.
Subramanyam Dogiparthi….. తరంగిణి . బహుశా ఈ పేరు మనకు తెలిసిన సర్కిల్లో ఏ అమ్మాయి పెట్టుకుని ఉండదేమో ! చాలా చక్కటి టైటిల్ . సినిమా ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతుందో ప్రారంభంలోనే తరంగిణి పాత్ర చేత దర్శకుడు చెప్పిస్తాడు . స్త్రీ ఎన్ని కష్టాలొచ్చినా , ఒడుదుడుకులు వచ్చినా ముందుకు సాగిపోతూ కడలి వంటి భర్తని చేరుకుంటుంది అనే సందేశం .
ఇదే సందేశాన్ని ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ అయిన తరంగిణీ తరంగిణీ ఏ ఒడిలో నీ జననం ఏ కడలికొ నీ పయనం పాటలోనే చెప్పేస్తారు . సి నారాయణరెడ్డి కలం నుండి ప్రవహించిన ఈ పాట తరంగిణి బాలసుబ్రమణ్యం గాత్ర కడలిని చేరుకొని అద్భుతంగా ప్రవహించింది .
Ads
స్త్రీ ఔన్నత్యాన్ని చాటే సినిమాలు చాలా వచ్చాయి . కీచకులను , రావణులను చాకచక్యంగా తప్పించుకుంటూ , మరీ తప్పనప్పుడు కాళికాదేవి అవతారం ఎత్తి తన ఔన్నత్యాన్ని చూపుతూ ఉంటుంది స్త్రీ .
అయితే ఈ సినిమా కధాంశం కాస్త విభిన్నంగా ఉంటుంది . ప్రేమించిన అమ్మాయి కోసం నానా తిప్పలు పడి పెళ్ళి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి తాను సంసార జీవితానికి పనికిరానని తెలుసుకుంటాడు హీరో . భార్యకు నిజం చెపుతాడు . భార్యాభర్తలు ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పరు . ఈలోపు హీరో స్నేహితుడు ఒకడు కీచక అవతారంలో ప్రత్యక్షమవుతాడు .
స్నేహితుడి భార్య మీద కన్నేస్తాడు గోరంత దీపంలో మోహన్ బాబులాగా . ఆ కీచకుడిని తప్పించుకుంటూ సాగుతూ ఉంటుంది తరంగిణి . కీచకుడు బ్లాక్ మెయిల్ చేసి తరంగిణిని రప్పించుకుంటాడు . కాళ్ళావేళ్ళా పడ్డా కరగని కీచకుడు తనంత తానే కిందపడి దేవి శూలానికి హతుడవుతాడు . ఈలోపు వైద్యం చేయించుకున్న కధానాయకుడు సంసార జీవితానికి అర్హుడు అవుతాడు . శుభం కార్డ్ పడుతుంది .
తరంగిణి లాగానే మలుపులు , వంపులు తోనే నడిపించాడు కోడి రామకృష్ణ . ఆయనకు ఇది రెండో సినిమా . సూపర్ హిట్ అయింది . హీరోయిన్ కష్టాలు పడే ఏ సినిమా అయినా మహిళా ప్రేక్షకులకు కళ్ళల్లో చెమ్మ తెప్పిస్తే సూపర్ హిట్ అవ్వాల్సిందే . నిర్మాత రాఘవకు కనక వర్షం కురిసింది . వంద రోజులు అడింది . ఏ సెంటరో తెలియదు కానీ ఒక సెంటర్లో 365 రోజులు ఆడిందని వికీపీడియా చెపుతుంది . అంత హిట్టయింది .
అప్పటికే తమిళంలో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన సుమన్ తెలుగులో నటించిన మొట్టమొదటి సినిమా . మంచి పేరే వచ్చింది . ఆ తర్వాత ఎన్నో తెలుగు సినిమాల్లో హీరోగా రాణించాడు . తరంగిణి అనగానే గుర్తు వచ్చేది శ్యామల గౌరే . శ్యామల గౌరి అంటే గుర్తు వచ్చేది తరంగిణి సినిమాయే . అంత పేరు తెచ్చుకుంది శ్యామల గౌరి . కీచక విలనుగా భానుచందర్ ఎంత బాగా నటించాడంటే వీలుంటే ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి వెళ్ళి తన్నే అంత .
ఈ సినిమాను ముందుకు నడిపించే పాత్రలో పరోపకారి పాపన్నగా గొల్లపూడి మారుతీరావుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యలో కీచక పాత్రను ఇచ్చిన కోడి రామకృష్ణ ఈ తరంగిణి సినిమాలో ప్రేక్షకులు మరచిపోలేని పాజిటివ్ పాత్రను ఇచ్చాడు .
సినిమాలో ప్రాముఖ్యత ఉన్న మరో పాత్ర పూర్ణిమది . మగవారికి X అనే నామదానం చేస్తుంది . తరంగిణి స్నేహితురాలు . బాగా నటించింది . ఇతర పాత్రల్లో పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , ప్రభృతులు నటించారు . చాలామంది జూనియర్ ఆర్టిస్టులు , ఔత్సాహికులు నటించారు .
జె వి రాఘవులు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . క్లైమాక్సులో వచ్చే రాములమ్మా రాములమ్మ అనే బుర్రకధ ఎఫెక్టివుగా ఉంటుంది . స్వయంవరం స్వయంవరం నా ప్రియ తరంగిణికి స్వయంవరం అనే పాటను నూతన గాయకుడు ప్రకాష్ బాగా పాడారు . పాట చిత్రీకరణ కూడా బాగుంటుంది . రధ సారధిగా గొల్లపూడి , అర్జునుడిలాగా సుమన్ల మీద ఉంటుందీ పాట .
మహారాజ రాజ శ్రీవారు మంచివారండి , ఒక దేవత ప్రేమ దేవత పోతపోసిన అనురాగమో , రాఘవేంద్రా నిన్ను అమోఘ సంగీత తరంగాల పాటలు శ్రావ్యంగా ఉంటాయి . పాటలన్నీ నారాయణరెడ్డి గారే వ్రాసారు .
It’s a feel-good message-oriented , woman-centeric hit movie . యూట్యూబులో ఉంది . మాతరంలో అందరూ చూసే ఉంటారు . ఇప్పటి తరంలో చూడని వారు చూసేయండి . చూడతగ్గ సినిమాయే .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article