పార్ధసారధి పోట్లూరి …….. భౌతికంగా జెలెన్స్కీ ని అంతం చేయడమే రష్యా మొదటి లక్ష్యం ! రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మీద డ్రోన్ దాడి జరిగింది నిన్న ! ఈ దాడి నేరుగా రష్యా అధ్యక్షుడిని హత్య చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని రష్యన్ మిలటరీ ఉన్నతాధికారి ప్రకటించాడు! ప్రతిగా రష్యన్ స్పెషల్ ఫోర్స్ కమాండోలు ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదోమిర్ జెలెన్స్కీ ని చంపడమే లక్ష్యంగా ఉక్రెయిన్ లోకి [రష్యా ఆక్రమిత ప్రాంతం ] లోకి ప్రవేశించాయి రహస్యంగా !
గత ఫిబ్రవరి 23, 2022 న స్పెషల్ ఆపరేషన్ పేరుతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం మొదలుపెట్టిన కొత్తల్లో కూడా రష్యన్ స్పెషల్ ఫోర్స్ కమాండోలు జెలెన్స్కీ ని చంపడమే లక్ష్యంగా ఉక్రెయిన్ లోకి ప్రవేశించారు అనే వార్తలు వచ్చినా ఎందుకో ఆ మిషన్ ని మధ్యలోనే ఉపసంహరించుకున్నాడు పుతిన్ !
అయితే జెలెన్స్కీ ని రష్యన్ స్పెషల్ ఫోర్స్ కమాండో లు చంపగలరా ?
Ads
చాలా కష్టమయిన మిషన్ అది రష్యాకి ! నిజానికి రష్యా ఉక్రెయిన్ ఒక్క దేశంతోనే యుద్ధం చేయట్లేదు ! వెస్ట్ యూరోపు దేశాలతోపాటు అమెరికాతో కూడా యుద్ధం చేస్తున్నది రష్యా.
ఇప్పటికే దాదాపుగా 100 మంది వెస్ట్ యూరోపు దేశాలతో పాటు కెనడా, అమెరికాకి చెందిన యుద్ధ వ్యూహకర్తలు ఉక్రెయిన్ లో ఉంటూ పరిస్థితులని బట్టి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఉక్రెయిన్ కమాండర్ల కి సూచనలు ఇస్తూ వస్తున్నారు. వీళ్ళు అందరూ ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్ లలోని ఆపరేషన్స్ లో పాల్గొన్న అనుభవం ఉన్నవాళ్లే !
అక్కడ రష్యాకి ఉన్న సమస్య ఏమిటంటే ఉక్రెయిన్ దగ్గర ఉన్న సోవియట్ కాలం నాటి ఆయుధాలతో పాటు యూరోపు మరియు అమెరికన్ ఆయుధాలని కలిపి రష్యాకి వ్యతిరేకంగా వాడుతున్నారు ! యుద్ధ టాంకులు, ఆర్టీలరీ గన్స్, ఆర్టీలరీ రాకెట్ లాంచర్స్ ఇలా కొన్ని యూరోపియన్ వి మరికొన్ని ఆమెరికావి ఉన్నాయి ఉక్రెయిన్ లో ఇప్పుడు.
కాబట్టి ఉక్రెయిన్ లో ఉన్న ఆయుధాల బలాలు, బలహీనతల గురుంచి రష్యన్ కమాండర్స్ కి అవగాహన తక్కువ. అందుకే 15 నెలలు గడుస్తున్నా కేవలం 20% భూమిని మాత్రమే తన అధీనంలోకి తీసుకోగలిగింది రష్యా ! తాను స్వాధీనం చేసుకున్న భూమిని కాపాడుకోవడానికే రష్యన్ దళాలు ముప్ప తిప్పలు పడుతున్నాయి.
క్రెమ్లిన్ మీద జరిగిన దాడికి ప్రతీకారంగా జలెన్స్కీ ని పట్టుకొని చంపగలదా రష్యన్ కమాండో దళం ?
కేవలం 20% శాతం మాత్రమే అవకాశాలు ఉన్నాయి ! జెలెస్కీ ని కాపాడుతున్నది నాటో దేశాల వ్యూహకర్తలు ! జెలెన్స్కీ ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఉక్రెయిన్ జెనెరల్స్ కూడా తెలియదు కానీ ఆదేశాలు వెళ్లిపోతున్నాయి ఏం చేయాలి ఎలా చేయాలి అని.
జెలెన్స్కీ చుట్టూ నాటో యుద్ధ వ్యూహకర్తలు మాత్రమే ఉంటారు ! శత్రువులని ఏమార్చడంలో నిష్ణాతులు వీళ్ళు. జెలెన్స్కీ వాడుతున్న శాటిలైట్ ఫోన్ ని ట్యాప్ చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు రష్యన్లు. 20 సెకన్ల కంటే ఎక్కువ సేపు శాటిలైట్ ఫోన్ ని వాడకుండా జాగ్రత్త పడుతున్నారు కాబట్టి లొకేషన్ ని పసిగట్టడం కష్టం రష్యన్ గూఢచార ఉపగ్రహాలకి ! రష్యన్లని తికమక పెట్టడానికి పదికి పైగా శాటిలైట్ ఫోన్లని మారుస్తూ వచ్చారు నాటో వ్యూహకర్తలు !
జెలెన్స్కీ మీద క్రూయిజ్ లేదా హైపర్ సానిక్ మిసైల్ తో దాడి చేసి చంపడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం అయ్యాయి. వాటిలో ఒక నిజ సంఘటన : 2022 లో [ఏ నెల,ఏ తేదీ అనేది తెలియరాలేదు ] రష్యా ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టిన రెండు నెలల తరువాత జెలెన్స్కీ ఉపయోగిస్తున్నట్లుగా భావిస్తున్న శాటిలైట్ ఫోన్ ని ట్యాప్ చేశారు రష్యన్లు. మాట్లాడుతున్నది జెలెన్స్కీ అని నిర్ధారించుకోవడానికి మూడు గంటలు పట్టింది. వెంటనే జెలెన్స్కీ ఎక్కడ నుండి అయితే శాటిలైట్ ఫోన్ ని వాడాడో ఖచ్చితంగా అదే ప్రదేశం మీద మిసైల్ దాడి జరిగింది. కానీ ఆ బిల్డింగ్ లో ఉన్నది ఒక సాధారణ సైనికుడు మాత్రమే అతను చనిపోయాడు! తన ఫోన్ ట్యాప్ అయింది అని అనుమానం వచ్చిన జెలెన్స్కీ అంగ రక్షకులలో ఒకరికి ఫోన్ ఇచ్చి, దానిని ఆ బిల్డింగ్ కి కాపలాగా ఉన్న సైనికుడికి ఇవ్వమని చెప్పి, అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయాడు జెలెన్స్కీ ! జెలెన్స్కీ అనుమానం నిజం అయ్యింది మూడు గంటల తరువాత జరిగిన మిసైల్ దాడితో !
రెండవ సంఘటన : జెలెన్స్కీ ఉన్న భవనం తాలూకు వివరాలు రష్యన్ ఇంటెలిజెన్స్ కి తెలిసి నిఘా పెట్టారు. ఆ భవనంలో జెలెన్స్కీ ఉన్నట్లు నిర్ధారించుకున్న తరువాత మిసైల్ దాడి జరిగింది, కానీ ఈసారి ఆ మిస్సైల్ నేరుగా ఒక యుద్ధ టాంక్ మీద పడి దానిని ధ్వంసం చేసింది. అందులో ప్రయాణిస్తున్న యుద్ధ టాంక్ సిబ్బంది అందరూ మరణించారు. ఇదెలా జరిగింది ? నిజానికి మొదట చెప్పుకున్న భవనంలో జెలెన్స్కీ లేడు ! అచ్చంగా జెలెన్స్కీ పోలికలు ఉన్న ఒక వ్యక్తికి జెలెన్స్కీ వేసుకునే సైనిక డ్రెస్ ని వేసి ఆ భవనం కిటికీ కి దగ్గర ఉండి శాటిలైట్ ఫోన్ మాట్లాడించారు దాదాపుగా 10 నిముషాల సేపు. తరువాత ఆ ఫోన్ ని యుద్ధ టాంక్ కమాండర్ కి ఇచ్చి అక్కడినుండి దూరంగా వెళ్లిపోమని చెప్పి నిరంతరం శాటిలైట్ ఫోన్ లో ఎవరో ఒకరి చేత ఆ యుద్ధ టాంక్ కమాండర్ తో మాట్లాడించారు. ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా GPS కొ ఆర్డినెట్ ని మిసైల్ లో పొందుపరిచి ప్రయోగించారు రష్యన్లు. అది వేగంగా వెళుతున్న యుద్ధ టాంక్ మీద పడి పేలిపోయింది ! అప్పటి నుండి శాటిలైట్ ఫోన్ల ని వాడడం మానేశాడు జెలెన్స్కీ !
ఇదేమీ కొత్త టెక్నిక్ కాదు ! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ తన స్వంత జెనెరల్స్ తనకి వ్యతిరేకంగా పని చేస్తున్నారని తెలుసుకొని తన లాగా ఉండేవాళ్ళని 10 మందిని నియమించుకొని అచ్చం హిట్లర్ లాంటి వేష ధారణలో వివిధ ప్రదేశాలలో నియమించాడు ! ఎవరు నిజమయిన హిట్లర్ అనేది కనుక్కోవడం చాలా కష్టమయ్యేది అప్పట్లో. మొత్తం మూడుసార్లు హిట్లర్ మీద హత్యా యత్నాలు జరిగాయి. మూడు కూడా తన స్వంత జెనెరల్స్ ప్లాన్ చేసినవే కానీ రెండింటిలో డూప్లికేట్ హిట్లర్ లు మరణించగా, ఒక ప్రయత్నంలో అసలయిన హిట్లర్ తృటిలో చావు నుండి తప్పించుకున్నాడు. అయితే తన మీద హత్యా యత్నానికి ప్రయత్నించిన జెనెరల్స్ అందరినీ కాల్చి చంపించాడు హిట్లర్. తనతో నిత్యం మాట్లాడే జెనెరల్స్ కూడా తాము మాట్లాడుతున్నది డూప్లికేట్ హిట్లర్ అని తెలుసుకోలేక పోయారు అంటే హిట్లర్ ఎంత జాగ్రత్తగా ఉండేవాడో అర్ధం చేసుకోవచ్చు. అప్పట్లో మిలటరీ కమ్యునికేషన్ కోసం లాండ్ లైన్ ఫోన్ మరియు వైర్లెస్ మీద ఆధారపడేవారు కానీ హిట్లర్ కోసం విడిగా ఒక టెలీఫోన్ ఎక్స్చేంజ్ లు ఉండేవి.
మరి తన కమాండర్ల కి ఎక్కడి నుండి ఆదేశాలు ఇస్తూ వస్తున్నాడు ? ఎక్కువ కాలం ఉక్రెయిన్ కి పక్కనే ఉన్న పోలాండ్ నుండి కానీ లేకపోతే జర్మనీ వెళ్ళి అక్కడనుండి తన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. పోలాండ్ మీద కానీ జర్మనీ మీద కాని పుతిన్ దాడి చేయమని ఆదేశాలు ఇవ్వలేడు ! అదే ఉక్రెయిన్ లో ఉండాల్సి వస్తే రాజధాని కీవ్ నగరంలోని ఏదో ఒక చిన్న ఇంట్లో ఉండి ఆదేశాలు ఇస్తున్నాడు తప్పితే కీవ్ లోని అధ్యక్ష భవనంలోకి అసలు వెళ్ళట్లేదు !
అసలు సమస్య మిలటరీ ఇంటెలిజెన్స్ వైఫల్యం !
మొదటి నుండి మిలటరీ ఇంటెలిజెన్స్ విషయంలో రష్యా వైఫల్యం చెందింది ! మిలటరీ ఇంటెలిజెన్స్ కనుక పటిష్టంగా ఉండి ఉంటే యుద్ధం ఇన్ని నెలలు జరిగేదే కాదు ! ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. అదేమిటంటే ఉక్రెయిన్ పౌరులు ఎవరూ కూడా డబ్బుకి అమ్ముడుపోయి తమ దేశ సైన్య రహస్యాలని రష్యాకి అమ్ముకోవడానికి సిద్ధంగా లేరు. కనుకనే రష్యా తన ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోలేక పోయింది. ఇక ఉక్రెయిన్ లో ఉంటున్న బెలారస్ పౌరులని తనవైపు తిప్పుకొని సమాచారం రాబట్టాలని రష్యన్ ఇంటెలిజెన్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు లొంగలేదు. దాదాపుగా 1500 మంది బెలారస్ పౌరులు ఉక్రెయిన్ లో ఇంకా ఉన్నారు. ఇదే పుతిన్ వైఫల్యానికి ప్రధాన కారణం. అంతే కాదు ఉక్రెయిన్ లో ఉంటున్న 1500 మంది బెలారస్ పౌరులు సైనిక శిక్షణ తీసుకొని రష్యన్ దళాలకి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో రష్యా జెలెన్స్కీ ని ఎలా కనిపెట్టగలుగుతుంది ?
రష్యా అధ్యక్ష నివాసం మీద రెండు డ్రోన్లు ఎటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్ వాటిని కూల్చివేసింది కాబట్టి ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. కానీ దీని మీద ప్రతి చర్య తీసుకునే హక్కుని రష్యా వాడుకుంటుంది అంటూ రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ అయిన దిమిత్రి మెద్వదేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అంటే దీనర్ధం నేరుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఉన్న అధ్యక్ష భవనం మీద దాడి చేస్తాము అని పరోక్షంగా హెచ్చరించినట్లుగా ఉంది.
అయితే దీని మీద స్పందిస్తూ జెలెన్స్కీ మా దగ్గర మాస్కో దాకా వెళ్ళి దాడి చేయగల డ్రోన్లు లేవు. ఆ అవసరం కూడా మాకు లేదు. మేము మా భూభాగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నాము తప్పితే నేరుగా పుతిన్ మీద దాడి చేసేంత శక్తి లేదు అని పేర్కొన్నాడు.
మరో వైపు సుదూర ప్రాంతాలకి వెళ్ళి ఆకాశం నుండి దాడి చేయగల రష్యన్ బాంబర్ Tu-95 ని ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఒక వైపు క్రూయిజ్ మిస్సైళ్ళు మరో వైపు Tu -95 బాంబర్ల తో ఏకకాలంలో దాడి చేసి కీవ్ లోని అధ్యక్ష భవనాలని ధ్వంసం చేసే ఆలోచనలో పుతిన్ ఉన్నట్లుగా తెలుస్తున్నది.
బహుశా ఈసారి దాడిలో RRR సినిమాలోని ‘నాటు నాటు ‘ పాట చిత్రీకరించిన భవనం కూడా నాశనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఆ భవనాన్ని ఆ పాటలో చూసుకోవాల్సిందే !
Share this Article