Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !

August 24, 2026 by M S R

.

ఒక్క మాట పడదు.. వూ కేర్స్ అంటుంది! కంగనా అంటేనే ఓ టెంపర్‌మెంట్.. తాప్సీతో మళ్లీ పాత పంచాయితీ ఎందుకు?

కంగనా రనౌత్ పేరు చెబితే సినిమాల కంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆమె మాట. ఆ మాటకు ఉన్న పదును. ఆ మాట వెనుక ఉన్న తెగువ. అవతల ఎవరు ఉన్నారన్నది పట్టించుకోని ధోరణి. ఇటీవల తాప్సీ పన్నుతో మళ్లీ మొదలైన మాటల యుద్ధం కూడా అందుకు మరో ఉదాహరణే.

Ads

తాప్సీ ఒక ఇంటర్వ్యూలో కంగనాతో తనకు ఇప్పటివరకు వ్యక్తిగత పరిచయం కూడా లేదని, కంగనా గురించి తన అభిప్రాయం తన పెంపకం, తన ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పింది. మాటల్లో నేరుగా దూషణ లేకపోయినా.. కంగనాకు అందులో తన పెంపకం, తల్లిదండ్రుల ప్రస్తావన వినిపించింది.

అంతే… కంగనా ఆపలేదు. మళ్లీ ‘సస్తీ కాపీ’ అనే పాత బిరుదును బయటకు తీసింది. అంటే చీప్ ఇమిటేషన్ అని అర్థం… చవకబారు అని… తాప్సీ సినిమా ప్రమోషన్ కోసం తన పేరును వాడుకుంటోందని ఎద్దేవా చేసింది. అంతటితో ఆగకుండా తాప్సీ తల్లిదండ్రుల వరకూ వెళ్లే వ్యాఖ్యలు చేసింది. ఆ పోస్టులు తర్వాత తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇక్కడే అసలు కంగనా కథ మొదలవుతుంది.

కంగనా ఒక్క మాట పడదు! ఎవరైనా తనను విమర్శిస్తే.. “సరే, అది వారి అభిప్రాయం” అని వదిలేయడం కంగనా స్వభావం కాదు. ఎదురుదాడి చేయాలి. అదీ గట్టిగా చేయాలి. తనకు అన్యాయం జరిగిందనిపిస్తే మరింత గట్టిగా చేయాలి. అందుకే ఆమెపై అభిమానులకూ, విమర్శకులకూ ఒకే సమయంలో రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి.

ఒక వర్గానికి ఆమె సాహసి. ఎవరినీ చూసి భయపడదు. ఇండస్ట్రీలో పెద్దవాళ్లనైనా, రాజకీయ నాయకులనైనా, సెలబ్రిటీలనైనా ప్రశ్నించడానికి వెనుకాడదు. తనకు నచ్చినది మాట్లాడుతుంది. నచ్చనిది నచ్చలేదని చెబుతుంది.

మరో వర్గానికి మాత్రం అదే కంగనా అతిగా స్పందించే వ్యక్తి. వాదన ఒక అంశంతో మొదలై.. చివరకు వ్యక్తిగత జీవితాల మీదకు వెళ్లిపోవడం ఆమెపై తరచూ వచ్చే విమర్శ. ఇటీవలి పరిణామాలు చూస్తే ఆ రెండు అభిప్రాయాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

షర్మిలా ఠాగూర్‌తోనూ అదే కథ! ‘వందే మాతరం’పై సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ తన అభిప్రాయం చెప్పింది. కంగనా అంగీకరించలేదు. అంతే.. సోషల్ మీడియాలోకి వెళ్లి ఆమె అభిప్రాయాన్ని ప్రశ్నించింది. కళ, కవిత్వాన్ని కేవలం మతపరమైన కళ్లద్దాలతో చూడొద్దని చెప్పింది. “హిందూ–ముస్లిం మైండ్‌సెట్‌ నుంచి బయటకు రండి” అన్నంత వరకూ వెళ్లింది. ఇక్కడ కూడా కంగనా తీరు అదే. వ్యతిరేక అభిప్రాయం కనిపిస్తే నేరుగా ఢీకొనడం.

బాబా రాందేవ్‌తోనూ వెనక్కి తగ్గలేదు! Gen Zపై కంగనా చేసిన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ స్పందించాడు. దానికి కంగనా కూడా ఘాటుగానే తిరిగి సమాధానం ఇచ్చింది. రాందేవ్ వ్యక్తిగతంగా తన గతాన్ని ప్రస్తావించడంపై ఆమె మరింత తీవ్రంగా స్పందించింది. తాజాగా ఈ వివాదంపై ఇక మాట్లాడనని రాందేవ్ చెప్పాల్సి వచ్చింది.

అంటే.. కంగనాతో మాట పెట్టుకుంటే అది ఆ మాట దగ్గరే ఆగుతుందనే గ్యారంటీ లేదు! నడుస్తూనే ఉంటుంది… వదలదు… అదే ఆమె బలం కూడా. అదే ఆమె బలహీనత కూడా.

తాప్సీతో గొడవ మాత్రం కొత్తది కాదు … ఇద్దరి మధ్య ఈ పంచాయితీకి దాదాపు ఎనిమిదేళ్ల చరిత్ర ఉంది. 2019లో ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమా సమయంలో కంగనా సోదరి రంగోలి… తాప్సీని ఉద్దేశించి ‘సస్తీ కాపీ’ అని వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఆ తర్వాత నెపోటిజం చర్చల సమయంలో కంగనా తాప్సీ, స్వర భాస్కర్‌లను ‘బి-గ్రేడ్ నటీమణులు’ అంటూ విమర్శించడంతో వివాదం మరింత ముదిరింది.

ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ పదం అలాగే బతికే ఉంది. తాప్సీ మాట్లాడితే కంగనా స్పందిస్తుంది. కంగనా స్పందిస్తే తాప్సీ ఏదో ఒక రీతిలో కౌంటర్ ఇస్తుంది. ఇది ఇక వ్యక్తిగత పరిచయం ఉన్న ఇద్దరి గొడవ కూడా కాదు. తాజా తాప్సీ వ్యాఖ్య ప్రకారం ఇద్దరూ ఇప్పటివరకు వ్యక్తిగతంగా కలిసిన సందర్భమే లేదట!

అంటే.. కలవని ఇద్దరి మధ్య ఇంతకాలం గొడవ ఎలా బతికింది? అదే సోషల్ మీడియా కాలం ప్రత్యేకత.

కంగనాను అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క విషయం చాలు… ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. సినిమాల్లో ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కానీ ఏ రంగంలో ఉన్నా ఆమె ప్రవర్తనలో ఒకే రకమైన లక్షణం కనిపిస్తుంది. కమిట్ అయితే వెనక్కి తగ్గదు.

తాను నమ్మిన వాదన తప్పయినా సరే.. ముందుగా దానిని వదిలేయడం కంగనాకు అలవాటు కాదు. విమర్శలు వచ్చినా ఎదుర్కొంటుంది. ట్రోలింగ్ జరిగినా స్పందిస్తుంది. వివాదం పెద్దదైనా వెనక్కి తగ్గకుండా మరోసారి తన మాట చెబుతుంది. అందుకే ఆమెకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చింది.

“వూ కేర్స్!” ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న ధైర్యం. కానీ అదే సమయం … ఒక ప్రశ్న కూడా వస్తుంది. సాహసం అంటే ప్రతి మాటకు ఎదురుదాడి చేయడమేనా? వాదనలో గెలవడానికి అవతలి వ్యక్తి తల్లిదండ్రుల వరకు వెళ్లాల్సిన అవసరం ఉందా? అక్కడే కంగనా వ్యక్తిత్వంలోని అసలు వైరుధ్యం కనిపిస్తుంది.

ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ‘సస్తీ కాపీ’ పంచాయితీ ఇప్పటికీ ముగియకపోవడం చూస్తే ఒకటి మాత్రం అర్థమవుతోంది. బాలీవుడ్‌లో సినిమాలు పాతబడిపోవచ్చు.. గొడవలు మాత్రం రీ-రిలీజ్ అవుతూనే ఉంటాయి! కంగనా విషయంలో అయితే.. సీక్వెల్‌కు ఎప్పుడూ కొదవే లేదు…

అప్పట్లో ఠాక్రే ప్రభుత్వంతో పెట్టుకుంది… బాలీవుడ్ మాఫియాతో పెట్టుకుంది… మణికర్ణిక షూటింగ్ నుంచి దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ను మధ్యలోనే తరిమేసింది… ఎవరైనా సరే, ఇచ్చి పడేయడం ఆమె తత్వం!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిజమే అనసూయా… అసలే సోషల్ మీడియాలో బికినీల కాలమిది !!
  • కంగనా అంటే అంతే ! Who Cares అంటూ రోజుకొకరికి ఇచ్చి పడేస్తోంది !
  • ఓహో… వన్ గ్రామ్ ఫ్రీ ఉంగరంపై మేనమామ రూపం అట !
  • ఆమె ఆమే ! రంభను తీసుకొచ్చినా రీప్లేస్ చేయలేరు ! అదే జరిగింది !!
  • యశస్వి జైస్వాల్ కథ కంచికేనా ? మీడియాలో బోలెడన్ని తీర్పులు !!
  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions