అచ్చం మాల్దీవుల్లాగే… ఇండియా ఎంత సాయం చేసినా సరే, ఎంతగా సత్సంబంధాల్ని కోరుకున్నా సరే… మతం కోణంలో బంగ్లాదేశ్ ప్రజలు ఇండియా మీద విద్వేషాన్ని పెంచుకుని, విషాన్ని కక్కుతూనే ఉన్నారు… ఇప్పుడూ అంతే…
బంగ్లాదేశ్ విముక్తికి ముందు లక్షలాది మంది ఇండియాకు తరలివచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు… అందులో హిందువులున్నారు, ముస్లింలూ ఉన్నారు… ప్రపంచం అంతా వారిస్తున్నా సరే, అమెరికా వంటి అగ్రదేశం వ్యతిరేకించినా సరే అప్పట్లో ఇందిరాగాంధీ అపరకాళికలా ఉరిమి, బంగ్లాదేశ్‌కు విముక్తి ప్రసాదించింది…
అవసరం తీరింది కదా… తరువాత హిందువులపై అణిచివేత మొదలైంది అక్కడ… 1951లో హిందువుల జనాభా అక్కడ 22 శాతం… ఇప్పుడు 8 శాతం… హిందూ అమెరికన్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం… 1964 నుంచి 2013 నడుమ మతపరమైన హింస కారణంగా 11 మిలియన్ల మంది బంగ్లాదేశ్ నుంచి పారిపోయారు…
Ads
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత అల్లర్లకు కారణం ఆ ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయం… కానీ హింస మొదలయ్యాక అది క్రమేపీ హిందూ వ్యతిరేక ధోరణి తీసుకుంది… దేవాలయాలకు నిప్పు, హిందువుల వ్యాపార సంస్థలపై దాడులు తీవ్రమయ్యాయి… బంగ్లాదేశ్‌లోని డైలీ స్టార్ నివేదిక ప్రకారం, సోమవారం కనీసం 27 జిల్లాల్లో హిందువుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై గుంపులు దాడి చేశాయి…
బంగ్లాదేశ్‌లోని ఖుల్నా డివిజన్‌లో ఉన్న మెహెర్‌పూర్‌లోని ఇస్కాన్ దేవాలయం, కాళీ దేవాలయాన్ని ధ్వంసం చేసి తగులబెట్టారు… రంగ్‌పూర్ సిటీ కార్పొరేషన్ హిందూ కౌన్సిలర్ హత్యకు గురయ్యాడు… కాజల్ రాయ్ అనే మరో కౌన్సిలర్ కూడా హత్యకు గురైనట్లు సమాచారం…
బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ X పోస్ట్ ప్రకారం కనీసం 54 దాడులు జరిగాయి… ఇందిరాగాంధీ కల్చరల్ సెంటర్ కూడా వీటిలో ఒకటి… 2021లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా కూడా దాడులు జరిగాయి… షేక్ హసీనా బహిష్కరణతో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాత్-ఎ-ఇస్లామీ ప్రాబల్యం పెరిగి, హిందువుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు మారనుంది…
ఆ దేశం నుంచి హిందువులే కాదు, ముస్లింలూ భారీ సంఖ్యలో ఇండియాకు వస్తున్నారు అక్రమంగా… బెంగాల్‌లోని కొన్ని బంగ్లా సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే ముస్లిం జనాభా హిందూ జనాభాను మించిపోయిందనే వార్తలున్నాయి… మమత బెనర్జీ రండి, పర్లేదు అని పిలుపు ఇస్తూనే ఉంటుంది… మరోవైపు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎవరైనా హిందువులు వస్తే, పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిన సీఏఏను మాత్రం ఖండితంగా వ్యతిరేకిస్తుంది…
చివరకు ఇండియాలోని రాజకీయ పక్షాలు ఈ సమస్యను కూడా బీజేపీ, మోడీల కోణంలోనే చూస్తున్నాయి… అదీ విషాదం… అటు పంజాబ్, ఇటు బెంగాల్… రెండూ రాబోయే రోజుల్లో విషమ సమస్యల్ని తెచ్చిపెట్టే ప్రమాదాలు కనిపిస్తూనే ఉన్నాయి…! విదేశాంగ మంత్రి జైశంకర్ అధికార ప్రకటన కూడా బంగ్లాదేశ్ మైనారిటీల భద్రత మీద ఆందోళనను వ్యక్తం చేసింది..!!
Share this Article