Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!

October 26, 2025 by M S R

.

ఈమధ్య ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, చేస్తున్నారు… చదవడానికి ఓ ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లర్‌గా ఉంది… అందులో నిజానిజాలేమిటో, సందేహాలేమిటో తరువాత చెప్పుకుందాం గానీ… ముందు ఈ కథ చదవండి… పుతిన్ మోడీని ఓ కుట్ర నుంచి కాపాడాడు అనేది సారాంశం…


అంతర్జాతీయ దౌత్య చరిత్రలో కొన్ని సంఘటనలు మౌనంగానే ఉండిపోతాయి, కానీ అవి చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేస్తాయి. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా… పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి, తన ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ లిమౌజిన్ ‘ఆరస్’లో కలిసి ప్రయాణించమని అడిగారు…

Ads

పుతిన్ తన కారులోంచి దిగకుండా, ప్రధాని మోడీ కోసం ఓ హోటల్ వెలుపల ఏకంగా 15 నిమిషాలు వేచి ఉన్నాడు… ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్‌కు విరుద్ధం, అత్యవసర పరిస్థితిని సూచించింది… పుతిన్ కారు దాదాపు అరగంట పాటు హోటల్ పరిసరాల్లో రహస్యంగా చక్కర్లు కొట్టింది…

ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు… భద్రతా వలయాన్ని ఛేదించి, అత్యంత గోప్య సమాచారాన్ని మోడీకి అందించడానికి చేసిన వ్యూహాత్మక విన్యాసం అది! ఆ అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ తీవ్రత, ఇద్దరు నాయకుల ముఖాల్లో కనిపించిన లోతైన, ఆలోచనాత్మకమైన గాంభీర్యం …

ఆ అత్యవసర రహస్య భేటీ అనంతరం ప్రధాని మోడీ తిరిగి తన హోటల్‌కు వెళ్లలేదు. ఇది ఆయన పర్యటన ప్రణాళికలో ఊహించని మార్పు. ఆయన తిరిగి హోటల్‌కు వెళ్లకపోవడం అనేది, తనకు అందిన హెచ్చరికను తీవ్రంగా పరిగణించి, భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలిక నివాసాన్ని మార్చుకున్నట్లు స్పష్టం చేసింది…

ఆ మరుసటి రోజు ఒక గోష్ఠిలో ప్రధాని మోడీ పలికిన వాక్యం — “మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు…
నా నిష్క్రమణ కోసమా? లేక సురక్షితంగా తిరిగి వచ్చినందుకా?” ఇది ఒక సాధారణ వాక్యం కాదు… మృత్యుముఖం నుంచి తప్పించుకుని వచ్చిన ఒక నాయకుడి ఆత్మవిశ్వాసాన్ని, శత్రువులకు పరోక్షంగా ఇచ్చిన వ్యూహాత్మక సమాధానాన్ని సూచించింది…

చీకటి లింక్: ఢాకాలో ఒక హత్య కథ, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. ఢాకాలోని ఒక ప్రముఖ హోటల్‌లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ సీనియర్ అధికారి ఒకరు అనుమానాస్పద స్థితిలో మరణించారు.  స్థానిక పోలీసులు చేరుకోవడానికి ముందే, అమెరికన్ రాయబార కార్యాలయం అధికారులు హడావుడిగా అక్కడకు చేరుకుని, మృతదేహాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు.

పోస్ట్‌మార్టమ్ లేకుండా, ఎలాంటి బహిరంగ విచారణ లేకుండా ఈ కేసును ముగించారు. ఇంత వేగం, ఇంత గోప్యత ఎందుకు పాటించారు? ఈ ఢాకా సంఘటనకు, చైనాలో జరిగిన సంఘటనకు ఏదో నిశ్శబ్ద సంబంధం ఉందనే అనుమానాలను రేకెత్తించింది.

ది ఫైనల్ ప్లాట్:  SCO సదస్సును చైనా నిర్వహించింది. ఒకవేళ ప్రధానికి ఏదైనా హాని జరిగితే, నింద చైనాపై పడి, కుట్రదారులు ఈ ప్రాంతంలో రాజకీయ అస్థిరతను సృష్టించవచ్చు… 1966లో తాష్కెంట్‌లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఛాయను ఈ సంఘటన ప్రతిబింబించింది. ఆ నింద ఇప్పటికీ రష్యాపై ఉంది…

ఇది CIA, కొన్ని పాశ్చాత్య శక్తులు భారత నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు పన్నిన ‘తాష్కెంట్-2’ అనే రహస్య ప్రణాళిక అని గుసగుసలు వినిపించాయి… అయితే, రష్యా FSB (మాజీ KGB) భారతదేశం RAW నిఘా సంస్థలు అత్యంత సమన్వయంతో పనిచేసి, ఈ మారణహోమాన్ని సమర్థవంతంగా అడ్డుకున్నాయి…

పుతిన్ ఆ అసాధారణ కారు ప్రయాణం కేవలం మర్యాద కాదు. అది భారతదేశ నాయకత్వాన్ని రక్షించడానికి రష్యా వేసిన అత్యంత వ్యూహాత్మక భద్రతా కవచం. ఈ సంఘటన భారత్-రష్యా మధ్య ఉన్న అచంచలమైన విశ్వాస బంధాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది….



ఇదండీ కథ… అడ్డదిడ్డంగా ఉందా..? అర్థం కాలేదా..? ఏమీ లేదు… మోడీ హత్యకు ఏదో కుట్ర జరిగితే, స్వయంగా పుతిన్ రంగంలోకి దిగి (తను గతంలో కేజీబీ గూఢచారి కదా) ఆ కుట్రను ఛేదించి మోడీని రక్షించాడు అని మొత్తం కథ సారాంశం…

అవును, మీ మరో అనుమానం అర్థమైంది… అడ్డదిడ్డంగా పేర్చిన పదాలు, వాక్యాలు, కంటెంటు చదువుతుంటేనే ఇది వాట్సప్ యూనివర్శిటీ కథం అని కదా మీ సందేహం…

ఎన్నిరకాలుగా సెర్చినా… ఈ సంఘటన తాలూకు వార్త గానీ, కనీసం ఇది జరిగిందీ అని చెప్పగల హింట్స్ గానీ దొరకలేదు, దొరకవు కూడా… ప్రామాణికమైన జర్నలిజం కంటే ఎక్కువగా గూఢచార ఫిక్షన్ (Spy Fiction) ఇది…

ఇది రాసింది మీరా శర్మ అని పోస్టుల్లో చెబుతున్నారు… కానీ ఈ పేరుతో ప్రచురించబడిన ఈ కథనం గానీ, సదరు జర్నలిస్టు ఎవరో గానీ ఎక్కడా జాడాపత్తా దొరకడం లేదు…  ఇంత తీవ్రమైన ఆరోపణలు ఉన్న కథనాలను ప్రముఖ ప్రచురణ సంస్థలు లేదా గుర్తింపు పొందిన విశ్లేషకులు మాత్రమే ప్రచురిస్తారు…

SCO సదస్సుల్లో ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ కలుసుకోవడం సర్వసాధారణం… అయితే, పుతిన్ మోడీ కోసం 15 నిమిషాలు వేచి ఉండటం లేదా తన ‘ఆరస్’ లిమౌజిన్‌లో రహస్యంగా ప్రయాణించడం అనేది అద్భుతమైన కల్పన… అదే జరిగితే అంతర్జాతీయ మీడియా ఇట్టే పట్టేసేది… రష్యా అధ్యక్షుడి కారు హోటల్ చుట్టూ చక్కర్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు…

“మీరు చప్పట్లు దేనికోసం కొడుతున్నారు…”  ప్రధాని మోడీ ఒక గోష్ఠిలో ఈ వాక్యం చెప్పినట్లు కథనంలో ఉంది… SCO సదస్సుల నేపథ్యంలో ఆయన చేసిన ప్రసంగాలలో ఈ నిర్దిష్టమైన, నాటకీయమైన వాక్యం చెప్పినట్లు ధృవీకరించబడలేదు…

ఒక నాయకుడి భద్రతకు ముప్పు కలిగితే, దాన్ని బహిరంగంగా ఒక “కోడ్ వర్డ్” రూపంలో చెప్పడం అనేది నిఘా వ్యూహాలకు విరుద్ధం… ఇది కేవలం కథనంలో నాటకీయతను పెంచడానికి చేర్చిన అంశం…

అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి ఢాకాలో అనుమానాస్పదంగా మరణించడం, ఆ మృతదేహాన్ని అమెరికన్ రాయబార కార్యాలయం హడావుడిగా స్వాధీనం చేసుకోవడం అనేది చైనాలో జరిగిన సంఘటనకు లింక్ చేస్తూ చెప్పడం కేవలం ఒక కుట్ర సిద్ధాంతం (Conspiracy Theory) మాత్రమే…

ఢాకాలో అలాంటి కీలకమైన దౌత్య/నిఘా అధికారి మరణం గురించి వార్తలు వచ్చి ఉంటే, అది బంగ్లాదేశ్, అమెరికా , భారతదేశ మీడియాలో సంచలనం సృష్టించి ఉండేది…

లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక CIA పాత్ర గురించి కుట్ర సిద్ధాంతాలు (Conspiracy Theories) దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్నాయి. ఈ కథనం అదే భావనను మోడీకి ఆపాదించడం ద్వారా భావోద్వేగాన్ని, నాటకీయతను పెంచే ప్రయత్నం మాత్రమే…

అన్నింటికీ మించి ఈ కథనాలకు జోడిస్తున్న ఫోటోలో మోడీ, పుతిన్ ఓ కారులో కూర్చున్నట్టు కనిపిస్తోంది… నిజంగానే అది పుతిన్ బాపతు అత్యంత సీక్రెట్ ఆపరేషన్ అయితే ప్రపంచంలో ఎవ్వడికైనా ఆ ఫోటో తీయడం సాధ్యమేనా..? పైగా ఆ ఫోటోలో ఎవడో అమెరికన్ ఆర్మీ పర్సన్ అని మరో జోడింపు…

ఇది అత్యంత గోప్యమైన నిఘా సమాచారం లేదా దౌత్య రహస్యం అయినట్లయితే, అది బహిరంగ చర్చకు రావడం లేదా ధృవీకరించబడటం అసాధ్యం. కానీ, ఈ కథనంలోని అంశాలు (ఉదా: 15 నిమిషాల నిరీక్షణ, కోడ్ వర్డ్, ఢాకా హత్య) చాలా నాటకీయం, అతిశయోక్తి…!!

(ట్రంపు మోడీని అమెరికాకు ఆహ్వానించడం, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో భేటీ వేయించాలని అనుకోవడం, తద్వారా మోడీ పొలిటికల్ కెరీర్‌ను ముగించాలని కుట్ర పన్నడం, గత జూన్‌లో కెనడా జీ7 సదస్సు నుంచి మోడీ హఠాత్తుగా నిష్క్రమించడం వంటి మరికొన్ని కథనాలు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు, అవీ పైన చెప్పిన తాష్కెంట్ కథనాలే…) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎస్… రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ, మద్దతు ఇవ్వకపోతే… మొదటికే మోసం.,.!!
  • దమ్మున్న జర్నలిస్టు అంటే..? సీఐఏకే చుక్కలు చూపించిన ఈ కేరక్టర్..!!
  • ఒక మంచి ప్రేమకథ… కథలో లీనమైతే కళ్లు తడిపేసే ‘ప్రేమకథ’…
  • తాష్కెంట్-2… ఓ విఫల కుట్ర… నిజంగా మోడీని పుతిన్ రక్షించాడా..?!
  • శంఖు పుష్పం..! అందం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం… వ్యాపారం..!!
  • పదండి పోదాం, పదండి తోసుకు… పోదాం పోదాం వెనక్కి వెనక్కి…!!
  • ప్రపంచ టాప్-3 సైంటిస్టుల జాబితాలో… వరుసగా మూడేళ్లూ స్థానం…
  • అసలే వాడు ట్రంపులమారి… మన రోతను అక్కడా వ్యాప్తి చేయకండి…
  • ఐదుగురు సీఎంలకు పట్టని ఓ మానవతాసాయం… రేవంత్ నెరవేర్చాడు..!!
  • భేష్ కేరళ సర్కార్..! పిచ్చి ఉచిత పథకాలు కాదు… ఇదీ నిజమైన తోడ్పాటు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions