెబుతున్నాడు… క్రమేపీ తెలుగు సినిమా అటువైపు దృష్టి పెడుతోందని అంటున్నాడు… ‘‘ ఉదాహరణకు తమ్ముడు సినిమాలో కూడా ఓ ఉగ్రదేవత ప్రస్తావన ఉంది…
మిరాయి సినిమాలో భగాళాముఖిని నిలువరించే పాత్ర మంచు మనోజ్‌ది… ఆ షూటింగు మొదలయ్యాక ఏడాదిపాటు అనేక వివాదాలు, కుటుంబ సమస్యల్ని ఎదుర్కున్నాడు… చివరకు తెలుగు సినిమాకు మంచి విలన్ దొరికాడు అనిపించుకున్నాడు…
సో, భగాలాముఖి, చిన్న మస్త పూజలు చేసేవాళ్లు, వాళ్ల ప్రస్తావనలకు వెళ్లేవాళ్లు ఖచ్చితంగా వివాదాలకు గురవుతారు… కానీ ఆ వివాదాలు అంతిమంగా సంబంధిత వ్యక్తులను మంచి విజయాల్ని సాధిస్తారనీ, సో, రాజమౌళి కంట్రవర్సీలను ఎదుర్కోవడం తథ్యం, కానీ తనకేమీ నష్టం ఉండదు, చివరకు మరో 100 కోట్లు ఎక్కువ వసూళ్లే సాధిస్తాడు అని తేల్చిచెబుతున్నాడు వేణుస్వామి…
వాస్తవంగా… చాలామంది సెలబ్రిటీలు, నాయకులు ఈమధ్య దశమహా విద్యల పూజలు చేయిస్తున్నారు… కొందరు కామాఖ్య గుడికి వెళ్లి అక్కడ బలి నివేదనలతో పాటు రాజశ్యామల, చిన్న మస్తా, భగాళాముఖి పూజలు చేయిస్తున్నారు… అవునూ… నిజంగానే నాస్తిక రాజమౌళి కథలోకి శివుడు, రాముడితోపాటు ఈ చిన్న మస్తా ఎందుకొచ్చింది, ఎవరు ఎలా ఇరికించారు అనేది విస్మయకరమే…!!
Share this Article