.
విడాకులు పెరుగుతున్నాయి… వేగంగానే… ఏమాత్రం శృతితప్పినా సరే వెంటనే విడాకులకు వెళ్లిపోతున్నాయి జంటలు… పెళ్లయిన ఏడాదిలోపే కోర్టుకెక్కుతున్న జంటలూ బోలెడు…
ఇంకా పెరుగుతాయి… సంయమనం, సర్దుబాటు, రాజీ వంటివి ప్రస్తుత తరంలో తక్కువ కాబట్టి..! ఐతే చాలాచోట్ల అడ్డగోలు భరణాల డిమాండ్లతో విడాకుల కేసులు సత్వర పరిష్కారానికి నోచుకోవడం లేదు… అసలు ఈ భరణాల గొడవలతో ఆత్మహత్యలు చేసుకున్న భర్తలూ ఉన్నారు…
Ads
తనూ సంపాదిస్తోంది కదా, భరణం ఎందుకివ్వాలనే భావన పురుషుల్లో కూడా పెరుగుతోంది… ఫ్యామిలీ కోర్టుల్లో కూడా ఈ భరణాల తంపులే ఎక్కువ… అసలు భరణం ఎలా లెక్కిస్తారు అనేదీ ఓ ఆసక్తికర అంశమే… సరే, భర్త ఏదో భరణానికి అంగీకరిస్తాడు, సరే, కానీ దానిపైనా ట్యాక్స్ ఉంటుందా..? ఈ ప్రశ్న మరో ఇంట్రస్టింగు అంశం…
ఏదో ఇంగ్లిషు సైటులో కనిపించింది… బాగుంది… దాని రఫ్ తెలుగు అనువాదం ఏమిటంటే..?
విడాకులు భావోద్వేగాలు, బంధాలు, వీడ్కోళ్లు, తెగతెంపులకు సంబంధించిన అంశమే కాదు… ఇందులో ఆర్థికపరమైన అంశాలూ, చిక్కులు బోలెడు… భారతదేశంలో, విడాకుల ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశం అలీమోనీ.., దాన్ని ఎలా లెక్కిస్తారు, అది పన్ను పరిధిలోకి వస్తుందా అని అర్థం చేసుకోవడం కూడా అవసరమే…
అలీమోనీ అనేది విడాకుల తర్వాత ఒక జీవిత భాగస్వామికి తన పోషణ కోసం విడిపోయే భాగస్వామి ఇచ్చే సహాయం… సాధారణంగా, విడాకుల తర్వాత ఒక జీవిత భాగస్వామికి తమను తాము పోషించుకోవడానికి సరైన ఉపాధి, ఆదాయమార్గాలు గనుక లేకపోతే, చట్టం ప్రకారం మరొక భాగస్వామి అలీమోనీ అందించాలని కోర్టు ఆదేశిస్తుంది…
అలీమోనీకి అర్హత ఎవరికి?
హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 25 ప్రకారం, కోర్టు శాశ్వత అలీమోనీని భార్యకు లేదా భర్తకు వారి జీవిత పోషణ కోసం మంజూరు చేయవచ్చు. భార్య ఉద్యోగం చేస్తున్నా సరే, ఆమెకూ ఆమె జీవిత భాగస్వామికీ మధ్య గణనీయమైన ఆదాయ వ్యత్యాసం ఉంటే, ఆమె అదే జీవన ప్రమాణాన్ని కొనసాగించడానికి అలీమోనీ పొందుతుంది.
భార్యకు ఆదాయం లేకపోతే, కోర్టు ఆమె వయస్సు, విద్య, సంపాదించే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అలీమోనీ మొత్తాన్ని నిర్ణయిస్తుంది. భర్త వికలాంగుడై ఆదాయం సంపాదించలేని స్థితిలో ఉండి, భార్య ఆదాయం సంపాదిస్తుంటే, అతనికి అలీమోనీ మంజూరు చేయబడవచ్చు.
అలీమోనీ ఒకేసారి గంపగుత్తా చెల్లింపుగా లేదా నెలవారీ కిస్తీల రూపంలో ఉండవచ్చు. 1961 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, అలీమోనీ ఆదాయంగా వర్గీకరించబడదు. ఇది సాధారణంగా వివాహం యొక్క చట్టపరమైన విచ్ఛిన్నం తర్వాత ఆదాయం లేని జీవిత భాగస్వామికి ఆదాయం సంపాదించే జీవిత భాగస్వామి ద్వారా అందించబడే సాయం మాత్రమే…
అలీమోనీ పన్ను విధానం
అలీమోనీ పన్ను విధానం చెల్లింపు పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. విడాకుల తర్వాత ఒకేసారి ఏకమొత్తంలో చెల్లించినట్లయితే, అది కేపిటల్ గెయిన్‌గా పరిగణించబడుతుంది, పన్ను రహితంగా ఉంటుంది. నెలవారీ కిస్తీల రూపంలో చెల్లించినట్లయితే, అది ఆదాయంగా వర్గీకరించబడుతుంది, పన్ను పరిధిలోకి వస్తుంది. అలీమోనీ పొందే వ్యక్తి తమ ఆదాయ స్లాబ్ ఆధారంగా పొందిన మొత్తంపై పన్ను చెల్లించాలి. ముఖ్యంగా, అలీమోనీ చెల్లించే వ్యక్తి తను చెల్లించిన అలీమోనీపై పన్ను మినహాయింపును పొందలేరు…
Share this Article